
మూడు రాష్ట్రాల్లో 15 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లోని 15 శాసనసభ స్థానాలకు ఆగస్టు 21న ఉపఎన్నికలు జరగనున్నాయి. బీహార్‌లోని 10, కర్ణాటకలోని 3, పంజాబ్‌లోని 2 సీట్లకు వీటి నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ శనివారం తెలిపింది. ఈ సీట్లకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేల్లో కొందరు లోక్‌సభకు ఎన్నిక కావడం, మరికొందరు రాజీనామా చేయడంతో ఎన్నికలు అవసరమయ్యాయి. బీహార్‌లోని నర్కాతియాగంజ్, రాజ్‌నగర్, జలే, చప్రా, హాజీపూర్, మొహీనుద్దీన్ నగర్, పర్‌బత్తా, భాగల్పూర్, బంకా, మొహానియా లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
కర్ణాటకలోని షికారిపుర, బళ్లారి రూరల్, చిక్కోడిలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. షికారిపుర ఎమ్మెల్యే యడ్యూరప్ప, బళ్లారి రూరల్ ఎమ్మెల్యే శ్రీరాములు, చిక్కోడి ఎమ్మెల్యే ప్రకాశ్ హుక్కేరి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందడంతో అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేశారు. షికారిపుర నుంచి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర, బళ్లారి రూరల్ నియోజకవర్గం నుంచి శ్రీరాములు సోదరి శాంత పోటీకి దిగే అవకాశాలున్నాయి.