Saradha scam
-
మూడోరోజూ సీబీఐ విచారణలో రాజీవ్ కుమార్
షిల్లాంగ్: శారద చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించి కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కునాల్ ఘోష్ విచారణ నిమిత్తం సోమవారం షిల్లాంగ్‌లోని సీబీఐ ఎదుట హాజరయ్యారు. వరుసగా మూడు రోజులుగా రాజీవ్‌కుమార్‌ను రెండ్రోజులుగా కునాల్ ఘోష్‌ను సీబీఐ విచారిస్తోంది. ఘోష్ సోమవారం ఉదయం పది గంటలకు సీబీఐ కార్యాలయానికి హాజరుకాగా, గంట తర్వాత రాజీవ్ కుమార్ వచ్చారు. ఆదివారం కూడా వీరిద్దరినీ వేర్వేరుగా పలు కోణాల్లో ఎనిమిది గంటలపాటు ప్రశ్నించినట్లు సీబీఐకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. శారద చిట్‌ఫండ్ కుంభకోణంకు సంబంధించిన కీలక ఆధారాలను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై ముగ్గురు సీబీఐ అధికారులు రాజీవ్ కుమార్‌ను శనివారం సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సీబీఐ విచారణను పర్యవేక్షించేలా ఆదేశించలేం: సుప్రీం శారదా కుంభకోణం విచారణను ప్రత్యక్షం గా పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. శారద చిట్‌ఫండ్ కుంభకోణంపై సీబీఐ విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా తాము ఆదేశించలేమ ని జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం స్పష్టం చేసింది. -
దీదీ దీక్షకు అర్థం ఉందా?
పశ్చిమ బెంగాల్లో వేగంగా మారుతున్న రాజ కీయ పరిణామాలు వివిధ రంగుల్ని సంతరించుకుంటున్నాయి. మమత రానున్న ఎన్నికల్లో మోదీ వ్యతిరేక కూటమి నాయకురాలిగా నిలిచే భావనలో ఉన్నారు కాబట్టి ప్రతీ విషయాన్నీ కేంద్ర రాష్ట్ర సంబంధాల అంశంగా మలిచే పనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం సీబీఐ నేపథ్యంగా సాగుతున్న పోరాటం సమంజసమైనది కాదు. ఎందుకంటే సీబీఐ తనిఖీ చెయ్యాలనుకొన్నది ఒక పెద్ద కుంభకోణంకి సంబంధించిన వ్యవహా రంలో. వేల కోట్ల రూపాయల మేరకు ప్రజలకు టోపీ పెట్టి తప్పించుకు తిరుగుతున్న పెద్ద తలకాయలపై 2013 నుంచీ ఉన్న కేసు ఇది. శారదా కుంభకోణం కానీ, రోజ్ వ్యాలీ కుంభకోణం కానీ లక్షలాది పేదల సొమ్ము పోంజీ స్కీమ్ ద్వారా సేకరించి, మనీ లాండరింగు లాంటి తీవ్ర నేరాలతో ముడిపడిన స్కాం వ్యవహారం. ఈ కేసును రాష్ట్ర పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని గ్రహించి సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చెయ్యడానికి సిద్ధపడిన అధికారి గతంలో ఈ కుంభకోణంపై దర్యాప్తు చేసి ఉన్న రాష్ట్ర అధికారి. సీబీఐ గొప్పదేమీ కాకపోవచ్చు. కానీ ఈ వేలకోట్ల అవినీతి కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తుని జరగనివ్వాలి. కేంద్రాన్ని బోనులో నిలబెట్టడానికి మంచి అవకాశంగా భావించి దర్యాప్తుని అడ్డుకొంటే అది ప్రజల పట్ల బాధ్యతారాహిత్యమే. పోరాడటానికి సవాలక్ష రాజకీయ ఆయుధాలున్నాయి. ఇది మాత్రం కాదు. -డా డీవీజీ శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం -
రక్షకుల ముసుగులో భక్షకులు
ఏకంగా మూడు రాష్ట్రాల్లో లక్షలాదిమంది పేద, మధ్యతరగతి ప్రజలను ఘోరంగా మోసం చేసిన శారదా స్కాంలో దర్యాప్తును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీక్షకు దిగడం విడ్డూరం. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వచ్చారు. అయినా వారికి అడ్డుపడి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. ఆదాయపన్ను అధికారులకు రక్షణ కల్పించవలసిన పోలీసుల సహాయాన్ని ఉపసంహరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులు ఎగవేసే బడా వ్యాపారులకు కొమ్ము కాసింది. మమత, చంద్రబాబులు తమనూ, తమ వారినీ రక్షించుకునేందుకు వ్యవస్థల రక్షకులం అనే ముసుగులు ధరిస్తారు. గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అజోయ్ ముఖర్జీ తన రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పోవడం పట్ల నిరసనగా ఒక రోజు సత్యాగ్రహం చేశాడట. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆయన రెండుసార్లు ముఖ్య మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ వీడి బాంగ్ల కాంగ్రెస్ స్థాపించాక ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో బాంగ్ల కాంగ్రెస్‌తో బాటు మార్క్సిస్ట్ పార్టీ కూడా భాగ స్వామి. ఆ ప్రభుత్వంలో సీపీఎం నాయకుడు జ్యోతిబసు హోంమంత్రి. తన ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపడానికి ఆనాడు అజోయ్ ముఖర్జీ సత్యా గ్రహం చేస్తే, ఇన్నేళ్ళకు తన ప్రభుత్వాన్ని రక్షించుకోవడం కోసం ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన దీక్ష చేపట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవరయినా పడ గొట్టే ప్రయత్నం చేస్తుంటే , దాన్ని అడ్డుకునే పరిస్థితి లేక నిస్సహాయతకు గురయితే నిరసనకు దిగాలి. