లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ఉద్దేశించిన పోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) చట్టం ప్రకారం అరెస్టైన ఓ నిందితుడికి బాంబే హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. 14 ఏళ్ల బాలిక గతంలో వ్యవహరించిన తీరు ఆమె మానసిక పరిపక్వత కలిగి ఉందన్న విషయాలను స్పష్టం చేస్తోందంటూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ముంబై: ‘‘ఈ కేసు విచారణలో భాగంగా బాధితురాలికి లైంగిక చర్యల స్వభావం, అందుకు దారి తీసే పరిస్థితులు, తదనంతర పరిణామాలను అర్థం చేసుకోగల మానసిక పరిపక్వత ఉందని భావిస్తున్నాను. ఇవన్నీ తెలిసే ఆమె ఇందుకు అంగీకరించినట్లు భావించాల్సి వస్తోంది’’అంటూ బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ షిండే సోమవారం(జూలై 13) కీలక వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి బెయిలు మంజూరు చేస్తున్న సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. గతంలో బాధితురాలు వ్యవహరించిన తీరు చూస్తుంటే పరస్పర అంగీకారంతోనే లైంగిక చర్య జరిగి ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి నిందితుడికి బెయిలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. బాధితురాలు సవతి తల్లితో పాటు ముంబైలో నివసించేంది. ఆమె పెట్టే చిత్రహింసలు భరించలేక గొడవ పెట్టుకుని ఇల్లు విడిచి వెళ్లిపోయింది.
ఈ క్రమంలో జూన్ 14, 2019న తన కూతురు కనిపించడం లేదంటూ బాధితురాలి సవతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా.. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత బాధితురాలు దిక్కుతోచక రోడ్ల వెంబడి తిరిగింది. అనంతరం ముంబై సబ్‌అర్బన్ రైలులో రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. అక్కడి నుంచి చెన్నైకి చేరుకుంది. ఆ తర్వాత మళ్లీ ముంబైకి తిరిగివచ్చింది. ఈ క్రమంలో తనపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి వాంగ్మూలం మేరకు జూలై 10, 2019లో పోలీసులు వివాహితుడైన ధ్యానేశ్వర్ నవ్‌ఘరే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో సోమవారం ధ్యానేశ్వర్‌కు బెయిలు మంజూరు చేస్తున్న సందర్భంగా ఈ విషయాలను ప్రస్తావించిన జస్టిస్ షిండే.. మైనర్ అయిన బాధితురాలికి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగల మానసిక పరిపక్వత ఉందని భావిస్తున్నానన్నారు. బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం... ఆమె ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి. కానీ తన పేరు, మతం మార్చుకుంది. అంతేకాదు సొంతంగా ఇల్లు విడిచి వెళ్లిపోయింది. చెన్నై నుంచి ఇద్దరు అపరిచిత వ్యక్తులతో ముంబైకి తిరిగి వచ్చింది. ఇక్కడికి చేరుకున్న తర్వాత హుసేన్ అనే వ్యక్తిని కలిసింది. అతడితో ఆమెకు లైంగికపరమైన సంబంధం ఉంది. ఈ వ్యవహారాన్ని గమనించిన కొంతమంది బాటసారులు ఆమెను ములుంద్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించగా.. మరో అపరిచిత వ్యక్తిని తన కుటుంబ సభ్యునిగా పేర్కొంటూ అతడితో పాటు వెళ్లిపోయింది.
ఇవన్నీ గమనిస్తుంటే బాధితురాలి అంగీకారంతోనే లైంగిక చర్య జరిగి ఉందనే భావన స్ఫురిస్తోంది’’అని పేర్కొన్నారు. ఈ క్రమంలో రూ. 30 వేల వ్యక్తిగత పూచీకత్తు మీద ధ్యానేశ్వర్‌కు బాంబే హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలోనూ అత్యాచార బాధితురాలి ప్రియుడిగా భావిస్తున్న 25 ఏళ్ల వ్యక్తికి హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. మైనర్ అయిన బాలిక తన ఇష్టప్రకారమే అతడితో వెళ్లాలని చెప్పడంతో జస్టిస్ షిండే అప్పుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment