ఆశీర్వాదం కోసం వచ్చి.. కాల్చేశారు
వారణాసి: ఉత్తర ప్రదేశ్ బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నేత రామ్ బిహారీ చౌబీను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ఆశీర్వాదం కావాలంటూ శుక్రవారం శ్రీకాంత్‌పూర్లోని రామ్ బిహారీ ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్ర రక్తస్రావం అయిన ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
రామ్ బిహారీ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత సుశీల్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. స్థానిక రాజకీయాల్లో కీలకంగా ఉండే ఆయన.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేయడానికి టికెట్ ఆశిస్తున్న వారిలో ముందున్నారు. అలాగే మాఫియా డాన్ బ్రజేష్ సింగ్తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది. రామ్ బిహారీ హత్యపై బంధువులు, పార్టీ అనుచరులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రధానమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో గత నెలలో బీజేపీ కార్పొరేటర్ హత్యకు గురైన విషయం తెలిసిందే.