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం ఏదీ జరుగుతున్న దాఖలాలు లేవు. ఏకంగా మూడు రాష్ట్రాల్లో లక్షలాదిమంది పేద, మధ్యతరగతి ప్రజలను ఘోరంగా మోసం చేసిన ఒక సంస్థ వ్యవహారంలో దర్యాప్తు ముందుకు సాగ కుండా అడ్డుకునేందుకు మమతా బెనర్జీ ఈ దీక్ష చేశారు. శారదా స్కాంలో పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నాయకుల హస్తం ఉన్నదన్న ఆరోపణల మీద అరెస్ట్‌లు కూడా జరిగాయి గతంలో. ఈ కుంభకోణాలపైన దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సీబీఐ అధికారులు కోల్‌కతా నగర పోలీసు కమిషనర్‌ను విచా రించడానికి వెళితే, స్థానిక పోలీసులు ఎదురు తిరిగి వారిని అడ్డుకోవడమే కాదు ఏకంగా ముఖ్యమంత్రి బయలుదేరి ఆ పోలీసు కమిషనర్ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి సీబీఐ చర్యకు నిరసనగా తాను ధర్నాకు పూనుకున్నారు. ఇంతకంటే విడ్డూరం బహుశా ఇంకోటి ఉండదేమో. ఒక అధికారి మీద ఆరోపణలు వస్తే దాని మీద విచారణకు అంతకంటే పైస్థాయి సంస్థ దర్యాప్తు చేస్తుంటే చట్టాన్ని తన పని తాను చేసుకుపోనివ్వవలసిన ముఖ్యమంత్రే అడ్డుపడటం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగడం అజోయ్ ముఖర్జీ కాలానికీ, మమతా బెనర్జీ కాలానికీ మారిపోయిన రాజకీయ విలువలకు–మారిపోయిన అనడం కంటే దిగజారిపోయిన అంటే బాగుంటుంది–అద్దం పడుతున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రాల్లో కేసులు దర్యాప్తు చెయ్యాలంటే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సిందే, అందులో ఎటువంటి వివాదమూ లేదు. అయితే కోర్టులు ఆదేశించినప్పుడు ఆ నిబంధన వర్తించదు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక అనుమతి అప్పుడు అవసరం ఉండదు. ఇక్కడ మొన్న కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు సుప్రీం కోర్టు ఆదేశాలమేరకే వచ్చారు. అయినా మమతా బెనర్జీ ప్రభుత్వం వారికి అడ్డుపడి కోర్టు ధిక్కారానికి పాల్పడటమేకాక దీక్షలకు దిగడం విచిత్రం. మళ్ళీ సుప్రీంకోర్టే కోల్‌కతా పోలీసు కమిషనర్ సీబీఐ అధికారుల ముందు హాజరై కేసు దర్యాప్తునకు సహకరించవలసిందేనని చెప్పాల్సి వచ్చింది. ఒక కేసు దర్యాప్తులో ఒక అధికారిని రక్షించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రే నడుం బిగించడం, అదీ కొన్ని లక్షల కుటుంబాలను నాశనం చేసిన ఒక దుర్మార్గమైన కేసులో కావడం వెనక ఉన్న ప్రయోజనం ఏమిటో సామాన్యులకు కూడా అర్థం అవు తుంది. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను విచారించడానికి సీబీఐ ఎంచుకున్న సమయం కేంద్ర ప్రభుత్వం మీద లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ మీద అనుమానాలకు తావు ఇస్తున్నది. రెండు మాసాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం, ఎన్డీఏకు ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రతిపక్ష ఫ్రంట్ ఒకటి ఏర్పడటం, ఆ ఫ్రంట్ గత వారమే కోల్‌కతాలో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించడం కూడా ఈ అనుమానాలకు ఊతం ఇస్తున్నది. ఒకప్పుడు మమతా బెనర్జీ బీజేపీకి మిత్రురాలే. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి కూడా. ఆమెలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న మొన్నటి దాకా ఎన్డీఏలో భాగస్వామే. బీజేపీకి మంచి మిత్రుడే. రాజకీయంగా తెగతెంపులు చేసుకున్నాక ఇటీవలే చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ ప్రవేశానికి అనుమతిని రద్దు చేసింది, చంద్రబాబు అడుగుజాడల్లో నడిచి మమతా బెనర్జీ బెంగాల్లో కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా సీబీఐ ప్రవేశించనే లేదు, ఆదాయ పన్ను అధికారులు కొన్ని వ్యాపార సంస్థల మీదా సంపన్నుల మీద దాడులు చేస్తేనే సహించలేని చంద్రబాబు ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరించిందో చూశాం. ఆదాయ పన్ను అధికారులకు రక్షణ కల్పించ వలసిన పోలీసుల సహాయాన్ని ఉపసంహరించుకుని ఏపీ ప్రభుత్వం పన్నులు ఎగవేసే బడా వ్యాపారులకు కొమ్ము కాసింది. శారదా స్కాంలో నిందితులను రక్షించడానికి కంకణ బద్ధురాలైన మమతా బెనర్జీకి మద్దతు తెలపడానికి బాబు, కుమారుడు లోకేష్ హుటాహుటిన కలకత్తా వెళ్ళారు. పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించడానికి వీలులేదని మమతా బెనర్జీ సీబీఐని అడ్డుకుంటే, సుప్రీంకోర్టు అలా కుదరదని విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్తే–అందులో మమత విజయం చంద్రబాబుకు ఏం కనిపించిందో? అధికారంలో ఉన్నవారు చట్టబద్ధ వ్యవస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం మామూలైపోయిన మాట నిజం. ఇవ్వాళ బాబు, మమత ఏ కూటమిలో అయితే చేరారో అదే యూపీఏ అధికారంలో ఉండగా సుప్రీంకోర్టే సీబీఐ పంజరంలోని రామ చిలకగా మారిందని వ్యాఖ్యానించింది. ఎవరు అధికారంలో ఉన్నా చట్టబద్ధ వ్యవస్థలను, రాజ్యాంగ సంస్థలను తమకు అనుకూలంగా, తమ వ్యతిరేకులను రాజకీయంగా వేధించడానికి ఉపయోగించుకోవడం సర్వ సాధారణం అయిపోయింది. దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు రావలసిందే తప్ప రాజకీయ పార్టీలు చేస్తామంటున్న, చేస్తున్న పోరాటాల్లో చిత్తశుద్ధి కనిపించదు. జాతిని రక్షిస్తాం, వ్యవస్థలను రక్షిస్తాం, అందుకే కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నానని చెపుతున్న చంద్రబాబు గతంలో ఇవే వ్యవస్థలను రాజకీయ వేధింపుల కోసం కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏను అడ్డగోలుగా వాడుకున్నప్పుడు తానూ భాగస్వామి అయిన విషయం ఇంకా ఎవరూ మరిచిపోలేదు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకున్న శారదా స్కాం వంటిదే ఆంధ్రప్రదేశ్‌లో అగ్రి గోల్డ్ కుంభకోణం. ఇంకా అనేక ఆర్థిక అవకతవకలకు సంబంధించి తెలుగు దేశం ప్రభుత్వం, దాని అధినేత, ఆయన కుమారుడూ, మంత్రులూ, నాయకులూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బహుశా కేంద్ర సంస్థల కన్ను ఈ అక్రమాల మీద పడుతుందన్న అనుమానం కలిగిందేమో కొంత కాలంగా–ముఖ్యంగా బీజేపీతో తెగతెంపులు అయిన దగ్గరి నుండీ– బాబు ప్రజలను తనకు రక్షణగా ఉండాలని పదేపదే కోరుతున్నారు. నిన్నగాక మొన్న శాసన సభలో కూడా నన్ను జైలులో పెడతారా అని గొంతు చించుకుని మాట్లాడారు. ఏ తప్పూ జరగకపోతే జైలులో పెడతారేమో అన్న అనుమానం ఎందుకు కలుగుతున్నది ఏపీ ముఖ్యమంత్రికి? నిజానికి దీక్షలు చెయ్యడంలో మమతకి బాబే ఆదర్శం. నాలుగేళ్ళు ప్రత్యేక ప్యాకేజీ పాటపాడి, తప్పనిసరి పరిస్థితుల్లో మాట మార్చి ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నాక ఆయన రోజుకో దీక్ష చేస్తున్నారు. చిత్రం ఏమిటంటే ఆ దీక్షలన్నీ ప్రభుత్వ ఖర్చుతోనే. అన్ని విషయాల్లో ప్రతిపక్ష పార్టీని కాపీ కొట్టినట్టుగానే మొన్న అసెంబ్లీలో కూడా నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపే కార్యక్రమం చేశారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ శాసన సభలో నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపితే, శాసన సభను అపవిత్రం చేస్తారా అన్న చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అదే ప్రతిపక్షం నిరసనను కాపీ కొట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేసుకోనిచ్చే పరిస్థితులు ఇవాళ కనపడటం లేదు. దాన్ని ఆసరాగా తీసుకుని మమత, చంద్రబాబులు తమనూ, తమ వారినీ రక్షించుకునేం దుకు వ్యవస్థల రక్షకులం అనే ముసుగులు ధరిస్తారు. ఈ ముసుగులను తొలగించి వారివారి నిజ స్వరూపాలు బయటపెట్టే పని ప్రజలే చెయ్యాలి. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
మాజీ మంత్రి బెయిల్‌పై విడుదల
కోల్ కతా: పశ్చిమబెంగాల్లో కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ స్కాంలో నిందితుడిగా ఉన్న రాష్ట్ర మాజీ రవాణశాఖ మంత్రి మదన్ మిత్రా జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 21 నెలలుగా అలీపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మిత్రా బెయిల్ పై విడుదలై భవానీపూర్ పోలీస్ స్ఘేషన్ పరిధిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుగా రూ.30 లక్షల షరతుతో పాటు ఆయన పాస్ పోర్టును స్వాధీనం చేసుకుని మదన్ మిత్రాకు అలీపూర్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూర్ చేసింది. తృణముల్ కాంగ్రెస్ సీనియర్ నేత మదన్ మిద్రా తన నివాసానికి చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. 'గత రెండేళ్లుగా దుర్గామాత ఉత్సవాలను చూడలేకపోయాను. ఈ ఏడాది నాకు ఆ సమస్య లేదు. తనకు, తన కుటుంబసభ్యులకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది' అని మాజీ మంత్రి తెలిపారు. నవంబర్ 23వరకూ తనకు బెయిల్ మంజూరయిందని కాలమే తన నిర్దోషిత్వాన్ని నిరూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి పూర్తి సమయం కుటుంబంతో గడుపుతానని, చట్టాలను ఉల్లంఘించే యత్నం చేయనన్నారు. -
శారదా ఛార్జిషీటులో చిదంబరం భార్య
