
‘కమల్ ఓ బోన్‌లెస్.. స్వామి బాగా రూడ్’
చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఉండేది చెన్నైలోనే. వారి ఇళ్ల మధ్య దూరం మూడు కిలో మీటర్లే. కానీ, ఇప్పుడు మాత్రం వారి మధ్య వైరుధ్యాలు పక్కపక్కనే కలిసి ముందుకెళుతున్నాయి. తమిళనాడు రాజకీయ పరిణామాల పుణ్యమా అని వారిద్దరి మధ్య వర్డ్ష్ వార్(మాటల యుద్ధం) నడుస్తోంది. కమల్‌ను తక్కువ చేస్తూ స్వామి ట్వీట్ చేసిన క్షణంలోనే కమల్ కూడా అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. దాదాపు పచ్చగడ్డివేస్తే భగ్గుమన్న తీరుగా వీరి వ్యవహారం ట్విట్టర్‌లో దర్శనం ఇస్తోంది.
అసలు వీరిద్దరి మధ్య గొడవెలా వచ్చిందంటే ఓ ట్విట్టర్ ఖాతాదారుడు సుబ్రహ్మణ్యస్వామిని ప్రశ్నిస్తూ కమల్ తమిళనాడు రాజకీయాల్లోకి వస్తే ఆ పరిణామాన్ని బీజేపీ ఆహ్వానిస్తుందా అని అడగగా బీజేపీ సంగతి తెలియదుగానీ, తాను మాత్రం వ్యతిరేకిస్తానని చెప్పారు. బోన్‌లెస్ వండర్, డంబాలకు పోయే ఇడియట్ కమల్ అంటూ ట్వీట్ చేశారు.
దీనికి ఆగ్రహించిన కమల్ వెంటనే బదులు ట్వీట్ చేశారు. తనకు ఒక అంశంపై మొండిగా పోరాడే తత్వం ఉందని, అది మాత్రం చాలు. సంతోషం.. సుబ్రహ్మణ్యస్వామి తమిళులను ఎలా పిలుస్తారో ఆయనకు తెలుసు. నేనెప్పుడు ఆయనను వ్యతిరేకించను.. ప్రజలే ఆ పనిచేస్తారు. స్వామి ఓ కరడు వ్యక్తిత్వం ఉన్నవ్యక్తి. ఆయనకు నేను బదులచెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ కమల్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.