
తుమకూరు (కర్ణాటక): ఏరుకున్న వాళ్లకు ఏరుకున్నన్ని కోడిగుడ్లు దొరికాయి.. ఎక్కడనుకుంటున్నారా! ఈ చిత్రం కర్ణాటకలో శనివారం కనిపించింది. తుమకూరు జిల్లా, శిరా తాలూకా కళ్లంబెళ్ల జాతీయ రహదారిపై టైరు పంక్చరై రోడ్డు పక్కన నిలిపిన కోడిగుడ్ల లారీని కేఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో లారీలోని 6 లక్షల రూపాయల విలువైన కోడిగుడ్లన్నీ రోడ్డుపాలయ్యాయి.
ఎక్కువశాతం గుడ్లు పగిలిపోగా మిగిలిన వాటిని ఏరుకొనేందుకు స్థానికులు ఎగబడ్డారు. రోడ్డంతా పగిలిన గుడ్లతో చిందరవందరగా తయారైంది. కోడిగుడ్లను ఏరుకునేందుకు జనం ఎగబడటంతో అక్కడ కోలాహలం నెలకొంది. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.