న్యూఢిల్లీ : మహిళలు, చిన్నారులు, పాఠశాల విద్యార్థినులపై వేధింపులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ‘అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించం’అని విద్యార్థులతో ప్రతిఙ్ఞ చేయించనున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తమ ప్రభుత్వ చర్యల ఫలితంగా ప్రభుత్వ పాఠశాల్లో బాలికల సంఖ్య పెరిగిందని గుర్తు చేశారు. అయితే, వారు వేధింపులు ఎదుర్కొనే సందర్భంలో ‘మేము చదువుకోవడం సరైంది కాదేమో’అని భావిస్తారని సీఎం పేర్కొన్నారు.
మహిళలు, చిన్నారులు, తోటి విద్యార్థుల పట్ల మర్యాదగా నడుచుకునే విధంగా విద్యార్థుల్లో నైతిక విలువల్ని పెంపొందిస్తామని సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వినూత్న నిర్ణయంతో.. బాలికలు తోటి విద్యార్థుల కళ్లలో తమ అన్నలను, తమ్ముళ్లను చూసుకుంటారని ఆకాక్షించారు. ప్రైవేటు స్కూళ్లలో లేని ఎన్నో సౌకర్యాలను ప్రభుత్వ బడుల్లో కల్పించామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. తోటి విద్యార్థినులు, అమ్మాయిల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే ఇంట్లోకి రానివ్వమని ప్రతి తల్లి తన పిల్లలకు చెప్పాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక ఢిల్లీ ప్రభుత్వ చర్యల ఫలితంగా రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ బడులు మెరుగైన ప్రగతి సాధించాయి. ఎడ్యుకేషన్ వరల్డ్ అనే వెబ్‌సైట్ నివేదికలో దేశంలోని టాప్ 10 పాఠశాల్లో ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాజ్‌కీయ ప్రతిభా వికాస్ విద్యాలయ (ఆర్పీవీవీ) మొదటి స్థానంలో నిలిచింది. దీనితో పాటు ఢిల్లీలోని మరో రెండు ప్రభుత్వ పాఠశాలలు టాప్ 10 స్థానం సంపాదించాయి.
Comments
Please login to add a commentAdd a comment