కోల్‌కతా: దేశంలో సంచలనం సృష్టించిన శారదా కుంభకోణం కేసుకు సంబంధించిన ఛార్జిషీటులో మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం భార్య నళిని చిదంబరం పేరును చేర్చారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం కోర్టు సమర్పించిన అదనపు ఆరో చార్జిషీటులో సీబీఐ అధికారులు నళిని పేరును చేర్చినట్లు ఆ శాఖ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, ఆమెను ఇందులో నిందితురాలిగా చేర్చారా లేక సాక్షిగా చేర్చారా అనే వివరాలు మాత్రం స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం కేసు ఉన్న పరిస్థితిలో ఎలాంటి వివరాలు తెలిపేందుకు కూడా సీబీఐ అధికారులు నిరాకరించారు. 'శారదా కుంభకోణం కేసులో నిందితుడైన మనోరంజన సింగ్‌కు ఆమె(నళిని వ్యక్తిగత న్యాయవాది. శారదా సంస్థ ద్వారానే ఆమెకు ఫీజు చెల్లిస్తూ వస్తున్నారు' అని ఓ సీబీఐ అధికారి తెలిపారు. -
బెయిలొచ్చినా.. బయటకు నో
కోల్‌కతా: దేశంలో సంచలనం సృష్టించిన శారదా కుంభకోణంలో నిందితుడైన పశ్చిమ బెంగాల్ రవాణాశాఖ మంత్రి మదన్ మిత్రకు కోల్ కతా హైకోర్టు గట్టి షాకిచ్చింది. ఈ నెల 17 వరకు ఆయన ఇంట్లో నుంచి కాలు బయటపెట్టడానికి వీల్లేదంటూ అప్పటి వరకు హౌజ్ అరెస్టులో ఉండాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం, ఇతర వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఆయన ఇళ్లు దాటి బయటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. శారదా కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు గత ఏడాది డిసెంబర్ 12న మదన్ మిత్రాను అరెస్టు చేశారు. అయితే, సీబీఐ కస్టడీలో ఉండగానే ఆరోగ్యపరమైన సమస్యల పేరిట ఆయన ఆస్పత్రిలో చేరారు. వీవీఐపీలకు ప్రత్యేక చికిత్సనందించే విభాగంలో గడుపుతూ వచ్చారు. గత డిసెంబర్ 19న ఆయనను సీబీఐ కస్టడీకి తీసుకోగా ఇప్పటి వరకు కేవలం 50 రోజులు మాత్రమే జైలులో గడిపి మిగితా రోజులన్నీ ఆస్పత్రిలోనే ఉంటూ బెయిల్ పిటిషన్లు పెట్టుకుంటూ వచ్చారు. కోర్టు ఆ పిటిషన్లు తిరస్కరించడం ఆయన అదే ఆస్పత్రిలోనే ఉండిపోవడం కొన్ని నెలలుగా జరుగుతూ వస్తుంది. కానీ, గత నెల 31న ఆయనకు బెయిల్ వచ్చింది. అలా బెయిల్ వచ్చిన 24 గంటల్లోనే ఆస్పత్రి ఖాళీ చేసి ఇంటికి వెళ్లారు. దీంతో ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోల్ కతా హైకోర్టుకు వెళ్లడంతో మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజా ఉత్తర్వులతో షాకిచ్చింది. -
'బెయిల్ రాగానే.. ఆస్పత్రి వదిలేసిన మంత్రి'
కోల్‌కతా: దేశంలో సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ శారద కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మంత్రి మదన్ మిత్రకు బెయిల్ వచ్చిన మరసటి రోజే ఆస్పత్రి వదిలేశారు. ఆయన ప్రత్యేక అంబులెన్స్‌లో తన నివాసం చేరారు. శారదా కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు గత ఏడాది డిసెంబర్ 12న అరెస్టు చేసింది. అయితే సీబీఐ కస్టడీలో ఉండగానే ఆరోగ్యపరంగా అసంతృప్తిగా ఉందంటూ ఫిర్యాదు చేసి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నారు. వీవీఐపీలకు ప్రత్యేక చికిత్సనందించే విభాగంలో గడుపుతూ వచ్చారు. డిసెంబర్ 19న ఆయనను సీబీఐ కస్టడీకి తీసుకోగా ఇప్పటి వరకు కేవలం 50 రోజులు మాత్రమే జైలులో గడిపిన ఆయన మిగితా రోజులన్నీ ఆస్పత్రిలోనే ఉంటూ బెయిల్ పిటిషన్లు పెట్టుకుంటూ వచ్చారు. కోర్టు ఆ పిటిషన్లు తిరస్కరించడం ఆయన అదే ఆస్పత్రిలోనే ఉండిపోవడం కొన్ని నెలలుగా జరుగుతూ వస్తుంది. ఆస్పత్రి వైద్యులు కూడా ఆయన చాలా బలహీనంగా ఉన్నారని ఈ సమయంలో జైలులో ఉంచడం మంచిదికాదని చెప్తూ వచ్చారు. కానీ, ఆయనకు బెయిల్ వచ్చి 24 గంటలు గడిచిందో లేదో ఒక్క క్షణం కూడా ఆస్పత్రిలో ఉండకుండా వెంటనే ఇంటి బాట పట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది. వైద్యులు ప్రభుత్వం కుమ్మక్కై ఇన్ని రోజులు ఈ తతంగం నడిపారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆయనకు ఆస్పత్రిలో సకల భోగాలు ఏర్పాటుచేశారని కూడా ఇటీవల విమర్శలు భారీ స్ధాయిలో వచ్చాయి. ఇదిలా ఉండగా, చివరికి సత్యమే గెలిచిందని, అందుకే తమ నేత విడుదలై తమ ముందుకు వచ్చారంటూ మిత్రా మద్దతు దారులు ఆయన నివాసం వద్ద గట్టి నినాదాలు చేశారు. పటాలసులతో నానా హంగామా చేశారు. ఈ సందర్భంగా మీడియాను మిత్రాను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఇప్పుడు ఏది మాట్లాడటానికి సమయం కాదంటూ ఆయన ఇంట్లోకి వెళ్లిపోయారు. -
కేంద్ర మాజీ మంత్రి అరెస్ట్
