చెస్ కోసం ఇంటినే తాకట్టు పెట్టేశారు!
వారిద్దరూ అన్నదమ్ములు.. టీనేజీ కూడా ఇంకా దాటలేదు. కానీ, దేశం నలుమూలలా తిరిగారు. ఇరుకైన జనరల్ రైలు భోగీల్లో నిద్రలేని ప్రయాణాలెన్నో చేశారు. ఎన్నెన్నో టోర్నమెంట్లో పాల్గొన్నారు. కొన్నిసార్లు పతకాలు, మరికొన్ని సార్లు ప్రశంసలు.. ఏదైతేనేం ఆత్మ సంతృప్తితోనే తిరిగి వస్తారు. ఎంత కష్టానికై నా ఓర్చుకుంటారు. ఇష్టమైన చదరంగం కోసం ఏకంగా తమ ఇంటినే తాకట్టు పెట్టుకున్నారు. మట్టిలో మాణిక్యాలు వీరు.. కాస్త చేయూతనిస్తే తళుక్కున మెరిసిపోతారు..!
బిహార్‌లోని అరారియా గ్రామానికి చెందిన 16 ఏళ్ల కుమార్, 14 ఏళ్ల సౌరభ్‌లు ఎప్పుడు చూసినా బిజీగా కనిపిస్తారు. కంప్యూటర్ ముందు కూర్చుని ఏవేవో నేర్చుకుంటారు. పుస్తకాలు పడతారు. వాటిని బాగా చదివి సారాన్నంతా బుర్రకెక్కించుకుంటారు. తర్వాత ఆ విజ్ఞానాన్నంతా చెస్ బోర్డుపై ప్రదర్శిస్తారు. విజేతలుగా నిలుస్తారు. సింపుల్‌గా అరుుతే ఇదే వారి కథ..! కానీ, విజేతలుగా నిలవడం అంత సులభం కాదు. ఎన్నో కష్టాలను దాటాలి. కుమార్, సౌరభ్‌లకు అవి ఆప్తమిత్రులు..!
2007 నుంచి చదరంగం ఆడటం మొదలుపెట్టారు ఈ అన్నదమ్ములు. కానీ, ప్రొఫెషనల్ శిక్షణ ఏనాడూ తీసుకోలేదు. 2014లో వీరికి ఢిల్లీకి చెందిన అంతర్జాతీయ కోచ్ విశాల్ సరీన్ పరిచయమయ్యేంతవరకూ అలాంటి శిక్షణ ఒకటి ఉంటుందని కూడా వీరికి తెలీదు. అతడి పరిచయం తర్వాత కుమార్, సౌరభ్‌లు తమ ఇంట్లోని పాత కంప్యూటర్ ముందు కూర్చుని స్కైప్‌లో విశాల్ చెప్పే చెస్ పాఠాలు శ్రద్ధగా వింటున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో ఢిల్లీకి మకాం మార్చి శిక్షణ కూడా తీసుకోలేని దుస్థితి వీరిది. అందుకే ఏకలవ్య శిష్యులుగా మారారు.
దాదాపు చెస్‌లోని మెలకువలన్నీ స్వయంగానే నేర్చుకున్నారు. ఇద్దరూ ఒకరికొకరు శిక్షణ ఇచ్చుకుంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది జనవరిలో చెన్నైలో జరిగిన ఇంటర్నేషనల్ గ్రాండ్‌మాస్టర్ టోర్నమెంట్‌లో కుమార్ ప్రతిభకు అందరూ నోరెళ్లబెట్టారు. తొమ్మిది రౌండ్లలో 6 పారుుంట్లు సాధించి, ఇంటర్నేషనల్ మాస్టర్‌గా (ఐఎమ్) నిలిచాడు. ఇలా మరో రెండు ఐఎమ్‌లు సాధిస్తే ఇంటర్నేషనల్ మాస్టర్‌గా ‘ఫిడే’ టైటిల్ సాధిస్తాడు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అండర్ 19 పోటీల్లో జాతీయ చాంపియన్‌గానూ నిలిచాడు. కానీ, వీరి ప్రతిభకు ప్రధాన అడ్డంకి పేదరికమే. టోర్నమెంట్లలో పాల్గొనాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా చాలా డబ్బు కావాల్సి ఉంటుంది. పెద్దమనసుతో సాయం చేసే దాతల కోసం ప్రస్తుతం వీరు చూస్తున్నారు. వీరి ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం..!