ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలి | Bowled! Google CEO Sundar Pichai plays cricket at India Gate | Sakshi
Sakshi News home page

ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలి

Published Fri, Dec 18 2015 12:26 AM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM

ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలి

ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలి

భారత్‌లో టీకొట్టులోనూ ఓ వ్యాపారవేత్త కనిపిస్తాడు
* మా సేవలను మొదట భారత్‌లోనే ప్రారంభిస్తాం
* గూగుల్ వెళ్లినప్పుడు టాఫీల దుకాణానికి వెళ్లిన అనుభూతి కలిగింది
* ఢిల్లీ విద్యార్థులతో ముచ్చటించిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

న్యూఢిల్లీ: గూగుల్ ఎప్పుడూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని, తాము చూపించే పరిష్కారం కోట్లాది ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడుతుందనేదే ప్రధానంగా ఆలోచిస్తామని ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు.

అపజయానికి ఎప్పుడూ కుంగిపోకూడదని, ఓటమి నుంచే పాఠాలు నేర్చుకోవాలని గురువారం ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి అన్నారు. సిలికాన్ వ్యాలీలో ఫెయిల్యూర్స్‌ను గౌరవానికి గుర్తుగా భావిస్తారని చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. భారత్‌లో ఈ తరం వారు రిస్క్ తీసుకోవటానికి తక్కువ భయపడుతున్నారని పేర్కొన్నారు.

ఈ దేశంలో ఓ టీ దుకాణానికి వెళ్లినా అక్కడ ఓ వ్యాపారవేత్త కనిపిస్తాడనీ.. అలాంటి సంస్కృతి మన దేశంలో ఎప్పటి నుంచో ఉందన్నారు. గూగుల్ సేవలను మొదట భారత్‌లో ప్రారంభించిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. యూట్యూబ్ ఆఫ్‌లైన్‌కు మొదట భారత్‌లోనే శ్రీకారం చుట్టి, తర్వాత 77 దేశాలకు తీసుకెళ్లామని గుర్తుచేశారు. తమ ఇంజనీరింగ్ కార్యాలయాలను భారత్‌లో నెలకొల్పుతామన్నారు.

భారత్‌లో బలమైన మొబైల్ పరికరాల మార్కెట్, ప్రజల్లో టెక్నాలజీపై అమితాసక్తి ఉన్నాయని పేర్కొన్నారు. దీనివల్ల తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రారంభించేందుకు బ్రహ్మాండమైన అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల ప్రశ్నలకు పిచాయ్ చెప్పిన జవాబులు మరికొన్ని...

* నేను ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకునేప్పుడు ఇంటర్నెట్ లేదు. తరువాత ఎప్పుడో అందుబాటులోకి వచ్చింది.
* 1995లో నా దగ్గర మొదటి ఫోన్ ఉండేది.    
* ఇప్పుడు 20 స్మార్ట్‌ఫోన్‌లు నా దగ్గర ఉన్నాయి.
* నేను స్కూల్లో పెద్దగా చదివిన వాణ్ణి కాదు.. నాకు సెమీ కండక్టర్లపై ఆసక్తి ఉండేది.
* గూగుల్ సీఈఓ కాకపోయి ఉంటే నేను సాఫ్ట్‌వేర్‌లను అభివృద్ధి చేసుకుంటూ ఉండేవాణ్ణి.
* గూగుల్ వెళ్లినప్పుడు టాఫీల దుకాణానికి వెళ్లిన అనుభూతి కలిగింది.
* గూగుల్ చాలా ఆనందకరమైన ప్రాంగణం.
* విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేలా, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దాలి.
* ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలి.
* సిలికాన్ వ్యాపారవేత్తల తరహాలోనే భారత్‌లోని స్టార్టప్ వ్యవస్థాపకుల నుంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి.
* క్రికెట్, ఫుట్‌బాల్ నా అభిమాన క్రీడలు.
 
20 లక్షల మంది ఆండ్రాయిడ్ డెవలపర్లకు శిక్షణ
భారత్‌లో వచ్చే మూడేళ్లలో 20 లక్షల మంది ఆండ్రాయిడ్ డెవలపర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు  గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ తెలిపారు. తమ నూతన ప్రణాళికలో భాగంగా 30 విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో 20 లక్షల మంది ఆండ్రాయిడ్ డెవలపర్లకు శిక్షణ ఇస్తామన్నారు. దీన్ని మూడేళ్లలో పూర్తిచేస్తామని పేర్కొన్నారు. కొత్త డెవలపర్లతో కొత్త ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని వెల్లడించారు. పబ్లిక్ వైఫై ప్రాజెక్ట్‌పై పిచాయ్ స్పందించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని తెలిపారు. భారత్‌లో 400 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకే వారికి ఇంటర్నెట్‌ను చేరువ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రధాని మోదీతో భేటీ: శ్రీరామ్ కాలేజీ విద్యార్థులతో భేటీ తర్వాత ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసంలో సుందర్ కలిశారు. ‘మంచి సౌహ్రార్ద వాతావరణంలో సుందర్‌తో సమావేశం జరిగింది’ అని భేటీ తర్వాత మోదీ ట్వీట్ చేశారు. గత మూడు నెలల కాలంలో వీరిద్దరూ కలవడం ఇది రెండోసారి. ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా వీరిద్దరు సమావేశమయ్యారు.  
 
క్రికెట్, ఫుట్‌బాల్ నా అభిమాన క్రీడలు
తాను క్రికెట్‌కు పెద్ద అభిమానినని సుందర్ చెప్పారు. గవాస్కర్ తన అభిమాన క్రికెటర్  అన్నారు. ఆయనలా క్రికెటర్‌గా మారాలని బాల్యంలో కలలు కన్నానన్నారు. సచిన్‌నూ అభిమానిస్తానని పేర్కొన్నారు. చెన్నైలో గడిపిన చిన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. టెస్టు, వన్డేలను చూసి ఆనందిస్తుంటానన్నారు. వేగవంతమైన టీ20 మ్యాచ్‌లపై అంతగా ఆసక్తి లేదన్నారు. ఫుట్‌బాల్ క్రీడను కూడా బాగా ఇష్టపడతానని సుందర్ పిచాయ్ తెలిపారు. లియోనెల్ మెస్సీ తన అభిమాన ఫుట్‌బాల్ ఆటగాడని అన్నారు. చిన్నప్పుడు అర్ధరాత్రి పూట లేచి టీవీలో ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలు చూసేవాడినని గుర్తుచేసుకున్నారు. గురువారం ఢిల్లీలో ఇండియాగేట్ వద్ద స్థానికులతో కలసి ఆయన సరదాగా క్రికెట్ ఆడారు.
ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర స్థానికులతో క్రికెట్ ఆడుతున్న సుందర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement