ప్రతీకాత్మక చిత్రం
లక్నో : పెళ్లి బరాత్ ఆలస్యమైన నేపథ్యంలో ఘర్షణ తలెత్తి ఓ వధువు కుటుంబ సభ్యులు ఆమెను మరొక యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో భంగపడిన వరుడు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన వివరాలు.. బిజ్నూర్‌లోని నంగల్‌జాట్ గ్రామానికి చెందిన ఓ యువతికి సామూహిక వివాహ వేడుకల్లో భాగంగా అక్టోబరులో ఓ యువకుడితో పెళ్లి జరిగింది. అయితే డిసెంబరు 4న మరోసారి ఈ జంటకు శాస్త్రోక్తంగా పెళ్లి చేయాలని ఇరువర్గాల పెద్దలు నిర్ణయించారు. దీంతో ధంపూర్ పట్టణానికి చెందిన వరుడు బిజ్నూర్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం రెండు గంటలకే అక్కడికి చేరుకోవాల్సి ఉండగా... రాత్రి వరకు అతడు రాకపోవడంతో వధువు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కట్నం విషయమై కూడా గొడవ జరిగింది. దీంతో వధువు బంధువులు వరుడి తరఫు వాళ్లను ఓ గదిలో బంధించి తాళం వేశారు. వాళ్ల నుంచి విలువైన వస్తువులు లాక్కొని.. దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాళ్లను విడిపించారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పోలీసుల సమక్షంలో రాజీకి వచ్చాయి. అయితే వధువు మాత్రం వరుడిని మరోసారి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించిన గ్రామ పెద్దలు వధువు కోరుకున్న యువకుడితో పెళ్లి జరిపించారు.
Comments
Please login to add a commentAdd a comment