గీతికా జైన్, శివేకా జైన్, మిహికా బాగ్లా
కరోనాతో చాలామంది జీవితాలు రోడ్డున పడ్డాయి. వారి సాధక బాధలు చూసి చలించిపోయిన ఎంతోమంది దాతలు తమకు తోచిన సాయం చేసి మానవత్వాన్ని చాటారు. ఇలా సాయం చేసిన చేతుల్లో స్కూలు పిల్లల చిట్టి చేతులు కూడా ఉండడం విశేషం. నిరుపేదల కష్టాలు చూసి చలించిన గీతికా జైన్, మిహికా బాగ్లా, శివేకా జైన్‌లు కూడా సాయం చేయాలనుకున్నారు. కానీ ఈ ముగ్గురు స్కూలు పిల్లలు. ఆదాయం వచ్చే అవకాశం లేదు. అమ్మానాన్నలని అడిగినా కూడా అంత సాయం చేసే స్థోమత వారికుండాలి కదా... ఇవన్నీ ఆలోచించిన ఈ అమ్మాయిలు తామే స్వయంగా సంపాదించి కోవిడ్ బాధితులకు విరాళంగా అందించారు.
ఢిల్లీకి చెందిన గీతికా జైన్, మిహిక బాగ్లాలు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. కోవిడ్ సమయంలో... అవసరంలో ఉన్నవారికి తమ తల్లిదండ్రులు చేస్తోన్న సాయాన్ని గమనించిన ఈ ఇద్దరు స్నేహితులు.. తాము కూడా సాయం చేయాలని నిర్ణయించుకుని క్రాఫ్ట్స్ తయారీ, కుకింగ్ వర్క్‌షాపులు నిర్వహించడం ద్వారా వచ్చిన 50 వేల రూపాయల నగదును విరాళంగా ఇచ్చారు. ముంబైకి చెందిన శివేక జైన్ పదో తరగతి చదువుతోంది.
శివేక కూడా నిరుపేదలకు సాయపడేందుకు.. యూట్యూబ్‌లో ఫ్లూయిడ్ పెయింటింగ్ ఎలా వేయాలో నేర్చుకుని దాదాపు వంద పెయింటింగ్‌లను వేసి వాటిని విక్రయించగా వచ్చిన 2.5 లక్షల రూపాయలను కోవిడ్ బాధితులకు విరాళంగా ఇచ్చింది. ఈ ముగ్గురు అమ్మాయిలు తల్లిదండ్రులను సంప్రదించి ఐదు నుంచి పదేళ్లలోపు పిల్లలకు ఆర్ట్, క్రాఫ్ట్, కుకింగ్‌పై వర్క్ షాపులు నిర్వహించారు. గీతిక, మిహికలు కలిసి మే, జూన్ నెలల్లో తరగతులు నిర్వహించి ఒక్కో క్లాస్‌కు రూ.300 ఫీజును వసూలు చేశారు. ఈ విధంగా వాళ్లు మొత్తం 50 వేల రూపాయలను జమచేశారు. ఈ మొత్తాన్ని శక్తి ఫౌండేషన్ ఇండియాకు విరాళంగా ఇచ్చారు.
‘‘లాక్‌డౌన్ సమయంలో చాలామంది రకరకాల ఇబ్బందులకు గురవడం, వాళ్లకు మా తల్లిదండ్రులు సాయం చేయడం చూశాము. అలా మేము కూడా చేయాలనుకున్నాము. ఈ క్రమంలోనే నాకు ఎంతో ఇష్టమైన‡ క్రాఫ్ట్స్ తయారీని జూమ్ యాప్ ద్వారా సెషన్లు నిర్వహించి చిన్న పిల్లలకు నేర్పించేదాన్ని’’ అని గీతిక చెప్పింది.‘‘నాకు కుకింగ్, బొమ్మలు తయారు చేయడం అంటే ఎంతో ఇష్టం. వాటినే వేసవికాలం సెలవుల్లో పిల్లలకు నేర్పించడం ద్వారా నిధులు సమకూర్చాము’’ అని మిహిక చెప్పింది. కష్టపడి సంపాదించి ఆ డబ్బులను విరాళంగా ఇవ్వడం వల్ల మాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ మొత్తం కార్యక్రమంలో తమ తల్లిదండ్రులు కూడా ఎంతో సాయపడ్డారని మిహిక, గీతికలు చెప్పారు.
పదిహేనేళ్ల శివేక జైన్ కూడా వేసవి కాలం సెలవుల్లో తనకు తెలియని ఫ్లూయిడ్ పెయింటింగ్‌ను వేయడం నేర్చుకుని.. ఆ పెయింటింగ్స్ వేసి వాటిని విక్రయించడం ద్వారా వచ్చిన 2.5 లక్షల రూపాయలను ముంబైకి చెందిన ఎన్జీవోకు విరాళంగా ఇచ్చి తన పెద్దమనసు చాటుకుంది.
‘‘పెయింటర్, ఆర్ట్ కన్సల్టంట్ అయిన మా అమ్మ తృప్తి ని ప్రేరణగా తీసుకుని ఆమెలాగా నేను సాయం చేయాలనుకున్నాను. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లో ఫ్లూయిడ్ పెయింటింగ్ ఎలా వేయాలో చూసి శ్రద్ధగా నేర్చుకున్నాను. నేర్చుకున్న తరువాత దాదాపు 100 పెయింటింగ్‌లను వేసాను. ఒక్కొక్కటì 2,500 రూపాయలకు విక్రయించి రెండున్నర లక్షల రూపాయలు సంపాదించాను. వాటిని విరాళంగా ఇచ్చాను’’ అని శివేక చెప్పింది. ‘‘కరోనా కారణంగా ఎంతోమంది చనిపోవడం చూసిన శివేకకు చాలా బాధగా అనిపించేది. దీంతో తను రోజుకి నాలుగు గంటలు శ్రమించి పెయింటింగ్స్ వేసేది. వాటిని వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ప్రచారం చేసేవాళ్లం. అలా వంద పెయింటింగులు విక్రయించి డబ్బులు సంపాదించాము. తన ఆసక్తిని మేము ప్రోత్సహించాము’’ అని శివేక తల్లి చెప్పారు. ఇవేగాక ఎన్జీవోలతో కలిసి మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపడతామని తల్లీ కూతుళ్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment