
రైల్వే బ్రిడ్జిపై ఎంతటి బరి తెగింపు..!
ఘజియాబాద్: అచ్చం సినిమాలో మాదిరిగా నరాలు తెగే ఉత్కంఠ.. ఏం జరుగుతుందో అనే ఆందోళన.. రైలు డ్రైవర్ కూడా కాస్తంత వణికిపోయే పరిస్థితి.. కానీ పట్టాలపై నిల్చున్న ఆ ఏడుగురు ఆకతాయిలకు మాత్రం ఎలాంటి జంకూ బొంకూ లేదు. రైలు తమను తాకేంత దగ్గరగా వచ్చే వరకు అలాగే చూశారు. తగులుతుందా అనే సమయంలో గబాళ్లున దూకేశారు అది కూడా నదిలోకి. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్ ఘజియాబాద్ లోని మసురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఈ వీడియో బయటకు రావడంతో వెంటనే అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి పిచ్చిపని చేసిన ఆ యువకులు ఎవరో గుర్తించాలని, ఎందుకిలా చేశారో కనుక్కోవాలని పోలీసులకు స్ట్రిట్ ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 50 సెకన్లు ఉన్న ఈ వీడియోలో ఈ దృశ్యం కనిపించింది. మసురి ప్రాంతంలో గంగా నది కాలువపై ఓ రైల్వే బ్రిడ్జి ఉంది. దీనిపైకి వెళ్లిన కొంతమంది ఏడుగురు రైలును కూడా లెక్కచేయకుండా స్టంట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అయింది.