
ప్రతీకాత్మక చిత్రం
ముంబై : జై శ్రీరాం అని నినదించాలంటూ ఓ ముస్లిం క్యాబ్ డ్రైవర్‌పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన థానేలో జరిగింది. మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు థానేలోని దివా ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్ ఫైజల్ ఉస్మాన్ ఖాన్‌ను అటకాయించి జై శ్రీరాం అనాలని బెదిరించారు. జై శ్రీరాం అనకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని భౌతిక దాడికి పాల్పడ్డారు. రోడ్డు మధ్యలో కారును ఎందుకు ఆపావంటూ బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తనపై దౌర్జన్యానికి దిగారని డ్రైవర్ చెప్పారు.
తాను ముస్లింనని గ్రహించిన వారు కారు నుంచి తనను బయటకు లాగి కొట్టారని వెల్లడించారు. జైశ్రీరాం అంటేనే తనను విడిచిపెడతామని బెదిరించారని తెలిపారు. క్యాబ్‌లో కూర్చున్న ప్రయాణీకుల్లో ఒకరు పోలీసులకు ఫోన్ చేయగా, డ్రైవర్ మొబైల్ ఫోన్‌ను లాక్కున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించి నిందితులు వాడిన బైక్ రిజిస్ర్టేషన్ నెంబర్‌ను ఫిర్యాదులో పేర్కొన్నారు. వాహనాన్ని ట్రేస్ చేసి నిందితులను జైదీప్ ముండే, మంగేష్ ముండే, అనిల్ సూర్యవంశీగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment