delhi students
-
చిట్టి చేతుల గట్టి సాయం
కరోనాతో చాలామంది జీవితాలు రోడ్డున పడ్డాయి. వారి సాధక బాధలు చూసి చలించిపోయిన ఎంతోమంది దాతలు తమకు తోచిన సాయం చేసి మానవత్వాన్ని చాటారు. ఇలా సాయం చేసిన చేతుల్లో స్కూలు పిల్లల చిట్టి చేతులు కూడా ఉండడం విశేషం. నిరుపేదల కష్టాలు చూసి చలించిన గీతికా జైన్, మిహికా బాగ్లా, శివేకా జైన్లు కూడా సాయం చేయాలనుకున్నారు. కానీ ఈ ముగ్గురు స్కూలు పిల్లలు. ఆదాయం వచ్చే అవకాశం లేదు. అమ్మానాన్నలని అడిగినా కూడా అంత సాయం చేసే స్థోమత వారికుండాలి కదా... ఇవన్నీ ఆలోచించిన ఈ అమ్మాయిలు తామే స్వయంగా సంపాదించి కోవిడ్ బాధితులకు విరాళంగా అందించారు. ఢిల్లీకి చెందిన గీతికా జైన్, మిహిక బాగ్లాలు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. కోవిడ్ సమయంలో... అవసరంలో ఉన్నవారికి తమ తల్లిదండ్రులు చేస్తోన్న సాయాన్ని గమనించిన ఈ ఇద్దరు స్నేహితులు.. తాము కూడా సాయం చేయాలని నిర్ణయించుకుని క్రాఫ్ట్స్ తయారీ, కుకింగ్ వర్క్‌షాపులు నిర్వహించడం ద్వారా వచ్చిన 50 వేల రూపాయల నగదును విరాళంగా ఇచ్చారు. ముంబైకి చెందిన శివేక జైన్ పదో తరగతి చదువుతోంది. శివేక కూడా నిరుపేదలకు సాయపడేందుకు.. యూట్యూబ్‌లో ఫ్లూయిడ్ పెయింటింగ్ ఎలా వేయాలో నేర్చుకుని దాదాపు వంద పెయింటింగ్‌లను వేసి వాటిని విక్రయించగా వచ్చిన 2.5 లక్షల రూపాయలను కోవిడ్ బాధితులకు విరాళంగా ఇచ్చింది. ఈ ముగ్గురు అమ్మాయిలు తల్లిదండ్రులను సంప్రదించి ఐదు నుంచి పదేళ్లలోపు పిల్లలకు ఆర్ట్, క్రాఫ్ట్, కుకింగ్‌పై వర్క్ షాపులు నిర్వహించారు. గీతిక, మిహికలు కలిసి మే, జూన్ నెలల్లో తరగతులు నిర్వహించి ఒక్కో క్లాస్‌కు రూ.300 ఫీజును వసూలు చేశారు. ఈ విధంగా వాళ్లు మొత్తం 50 వేల రూపాయలను జమచేశారు. ఈ మొత్తాన్ని శక్తి ఫౌండేషన్ ఇండియాకు విరాళంగా ఇచ్చారు. ‘‘లాక్డౌన్ సమయంలో చాలామంది రకరకాల ఇబ్బందులకు గురవడం, వాళ్లకు మా తల్లిదండ్రులు సాయం చేయడం చూశాము. అలా మేము కూడా చేయాలనుకున్నాము. ఈ క్రమంలోనే నాకు ఎంతో ఇష్టమైన‡ క్రాఫ్ట్స్ తయారీని జూమ్ యాప్ ద్వారా సెషన్లు నిర్వహించి చిన్న పిల్లలకు నేర్పించేదాన్ని’’ అని గీతిక చెప్పింది.‘‘నాకు కుకింగ్, బొమ్మలు తయారు చేయడం అంటే ఎంతో ఇష్టం. వాటినే వేసవికాలం సెలవుల్లో పిల్లలకు నేర్పించడం ద్వారా నిధులు సమకూర్చాము’’ అని మిహిక చెప్పింది. కష్టపడి సంపాదించి ఆ డబ్బులను విరాళంగా ఇవ్వడం వల్ల మాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ మొత్తం కార్యక్రమంలో తమ తల్లిదండ్రులు కూడా ఎంతో సాయపడ్డారని మిహిక, గీతికలు చెప్పారు. పదిహేనేళ్ల శివేక జైన్ కూడా వేసవి కాలం సెలవుల్లో తనకు తెలియని ఫ్లూయిడ్ పెయింటింగ్‌ను వేయడం నేర్చుకుని.. ఆ పెయింటింగ్స్ వేసి వాటిని విక్రయించడం ద్వారా వచ్చిన 2.5 లక్షల రూపాయలను ముంబైకి చెందిన ఎన్జీవోకు విరాళంగా ఇచ్చి తన పెద్దమనసు చాటుకుంది. ‘‘పెయింటర్, ఆర్ట్ కన్సల్టంట్ అయిన మా అమ్మ తృప్తి ని ప్రేరణగా తీసుకుని ఆమెలాగా నేను సాయం చేయాలనుకున్నాను. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లో ఫ్లూయిడ్ పెయింటింగ్ ఎలా వేయాలో చూసి శ్రద్ధగా నేర్చుకున్నాను. నేర్చుకున్న తరువాత దాదాపు 100 పెయింటింగ్‌లను వేసాను. ఒక్కొక్కటì 2,500 రూపాయలకు విక్రయించి రెండున్నర లక్షల రూపాయలు సంపాదించాను. వాటిని విరాళంగా ఇచ్చాను’’ అని శివేక చెప్పింది. ‘‘కరోనా కారణంగా ఎంతోమంది చనిపోవడం చూసిన శివేకకు చాలా బాధగా అనిపించేది. దీంతో తను రోజుకి నాలుగు గంటలు శ్రమించి పెయింటింగ్స్ వేసేది. వాటిని వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ప్రచారం చేసేవాళ్లం. అలా వంద పెయింటింగులు విక్రయించి డబ్బులు సంపాదించాము. తన ఆసక్తిని మేము ప్రోత్సహించాము’’ అని శివేక తల్లి చెప్పారు. ఇవేగాక ఎన్జీవోలతో కలిసి మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపడతామని తల్లీ కూతుళ్లు చెబుతున్నారు. -
చెత్త రాజకీయాలు ఆపండి
ముంబై: ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడాన్ని పలువురు బాలీవుడ్ ప్రముఖులు నిరసించారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న జామియా మిలియా వర్సిటీ విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. తమ మదిలో ఏముందో వెల్లడించిన అమాయకులపై అమానవీయంగా దాడి చేస్తారా? హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రశ్నించారు. పౌరులు తమ ఆలోచనలను బయపెట్టిన ప్రతిసారి ఇలాగే జరుగుతోందని, ఇలాయితే మనదేశాన్ని ప్రజాస్వామ్య దేశం అనగలమా అని నిలదీశారు. శాంతియుత నిరసనలతో తమ గళాన్ని విన్పిస్తున్న పౌరులపై హింస్మాతక చర్యలకు దిగడం బాధాకరమని హీరో సిద్ధార్థ మల్హోత్రా అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎటువంటి హింసకు తావులేదని, పోలీసులను చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. శాంతియుతంగా తమ అభిప్రాయాలను తెలిపే హక్కు ప్రజలకు ఉందని హీరో విక్కీ కౌశల్ పేర్కొన్నారు. హింసతో పౌరులను అడ్డుకోవడం సాటి పౌరుడిగా తనకు ఆందోళన కలిగిస్తోందని ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం సడలకుండా చూసుకోవాలని హితవు పలికారు. జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై పోలీసుల దాడి.. అనాగరికం, అప్రజాస్వామికం, లౌకికవాదానికి విరుద్ధమని పులకిత్ శర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐకమత్యమే తమ మతమని, విద్యార్థులకు అండగా ఉంటామని ఆయన ట్వీట్ చేశారు. చెత్త రాజకీయాలు, హింసాత్మక చర్యలు ఆపాలని సౌరభ్ శుక్లా డిమాండ్ చేశారు. భావప్రకటన స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, ఎంపిక చేసుకునే స్వేచ్ఛ పుస్తకాలకు పరిమితమయ్యాయని హీరోయిన్ రకుల్‌ప్రీత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యమని చెప్పుకుంటున్న మన దేశంలో పౌరుల హక్కులను నిజంగా గౌరవిస్తున్నామా అని ప్రశ్నించారు. ఢిల్లీ విద్యార్థులకు తన మద్దతు తెలిపారు. హింస దేనికి పరిష్కారం కాదన్నారు. లౌకికవాద ప్రజాస్వామ్యంలో ఉన్నామన్నది నిజం కాదని తేలిపోయిందని నటి హ్యూమా ఖురేషి అన్నారు. ఢిల్లీ విద్యార్థులపై పోలీసులు హింసకు దిగడం భయాందోళన కలిగించిందని ఆవేదన చెందారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందన్నారు. (నటుడు సుశాంత్ సింగ్‌పై వేటు) -
ప్రతిఙ్ఞ : ‘అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించం’
న్యూఢిల్లీ : మహిళలు, చిన్నారులు, పాఠశాల విద్యార్థినులపై వేధింపులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ‘అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించం’అని విద్యార్థులతో ప్రతిఙ్ఞ చేయించనున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తమ ప్రభుత్వ చర్యల ఫలితంగా ప్రభుత్వ పాఠశాల్లో బాలికల సంఖ్య పెరిగిందని గుర్తు చేశారు. అయితే, వారు వేధింపులు ఎదుర్కొనే సందర్భంలో ‘మేము చదువుకోవడం సరైంది కాదేమో’అని భావిస్తారని సీఎం పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులు, తోటి విద్యార్థుల పట్ల మర్యాదగా నడుచుకునే విధంగా విద్యార్థుల్లో నైతిక విలువల్ని పెంపొందిస్తామని సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వినూత్న నిర్ణయంతో.. బాలికలు తోటి విద్యార్థుల కళ్లలో తమ అన్నలను, తమ్ముళ్లను చూసుకుంటారని ఆకాక్షించారు. ప్రైవేటు స్కూళ్లలో లేని ఎన్నో సౌకర్యాలను ప్రభుత్వ బడుల్లో కల్పించామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. తోటి విద్యార్థినులు, అమ్మాయిల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే ఇంట్లోకి రానివ్వమని ప్రతి తల్లి తన పిల్లలకు చెప్పాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక ఢిల్లీ ప్రభుత్వ చర్యల ఫలితంగా రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ బడులు మెరుగైన ప్రగతి సాధించాయి. ఎడ్యుకేషన్ వరల్డ్ అనే వెబ్సైట్ నివేదికలో దేశంలోని టాప్ 10 పాఠశాల్లో ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాజ్కీయ ప్రతిభా వికాస్ విద్యాలయ (ఆర్పీవీవీ) మొదటి స్థానంలో నిలిచింది. దీనితో పాటు ఢిల్లీలోని మరో రెండు ప్రభుత్వ పాఠశాలలు టాప్ 10 స్థానం సంపాదించాయి. -
ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలి
భారత్‌లో టీకొట్టులోనూ ఓ వ్యాపారవేత్త కనిపిస్తాడు * మా సేవలను మొదట భారత్‌లోనే ప్రారంభిస్తాం * గూగుల్ వెళ్లినప్పుడు టాఫీల దుకాణానికి వెళ్లిన అనుభూతి కలిగింది * ఢిల్లీ విద్యార్థులతో ముచ్చటించిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ న్యూఢిల్లీ: గూగుల్ ఎప్పుడూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని, తాము చూపించే పరిష్కారం కోట్లాది ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడుతుందనేదే ప్రధానంగా ఆలోచిస్తామని ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. అపజయానికి ఎప్పుడూ కుంగిపోకూడదని, ఓటమి నుంచే పాఠాలు నేర్చుకోవాలని గురువారం ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి అన్నారు. సిలికాన్ వ్యాలీలో ఫెయిల్యూర్స్‌ను గౌరవానికి గుర్తుగా భావిస్తారని చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. భారత్‌లో ఈ తరం వారు రిస్క్ తీసుకోవటానికి తక్కువ భయపడుతున్నారని పేర్కొన్నారు. ఈ దేశంలో ఓ టీ దుకాణానికి వెళ్లినా అక్కడ ఓ వ్యాపారవేత్త కనిపిస్తాడనీ.. అలాంటి సంస్కృతి మన దేశంలో ఎప్పటి నుంచో ఉందన్నారు. గూగుల్ సేవలను మొదట భారత్‌లో ప్రారంభించిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. యూట్యూబ్ ఆఫ్‌లైన్‌కు మొదట భారత్‌లోనే శ్రీకారం చుట్టి, తర్వాత 77 దేశాలకు తీసుకెళ్లామని గుర్తుచేశారు. తమ ఇంజనీరింగ్ కార్యాలయాలను భారత్‌లో నెలకొల్పుతామన్నారు. భారత్‌లో బలమైన మొబైల్ పరికరాల మార్కెట్, ప్రజల్లో టెక్నాలజీపై అమితాసక్తి ఉన్నాయని పేర్కొన్నారు. దీనివల్ల తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రారంభించేందుకు బ్రహ్మాండమైన అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల ప్రశ్నలకు పిచాయ్ చెప్పిన జవాబులు మరికొన్ని... * నేను ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకునేప్పుడు ఇంటర్నెట్ లేదు. తరువాత ఎప్పుడో అందుబాటులోకి వచ్చింది. * 1995లో నా దగ్గర మొదటి ఫోన్ ఉండేది. * ఇప్పుడు 20 స్మార్ట్ఫోన్లు నా దగ్గర ఉన్నాయి. * నేను స్కూల్లో పెద్దగా చదివిన వాణ్ణి కాదు.. నాకు సెమీ కండక్టర్లపై ఆసక్తి ఉండేది. * గూగుల్ సీఈఓ కాకపోయి ఉంటే నేను సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేసుకుంటూ ఉండేవాణ్ణి. * గూగుల్ వెళ్లినప్పుడు టాఫీల దుకాణానికి వెళ్లిన అనుభూతి కలిగింది. * గూగుల్ చాలా ఆనందకరమైన ప్రాంగణం. * విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేలా, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దాలి. * ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలి. * సిలికాన్ వ్యాపారవేత్తల తరహాలోనే భారత్‌లోని స్టార్టప్ వ్యవస్థాపకుల నుంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి. * క్రికెట్, ఫుట్‌బాల్ నా అభిమాన క్రీడలు. 20 లక్షల మంది ఆండ్రాయిడ్ డెవలపర్లకు శిక్షణ భారత్‌లో వచ్చే మూడేళ్లలో 20 లక్షల మంది ఆండ్రాయిడ్ డెవలపర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ తెలిపారు. తమ నూతన ప్రణాళికలో భాగంగా 30 విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో 20 లక్షల మంది ఆండ్రాయిడ్ డెవలపర్లకు శిక్షణ ఇస్తామన్నారు. దీన్ని మూడేళ్లలో పూర్తిచేస్తామని పేర్కొన్నారు. కొత్త డెవలపర్లతో కొత్త ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని వెల్లడించారు. పబ్లిక్ వైఫై ప్రాజెక్ట్‌పై పిచాయ్ స్పందించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని తెలిపారు. భారత్‌లో 400 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకే వారికి ఇంటర్నెట్ను చేరువ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీతో భేటీ: శ్రీరామ్ కాలేజీ విద్యార్థులతో భేటీ తర్వాత ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసంలో సుందర్ కలిశారు. ‘మంచి సౌహ్రార్ద వాతావరణంలో సుందర్‌తో సమావేశం జరిగింది’ అని భేటీ తర్వాత మోదీ ట్వీట్ చేశారు. గత మూడు నెలల కాలంలో వీరిద్దరూ కలవడం ఇది రెండోసారి. ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా వీరిద్దరు సమావేశమయ్యారు. క్రికెట్, ఫుట్‌బాల్ నా అభిమాన క్రీడలు తాను క్రికెట్‌కు పెద్ద అభిమానినని సుందర్ చెప్పారు. గవాస్కర్ తన అభిమాన క్రికెటర్ అన్నారు. ఆయనలా క్రికెటర్‌గా మారాలని బాల్యంలో కలలు కన్నానన్నారు. సచిన్‌నూ అభిమానిస్తానని పేర్కొన్నారు. చెన్నైలో గడిపిన చిన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. టెస్టు, వన్డేలను చూసి ఆనందిస్తుంటానన్నారు. వేగవంతమైన టీ20 మ్యాచ్‌లపై అంతగా ఆసక్తి లేదన్నారు. ఫుట్‌బాల్ క్రీడను కూడా బాగా ఇష్టపడతానని సుందర్ పిచాయ్ తెలిపారు. లియోనెల్ మెస్సీ తన అభిమాన ఫుట్‌బాల్ ఆటగాడని అన్నారు. చిన్నప్పుడు అర్ధరాత్రి పూట లేచి టీవీలో ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలు చూసేవాడినని గుర్తుచేసుకున్నారు. గురువారం ఢిల్లీలో ఇండియాగేట్ వద్ద స్థానికులతో కలసి ఆయన సరదాగా క్రికెట్ ఆడారు. ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర స్థానికులతో క్రికెట్ ఆడుతున్న సుందర్ -
ఎమర్జెన్సీ అంటే సిక్కు అల్లర్లా!