శారద కేసులో మాతంగ్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ కోల్‌కతా: శారదా చిట్ ఫండ్ స్కామ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ ఎంపీ మాతంగ్ సిన్హ్‌ను సీబీఐ శనివారం అరెస్ట్ చేసింది. సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆయనను ఇక్కడి తమ కార్యాలయానికి విచారణ కోసం పిలిచించి అదుపులోకి తీసుకుంది. అరెస్టుకు ముందు ఏడు గంటలపాటు విచారించారు. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి ఒకరు అరెస్ట్ కావడం ఇదే తొలిసారి. దర్యాప్తు బృందానికి ఆయన సహకరించకపోవడడంతో అరెస్టు చేసినట్లు సీబీఐ వర్గాలు చెప్పాయి. సిన్హ్పై నేరపూరిత కుట్ర, మోసం, శారదా రియాల్టీకి సంబంధించి నిధుల దుర్వినియోగం తదితర అభియోగాలు మోపారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి సాయపడినట్లుగా భావిస్తున్న హోం శాఖలోని సీనియర్ అధికారితో సిన్హ్‌కు సంబంధంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన సిన్హ్‌కు ఉన్నతాధికారులతో సంబంధాలుండేవని, వారి పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని సీబీఐ వర్గాలు తెలిపాయి. హోం శాఖలోని ఓ సీనియర్ అధికారి పేరు వాడుకుని పనులు పూర్తి చేయించుకుంటున్నారన్నాయి. సిన్హ్ అరెస్ట్‌తో స్కాంలో ఆ అధికారి పాత్ర ఉందో లేదో నిగ్గు తేలుతుందని పేర్కొన్నాయి. కాగా, ఎం-త్రీ చానల్ ఏర్పాటు కోసం కెనరా బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 67 కోట్ల రుణాన్ని చెల్లించనందుకు సిన్హ్పై 2013లో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఆయనపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. -
సీబీఐ విచారణకు హాజరైన ముకుల్ రాయ్
కోల్‌కతా: శారదా స్కాం కేసులో రైల్వే మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ కార్యదర్శి ముకుల్ రాయ్ శుక్రవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. విచారణలో సీబీఐ పదేపదే అడిగిన ప్రశ్నలకు.. 'నేను ఎలాంటి నేరాలకు పాల్పడలేదు' అని మాత్రమే ఆయన సమాధానం చెప్పినట్లు సమాచారం. బెంగాల్‌కు చెందిన మంత్రి మదన్ మిత్రతో సహా తృణమూల్ పార్టీకి చెందిన నలుగురిపై శారదా స్కాం కేసులో ఆరోపణలు ఉన్నాయి. తృణమూల్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, పార్లమెంటరీ నేతలను సీబీఐ, ఈడీ బృందాలు విచారించాయి. కాగా ముకుల్ రాయ్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రధాన అనుచరుడు. -
రైల్వే మాజీ మంత్రికి సీబీఐ సమన్లు
కోల్ కతా: శారదా ఛిట్ ఫండ్ కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రాయ్ కోల్ కతాకు వచ్చిన తర్వాత తమ ముందు హాజరుకావాలని సీబీఐ సమన్లు పంపింది. రెండుమూడు రోజుల్లో కోల్ కతాకు తిరిగి వెళతానని, తప్పనిసరిగా సీబీఐ అధికారులను కలుస్తానని రాయ్ ఢిల్లీలో విలేకరులతో చెప్పారు. తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. కాగా సీబీఐని బీజేపీ రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ ఆరోపించారు. -
దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి
ప్రధాని మోదీకి ‘దీదీ’ సవాల్ శారదా స్కాంలో మంత్రి మిత్రాను సీబీఐ అరెస్టు చేయడంపై ఫైర్ కేంద్రానిది రాజకీయ కక్ష సాధింపేనని మమత ధ్వజం కోల్‌కతా: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారు మధ్య చిచ్చురేపిన శారదా చిట్‌ఫండ్ కుంభకోణం వ్యవహారం రెండు ప్రభుత్వాల మధ్య మరింత అగాధాన్ని సృష్టించింది. ఈ స్కామ్‌లో ప్రమేయం ఆరోపణలపై ఇప్పటికే ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను అరెస్టు చేసిన సీబీఐ శుక్రవారం మమత నమ్మినబంటు, బెంగాల్ రవాణా మంత్రి మదన్ మిత్రాను శుక్రవారం కోల్‌కతాలో అరెస్టు చేసింది. శారదా రియాల్టీకి సంబంధించిన కేసులో నేరపూరిత కుట్ర, మోసం, నిధుల అవకతవకలు, శారదా గ్రూప్ నుంచి అయాచిత ఆర్థిక లబ్ధి పొందడం వంటి అభియోగాలపై ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలిపింది. అయితే సీబీఐ చర్యపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మిత్రా అరెస్టు కేంద్రం రాజకీయ కక్ష సాధింపు, నీతిమాలిన కుట్రలో భాగమని దుయ్యబట్టారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మిత్రాను వైద్య పరీక్షల నిమిత్తం తరలించిన ఎస్ఎస్కేఎం ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను కలుస్తానని...ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలకు దమ్ముంటే వారి వద్ద ఉన్న పోలీసు మార్బలాన్నంతా ఉపయోగించి తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. సీబీఐని పావుగా వాడుకుంటూ బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. దేశ లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర వ్యవస్థను కేంద్రం నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. ‘‘ఈ కేసులో మిత్రాను సాక్షిగా పిలిచిన సీబీఐ కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన్ను అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపు కాదా?’’ అని మమత కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అసెంబ్లీ స్పీకర్‌కు సమాచారం ఇవ్వకుండానే ఒక మంత్రిని (మిత్రా) సీబీఐ అరెస్టు చేయడం చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీజేపీ నిజస్వరూపాన్ని బయటపెడతామని...అఖిల భారత స్థాయిలో ఆ పార్టీతో పోరాడతామన్నారు. సీబీఐ అరెస్టు చేసి, అభియోగాలు మోపిన ఒక వ్యక్తి (అమిత్ షాను ఉద్దేశించి) తమ పార్టీపై వేలెత్తి చూపుతున్నారని చురకలంటించారు. కేంద్రం తీరుకు నిరసనగా తమ పార్టీ శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనుందని చెప్పారు. ‘‘దేశంలో ఇందిరాగాంధీ హయాం నాటి ఎమర్జెన్సీ రోజులకన్నా ప్రస్తుత బీజేపీ పాలన అధ్వానంగా సాగుతోంది. మోదీ ప్రభుత్వం పిరికిపందలా, నియంతలా ప్రవర్తిస్తూ ప్రమాదకర ఆట ఆడుతోంది. కేంద్రంతో కొత్త యుద్ధం మొదలైంది. మీ (కేంద్రం) సవాల్‌ను స్వీకరిస్తున్నాం.’’ అని మమత పేర్కొన్నారు. మంత్రి పదవికి మిత్రా చేసిన రాజీనామాను తిరస్కరించినట్లు ‘దీదీ’ తెలిపారు. ఎన్నో మీడియా సంస్థలు చిట్ఫండ్ల కంపెనీల నుంచి ప్రకటనలు తీసుకున్నాయి. మరి వాటిపై చర్యలు తీసుకున్నారా? సహారా స్పాన్సర్‌షిప్‌తో క్రికెట్ ఆడిన సచిన్, సౌరవ్లు క్రిమినెల్స్ అవుతారా? ఎందరో సీపీఎం నేతలు చిట్‌ఫండ్ కంపెనీల యజమానులతో కనిపించారు. మరి వారిని మేం అరెస్టు చేయాలంటారా? అని మమత మీడియాను ఎదురు ప్రశ్నించారు. కేంద్ర ఆర్థికశాఖ ఆఫీసు సమీపంలో ఉన్న ఓ కంపెనీ వేల కోట్ల రూపాయల నిధులను గోల్మాల్ చేసిందన్నారు కాగా, అరెస్టుకు ముందు మిత్రాను సీబీఐ అధికారులు ఐదు గంటలపాటు ప్రశ్నించారు. శారదా గ్రూప్ చైర్మన్ సుదీప్తోసేన్‌కు న్యాయ సలహాదారుగా వ్యవహరించిన నరేష్ బలోదియాను సైతం నేరపూరిత కుట్ర అభియోగాల కింద అరెస్టు చేశారు. మిత్రాను శనివారం అలీపూర్ కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా శారదా స్కాంలో తృణమూల్ పాత్ర రోజురోజుకూ బలపడుతున్న నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ మమత సీఎం పదవికి రాజీనామా చేయాలని బెంగాల్ విపక్షాలు డిమాండ్ చేశాయి. -
శారద స్కాంలో బెంగాల్ మంత్రి అరెస్ట్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో కోట్లాది రూపాయల శారద చిట్‌ఫండ్ స్కాంలో సీబీఐ శుక్రవారం ఆ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మదన్ మిత్రాను అరెస్ట్ చేసింది. సీబీఐ ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. శారద స్కాంలో సీబీఐ ఇంతకుముందు పలువురు నాయకులను, ఉన్నతాధికారులను అరెస్ట్ చేసింది. అరెస్టయిన వారిలో పశ్చిమబెంగాల్ మాజీ డీజీపీ రజత్ మజుందర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మాజీ నాయకుడు అసీఫ్ ఖాన్, మాజీ ఎంపీ కునాల్ ఘోష్ ఉన్నారు. ఈ కేసులో సీబీఐ పలువురు ఎంపీలను ప్రశ్నించింది. -
చిట్‌ఫండ్ స్కాంలో ఎంపీ అరెస్టు
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన శారదా చిట్‌ఫండ్స్ స్కాంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు శృంజయ్ బోస్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కోట్లాది రూపాయల మొత్తంతో కూడిన ఈ స్కాంలో ఆయనతో పాటు మరికొందరు నాయకులను కూడా సీబీఐ వర్గాలు గత కొన్నాళ్లుగా ప్రశ్నిస్తున్నాయి. అయితే.. స్కాంలో వాళ్ల పాత్ర కూడా ఉన్నట్లు నిర్ధారించుకోవడంతోనే బోస్‌ను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. -
నా పాత్ర రుజువైతే రాజీనామా చేస్తా: మమత
