న్యూ ఢిల్లీ: బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా వ్యవహారంపై గురువారం పార్లమెంట్లో వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. విజయ్ మాల్యాను దేశం విడిచి ఎలా వెళ్లనిచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నల్లడబ్బును వెనక్కి తీసుకొస్తామని చెబుతున్న ఈ ప్రభుత్వం మాల్యాకు ఎలా అనుమతులు ఎలా ఇచ్చిందో చెప్పాలన్నారు. 9000 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడిన మాల్యా వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించాలన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో మాట్లాడుతూ.. మాల్యా నుండి నయా పైసతో సహా వసూలు చేస్తామని వెల్లడించారు. మాల్యాకు తమ ప్రభుత్వ హయాంలో బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని, 2004 నుండి 2008 వరకు యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఆయన బ్యాంకుల నుండి రుణాలు పొందారని జైట్లీ గుర్తుచేశారు. మాల్యా ఆర్థిక నేరాలపై సీబీఐ దర్యాప్తు జరుపుతుందని ఆయన వెల్లడించారు.