యూపీలో శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి తొలిసారి ప్రజలముందుకెళ్లనున్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: యూపీలో శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి తొలిసారి ప్రజలముందుకెళ్లనున్నారు. సోమవారం ఆమె మీరట్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ ప్రభ తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో మాయవతి నిర్వహిస్తున్న ఈ ర్యాలీ పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.
మార్చిలో జరిగిన ఎన్నికల్లో 403 స్థానాలకుగాను బీఎస్పీ కేవలం 19 చోట్ల గెలవడం తెలిసిందే. లోక్‌సభలో ఆ పార్టీకి ఒక్క ఎంపీ కూడా లేరు. అటు రాజ్యసభలోనూ కేవలం నలుగురే బీఎస్పీ సభ్యులున్నారు. వివిధ కారణాలతో కొన్ని పార్టీ శ్రేణులు పార్టీకి దూరమయ్యాయి. ఇలాంటి ర్యాలీలను మాయావతి ఇకపై ప్రతి నెలా 18వ తేదీన వారణాసి, ఆజాంగఢ్, లక్నో, అలహాబాద్ సహా పలుచోట్ల నిర్వహిస్తారని బీఎస్పీ నేత ఒకరు తెలిపారు.