ఎమర్జెన్సీ అంటే సిక్కుల అల్లర్లకు సంబంధించిన అంశం. అల్లర్లు అదుపు తప్పడంతో వాటిని అదుపు చేసేందుకు బ్లూస్టార్ ఆపరేషన్‌కు ఎమర్జెన్సీ సహకరించినది.... ఎమర్జెన్సీ అంటే ఏమిటన్న ప్రశ్నకు ఢిల్లీలోని ఇంద్రప్రస్థ యూనివర్సిటీకి చెందిన 'వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్' కళాశాలకు చెందిన దేవంగ్ అనే విద్యార్థి నుంచి వచ్చిన సమాధానం. -నాకు సరిగ్గా తెలియదు. అది స్వర్ణ దేవాలయానికి సంబంధించిన అంశం కావొచ్చు...ఇది శుభాంగి అనే ఓ విద్యార్థి నుంచి వచ్చిన సమాధానం. -ఢిల్లీలో టెర్రరిస్టుల దాడులకు సంబంధించినది. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ రాష్ట్రపతి పాలన విధించారు...ఇది ఎస్పీఎం కాలేజీకి చెందిన శచి అనే విద్యార్థి నుంచి వచ్చిన సమాధానం. -గత కొన్ని రోజులుగా పత్రికల్లో, టీవీల్లో దీనికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. ఎలక్షన్లకు సంబంధించి ఇంధిరాగాంధీ తీసుకున్న ఓ నిర్ణయం...ఇది ఆసియన్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న హరిత్ అనే విద్యార్థి నుంచి వచ్చిన సమాధానం. -రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు దేశాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధిస్తుంది. నాకు గుర్తున్నంతవరకు దేశంలో 367 అధికరణ కింద ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు...అని ఏఆర్ఎస్డీ కళాశాలలో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ చదువున్న స్వాతి అనే విద్యార్థిని సమాధానం ఇచ్చారు. -ఇందిరాగాంధీ హయాంలో 1975 నుంచి 1977 వరకు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నియంత్రించారు. పత్రికలపై సెన్సార్షిప్ విధించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను బలవంతంగా అమలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై అణచివేతకు దిగింది... శ్రీ వేంకటేశ్వర కాలేజీలో ఇంగ్లీషులో మాస్టర్ డిగ్రీ చేస్తున్న దేబయు చటర్జీ అనే విద్యార్థి మాత్రం సరైన సమాధానం ఇచ్చారు. (దేశంలో ఎమర్జెన్సీ విధించి జూన్ 25వ తేదీకి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఆంగ్ల మీడియా ఢిల్లీ నగరంలోని వివిధ కళాలలో చదువుతున్న విద్యార్థులను ఎమర్జెన్సీ గురించి ప్రశ్నించగా ఇలాంటి సమాధానాలు వచ్చాయి. 1990లలో జన్మించిన విద్యార్థుల్లో 99 శాతం మందికి ఎమర్జెన్సీ గురించి తెలియదని దీంతో తేటతెల్లమైంది).