మహిళా ప్యాసింజర్ని వీడియోలు తీసి..
న్యూఢిల్లీ: క్యాబ్ డ్రైవర్ల తీరు మారడం లేదు. పలు సంఘటనలు.. వాటి అనంతర పరిణామాలు ఇప్పటికే వెలుగుచూస్తున్నా కనీసం వాటిని చూసైనా తమ ఆలోచనలు మార్చుకోవడం లేదు. ఆఫీసుకు వెళ్తున్న ఓ మహిళ ఉద్యోగిని తన ఫోన్లో వీడియో తీస్తూ ఓ ఓలా క్యాబ్ డ్రైవర్ తప్పిదానికి పాల్పడ్డాడు. అసభ్యంగా మాటలంటూ.. ఆమెను చూసి తప్పుడు సంకేతాలు చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆమె చాణక్యపురిలో ఉన్న తన కార్యాలయానికి వెళ్లేందుకు ఓ ఓలా క్యాబ్ ను బుక్ చేసుకుంది. అయితే వాళ్లు వెళుతుండగా అతడు కార్లోని అద్దంలో చూస్తూ ఫోన్లో కెమెరా ఆన్ చేసి వీడియో తీయడం ఆమె గమనించింది. ఎందుకలా చేస్తున్నావని ప్రశ్నిస్తే తాను ఫొటోలు తీయడం లేదని తన కూతురు ఫొటోలు చూస్తున్నానని అబద్ధం చెప్పాడు. దీంతో ఆమె అతడి చేతిలో నుంచి ఫోన్ లాక్కోని చూడగా అందులో ఆమె కొన్ని ఫొటోలు, వీడియోలు దర్శనం ఇచ్చాయి. కోపంతో ఊగిపోయిన ఆ మహిళ పోలీసులకు చెప్పింది. అసలు ఇలాంటి డ్రైవర్లను ఎలా పెట్టుకుంటారో అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.