ఆర్కేనగర్ ఉప ఎన్నికలు రద్దయ్యే ఛాన్స్!
చెన్నై: తమిళనాడులో ఆర్కేనగర్‌కు జరగనున్న ఉపఎన్నికలు రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేశారని ఆధారాలతో సహా బయటపడటంతో మరో నాలుగు రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్ రద్దు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈసీ రేపు నిర్ణయాన్ని వెలువరించనుందని సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా, నియోజకవర్గంలో తమకు పట్టుబడ్డ నగదు, తాయిలాల వివరాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీ, ప్రత్యేక ఎన్నికల అధికారి విక్రమ్‌బాద్రాతో పాటు పలువురు అధికారులు ఆగమేఘాలపై ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
వారు ప్రస్తుతం ఎన్నికల ప్రధాన కమిషనర్‌తో భేటీ అయి ఈ విషయంపై చర్చిస్తున్నారు. ఒక్కో ఓటుకు దాదాపు రూ.4వేలు చెల్లించారని తెలుస్తోంది. నగదు బట్వాడాకు తగ్గ ఆధారాలు లభించడం, అమ్మ, పురట్చితలైవి శిబిరాలు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కి ఉండడం వెరసి ఎన్నికల నిర్వహణ మీద కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నజీంజైదీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన దృష్ట్యా, రద్దు విషయంలో వెనక్కు తగ్గుతారా, వాయిదా వేస్తారా అని విస్తతంగా చర్చ జరుగుతుంది. మరోపక్క, సీఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారులు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఉన్నపలంగా డబ్బు పంపిణీ విషయంపై దర్యాప్తు ఆదేశించింది.