శారదా చిట్‌ఫండ్స్ స్కాంలో తన పాత్ర రుజువైతే తక్షనం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని పశ్చిమబెంగాల్ సీఎం, ఫైర్‌బ్రాండ్ నాయకురాలు మమతా బెనర్జీ అన్నారు. ఈ విషయంలో దాచాల్సినది ఏమీ లేదని చెప్పారు. శారదా గ్రూపుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయా అని ప్రశ్నించగా.. ''ఎవరన్నారు? ముందు మీరు ఆరోపణలు నిరూపించాలి. అందుకు సాక్ష్యాలు చూపించాలి. మీరు రుజువు చేస్తే నేను వెంటనే రాజీనామా చేస్తా'' అని ఆమె అన్నారు. శారదా స్కాం మూలాలు లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వంలో ఉన్నాయని మమత ఆరోపించారు. తాము ఆ స్కాంకు బాధ్యుడైన వ్యక్తిని అరెస్టు చేశామని, జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయించామని అన్నారు. ఐదు లక్షల మందికి డబ్బులు కూడా వెనక్కి ఇచ్చినట్లు తెలిపారు. అసలు తమమీద ఆరోపణలు చేయడం పూర్తిగా తప్పని చెప్పారు. అయితే.. జాతీయస్థాయిలో లౌకిక వాదాన్ని కాపాడేందుకు అవసరమైతే తమ పార్టీ వామపక్షాలతో చేతులు కలిపే అవకాశం ఉందని కూడా మమతా బెనర్జీ అన్నారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు అవసరమైతే కలిసి వెళ్తామని చెప్పారు. అయితే ఇది కేవలం జాతీయస్థాయిలో ఉంటుందే తప్ప బెంగాల్లో మాత్రం కాదని స్పష్టం చేశారు. బెంగాల్లో వామపక్షాల కథ ముగిసిపోయిందని, వాళ్ల భావజాలం.. తమ భావజాలం పూర్తిగా వేరని అన్నారు. లౌకిక వాద కూటమిని ఏర్పాటుచేసేందుకు ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి బీజేపీని ఓడించాల్సినది కాంగ్రెస్ పార్టీయేనని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పేరు ప్రస్తావించకుండానే ఆయన స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. మోదీ చెబుతున్న స్వచ్ఛభారత్ పాత కార్యక్రమమేనని అన్నారు. -
అసలు దోషులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు: కునాల్
కోల్‌కతా: ‘శారదా స్కామ్‌లో అసలు దోషులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు.. వారిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు. వారిని వెంటనే అరెస్టు చేయాలి’ అని తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ కునాల్ ఘోష్ డిమాండ్ చేశారు. ఈ స్కామ్‌లో అరెస్టయి జైల్లో ఉన్న ఆయన శుక్రవారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చికిత్స అనంతరం.. వైద్య పరీక్షల నిమిత్తం శనివారం ఆయన్ను ‘బంగూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరాలజీ’కి తరలించారు. ఈ సందర్భంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయనపైవిధంగా స్పందించారు. -
శారద స్కాంలో టీఎంసీ మాజీ నేత అరెస్ట్
కొల్కత్తా: శారద చిట్ స్కాం కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మాజీ నాయకుడు అసీఫ్ ఖాన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. శుక్రవారం ఉదయం ఖాన్‌ను కొల్‌కత్తాలో బిదాన్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు. శారద చిట్ స్కాం కేసులో టీఎంసీకి చెందిన బడా నాయకుల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకు సంబంధించిన సమగ్ర సమాచారం అసీఫ్ ఖాన్‌కు తెలిసి ఉండవచ్చని సీబీఐ భావిస్తుంది. ఆ క్రమంలో అసీఫ్ ఖాన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. గతంలో కూడా ఈ కేసులో అసీఫ్ ఖాన్‌ను సీబీఐ పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. అయితే శారద స్కాంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్ర ఉందంటూ మీడియా కథనాలపై ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం ఓ సభలో ఘాటుగా స్పందించారు. ఓ మీడియా వర్గం తమ పార్టీ వారిని దొంగలుగా చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. చిట్ ఫండ్ కంపెనీల నుంచి తమ పార్టీ నాయకులు ఎవరు ఒక్కపైసా కూడా తీసుకోలేదని మమతా స్పష్టం చేశారు. -
‘శారదా’స్కాంలో బీజేడీ ఎంపీ హన్స్దా అరెస్ట్
భువనేశ్వర్: ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ స్కాంలో బీజేడీ ఎంపీ రామచంద్ర హన్స్దా, అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుబర్న నాయక్‌తో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే హితేష్ కుమార్ బగర్తిలను మంగళవారం సీబీఐ ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది. వీరిపై మోసం, నిధుల మళ్లింపు, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలు మోపింది. ఈ ముగ్గురు ‘నాబాదీగంట క్యాపిటల్ సర్వీసెస్’ అనే పొంజి (మోసపూరిత) కంపెనీకి గతంలో డెరైక్టర్లుగా పని చేసినట్లు సీబీఐ వెల్లడించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ అధికార బీజేడీపై విమర్శలు దిగాయి. నేరస్థులను రక్షించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించాయి. అయితే, ఈ స్కాంలో తమ ప్రభుత్వానికి ప్రమేయం లేదని సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. తాజా అరెస్ట్‌ల నేపథ్యంలో ఎంపీ హన్స్దా, ఎమ్మెల్యే సుబర్ననాయక్లను బీజేడీ నుంచి సస్పెండ్ చేస్తూ నవీన్ నిర్ణయం తీసుకున్నారు. -
శారద స్కామ్‌లో రూ. 60 కోట్ల ఆస్తులు అటాచ్!
