తప్పులో కాలేసిన ఉమా భారతి!
న్యూఢిల్లీ: ప్రజలకు చేరువ కావాలనే తాపత్రయంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న రాజకీయ నాయకులు తొందరపాటులో తెలిసి తెలియక తప్పులో కాలేస్తున్నారు. తాజాగా అలాంటి తప్పిదంలో కేంద్రమంత్రి ఉమాభారతి చిక్కుకున్నారు. మంత్రి పదవుల కేటాయింపులపై అధికార ప్రకటన వెలువడకుండానే ఉమాభారతి అత్యుత్సాహంతో తనకు జలవనరులు, గంగా ప్రక్షాలన మంత్రిత్వ శాఖను కేటాయించారని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేసి ప్రోటోకాల్ ను ఉల్లంఘించారు.
వెంటనే తప్పు తెలుసుకున్న ఉమాభారతి ట్విట్ ను తొలగించి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మంత్రిత్వ శాఖ కేటాయింపుపై అధికార ప్రకటన రాకుండానే తాను ప్రకటన చేయడం తప్పిదమే.. అని ట్విట్ చేసింది. అంతేకాక తన సహాయకుడు రాజేశ్ కటియార్ తన పాస్ వర్డ్ తీసుకుని ట్వీట్ చేశారని కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.
ఆతర్వాత పోర్ట్ ఫోలియో గురించి ట్విట్ చేయడం ప్రోటోకాల్ ఉల్లంఘించడమే. అందుకు క్షమాపణలు కోరుతున్నాను అని ఉమా భారతి అకౌంట్ లో రాజేశ్ కటియార్ ట్విట్ చేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ప్రోటోకాల్ ఉల్లంఘించడంపై 'ఫైర్ బ్రాండ్' రాజకీయవేత్త విమర్శలకు గురయ్యారు.