కోల్కతా: దేశంలో సంచలనం సృష్టించిన శారదా కుంభకోణంలో నిందితుడైన పశ్చిమ బెంగాల్ రవాణాశాఖ మంత్రి మదన్ మిత్రకు కోల్ కతా హైకోర్టు గట్టి షాకిచ్చింది. ఈ నెల 17 వరకు ఆయన ఇంట్లో నుంచి కాలు బయటపెట్టడానికి వీల్లేదంటూ అప్పటి వరకు హౌజ్ అరెస్టులో ఉండాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం, ఇతర వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఆయన ఇళ్లు దాటి బయటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. శారదా కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు గత ఏడాది డిసెంబర్ 12న మదన్ మిత్రాను అరెస్టు చేశారు.
అయితే, సీబీఐ కస్టడీలో ఉండగానే ఆరోగ్యపరమైన సమస్యల పేరిట ఆయన ఆస్పత్రిలో చేరారు. వీవీఐపీలకు ప్రత్యేక చికిత్సనందించే విభాగంలో గడుపుతూ వచ్చారు. గత డిసెంబర్ 19న ఆయనను సీబీఐ కస్టడీకి తీసుకోగా ఇప్పటి వరకు కేవలం 50 రోజులు మాత్రమే జైలులో గడిపి మిగితా రోజులన్నీ ఆస్పత్రిలోనే ఉంటూ బెయిల్ పిటిషన్లు పెట్టుకుంటూ వచ్చారు. కోర్టు ఆ పిటిషన్లు తిరస్కరించడం ఆయన అదే ఆస్పత్రిలోనే ఉండిపోవడం కొన్ని నెలలుగా జరుగుతూ వస్తుంది. కానీ, గత నెల 31న ఆయనకు బెయిల్ వచ్చింది. అలా బెయిల్ వచ్చిన 24 గంటల్లోనే ఆస్పత్రి ఖాళీ చేసి ఇంటికి వెళ్లారు. దీంతో ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోల్ కతా హైకోర్టుకు వెళ్లడంతో మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజా ఉత్తర్వులతో షాకిచ్చింది.
బెయిలొచ్చినా.. బయటకు నో
Published Thu, Nov 5 2015 4:21 PM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM
Advertisement
Advertisement