ఈరోజు నుంచి అక్కడ సోషల్ మీడియా బంద్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి సోషల్ మీడియా వెబ్‌సైట్‌లను నిలిపివేయాలని ఆ రాష్ట్ర పోలీసులు సూచించారు. మళ్లీ ఆదేశాలిచ్చే వరకు సేవలు ఆపు చేయాలని కోరారు. హిజ్బుల్ నేత బుర్హాన్ వనీ ప్రథమ వర్థంతి ఈ వారాంతంలో ఉన‍్నందున ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకుంటున్నట్లు ఐజీ మునీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. జాతి వ్యతిరేక శక్తులు ఇంటర్నెట్‌ను వేదికగా చేసుకునే విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశం ఉందని, అందుకే సేవలను నిలిపివేయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సోషల్ మీడియాసైట్‌లను మూసి వేయటం సాధ్యంకాని పక్షంలో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేయాలని సర్వీస్ ప్రొవైడర్లను కోరామన్నారు. ముందుజాగ్రత్తగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేయాలని కోరనున్నట్లు సమాచారం. ఇప్పటికే భద్రతా బలగాలను భారీగా మోహరించిన యంత్రాంగం పూర్తి అప్రమత్తత ప్రకటించింది.
గత ఏడాది జూలై 8వ తేదీన భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బుర్హాన్ మృతి చెందాడు. అప్పటి నుంచి కాశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లలో దాదాపు 85 మంది చనిపోగా వందలాదిమంది గాయాలపాలయ్యారు. బుర్హాన్ వర్థంతి రోజైన ఈనెల 8వ తేదీన పోలీసులు, సైన్యంపై రాళ్లు రువ్వాలని ఇప్పటికే వేర్పాటువాదులు ప్రజలకు పిలుపునిచ్చారు.