న్యూఢిల్లీ: శారద చిట్ ఫండ్ స్కామ్ కేసులో భాగంగా బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సుమారు 60 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్మెంట్ చేసింది. ఇందులో పశ్చిమబెంగాల్లోని లింకన్ హైస్కూలు, లాండ్మార్క్ సిమెంట్ పరిశ్రమ, పలు ఫ్లాట్లు, రిసార్ట్లు ఉన్నట్టు తెలిసింది. శారదా గ్రూప్ చిట్‌ఫండ్ కంపెనీ చైర్మన్ సుదిప్తా సేన్, అతని బినామీ ఆస్తులను అటాచ్ చేశారు. మరోవైపు ఈ స్కామ్‌కు సంబంధించి ముంబైలో సెబీకి చెందిన పలువురు సీనియర్ అధికారులను సీబీఐ బుధవారం ప్రశ్నించింది. ** -
'శారదా' కుంభకోణంలో తొలి చార్జిషీట్
కోల్ కతా: వేలాది రూపాయల శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు చార్జీషీట్ సమర్పించింది. సుదీప్తసేన్, ఆయన సన్నిహితుడు దేబజాని ముఖర్జీ, బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కునాల్ ఘోష్ పేర్లు చార్జీషీట్ లో ఉన్నాయి. నాలుగు శారదా గ్రూపు సంస్థలు, స్ట్రటజీ మీడియాపై అభియోగాలు మోపారు. భారత శిక్షా స్మృతిలోని 120బీ, 409, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. శారదా కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత 2013 ఏప్రిల్ లో జమ్మూకాశ్మీర్ లో సేన్, ముఖర్జీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
శారద స్కాం: ఎంపీని ప్రశ్నించిన సీబీఐ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో కోట్లాది రూపాయల శారద చిట్‌ఫండ్ స్కాంలో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. బుధవారం తృణమాల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సువేందు అధాకారిని ప్రశ్నించారు. సీబీఐ అధికారులు దాదాపు గంటసేపు ఆయనను ప్రశ్నించారు. అనంతరం అధికారి మాట్లాడుతూ.. 'సాక్షిగా నన్ను విచారించారు. నాకు తెలిసిన విషయాలను వారికి చెప్పా' అని అన్నారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని తమ్లుక్ నియోజకవర్గం నుంచి ఆయన పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీబీఐ ఈ కేసులో పలువురు ఎంపీలతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఇటీవల ప్రశ్నించారు. -
శారద స్కాం కేసులో పశ్చిమబెంగాల్ మాజీ డీజీపీ అరెస్ట్
న్యూఢిల్లీ: శారద చిట్ ఫండ్ కుంభకోణం కేసులో సీబీఐ పశ్చిమబెంగాల్ మాజీ డీజీపీ రజత్ మజుందర్‌ను అరెస్ట్ చేసింది. డీజీపీగా పదవీవిరమణ చేసిన అనంతరం మజుందర్ శారద చిట్ ఫండ్ కంపెనీకి భద్రత సలహాదారుగా పనిచేశారు. కోట్లాది రూపాయిల కుంభకోణం కేసులో ఆయనపై మోసం, కుట్రపూరిత కేసులు నమోదయ్యాయి. గత నెలలో మజుందర్‌ను రెండు సార్లు విచారించిన సీబీఐ అధికారులు పలు పత్రాలు సీజ్ చేశారు. -
కొట్టేసిన సొమ్ముతో బ్యాంక్ లైసెన్స్ కు యత్నం!
న్యూఢిల్లీ: ‘శారద కుంభకోణం’లో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే శారదా గ్రూప్ అధినేత సుదీప్తసేన్ ను విచారిస్తున్నఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ)కి మరిన్ని ఆధారాలు లభించాయి. వివిధ రకాల పథకాల పేరుతో ఇన్వెస్టర్లను వేలాది కోట్ల రూపాయల మేర మోసగించిన సుదీప్తసేన్... బ్యాంక్ లైసెన్స్ కూడా సంపాదించడానికి ప్రయత్నించాడట. ఇందుకు తగిన ప్రణాళిక కూడా రచించుకుని అందుకు అనుగుణంగానే పావులు కదిపినట్లు తాజా సోదాల్లో బయటపడింది. ఇందుకు మూలధనంగా ఇన్వెస్టర్ల నుంచి కొల్లగొట్టిన నిధుల్లోంచి రూ.1,000 వెయ్యి కోట్లకు పైగా వినియోగించాలని సుధీప్తసేన్ నిర్ణయించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. అయితే, గతేడాది ప్రారంభంలో స్కామ్ వెలుగు చూడడంతో బ్యాంక్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవడం ఆగిపోయిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు.2013 ఫిబ్రవరిలో కొత్త బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించిన విధివిధినాలను ఆర్బీఐ సూచించడంతో అతని లైసెన్స్ కు గండిపడింది. ఇదిలా ఉండగా శారదా స్కాంకు సంబంధించి పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ఆపార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ పాత్ర ఉందని ఆయన విమర్శించారు. -
శారదా స్కామ్ లో మమతాను విచారించాలి: అమిత్
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ఆపార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక కోల్ కతాలో నిర్వహించిన తొలి సభలో అమిత్ షా మాట్లాడుతూ...మమతా బెనర్జీ ప్రభుత్వం వైఫల్యాలపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. మమతా పాలనలో పశ్చిమ బెంగాల్ సమస్యల్లో కూరుకుపోయింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబాటుదారులు ఎక్కువై పోయారు అని అమిత్ అన్నారు. నందిగ్రామ్, సింగూర్ లో భూములు కోల్పోయిన రైతుల కోసం దీక్ష చేపట్టిన మమతా.. శారద కుంభకోణంలో 17 లక్షల మంది రోడ్డున బాధితుల కోసం ఆమె ఎందుకు దీక్ష చేపట్టడం లేదని ఆయన విమర్శించారు. ఈ కుంభకోణంలో సన్నిహితులే ఉండటం కారణంగా మమతా మౌనం వహిస్తోందని అమిత్ షా ఆరోపించారు. తృణమూల్ పార్టీ నుంచి బహిషృతుడైన ఎంపీ కునాల్ ఘోష్ ను తిరిగి కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శారదా మీడియా ద్వారా లబ్ది పొందిన మమతా బెనర్జీని, ఈ కుంభకోణంలో కీలక పాత్రధారి సుదీప్తా సేన్ ను కూడా ఈ కేసులో విచారించాలని అమిత్ షా డిమాండ్ చేశారు. కునాల్ ఘోష్ నేతృత్వంలోనే శారదా మీడియా నడుస్తోంది. -
‘శారద స్కాం’లో మమత!
న్యూఢిల్లీ: ‘శారద కుంభకోణం’లో సీబీఐ దర్యాప్తు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వరకు వచ్చేలా కనిపిస్తోంది. ఆమె రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్సీటీసీతో శారద సంస్థ కుదుర్చుకున్న ఒప్పందంపై సీబీఐ దృష్టి సారిస్తోంది. రైల్వే మంత్రిగా మమత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘భారత్ తీర్థ’ ప్రాజెక్టుకు సంబంధించి టూర్ ప్యాకేజ్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలో శారద ఒకటి కావడంతో.. సీబీఐ కూపీ లాగుతోంది. దేశంలోని 10 పుణ్యక్షేత్రాలకు తక్కువ ధరలో ఆహార, వసతి సౌకర్యాలు కల్పిస్తూ 16 రైలు సర్వీసులను ఆ ప్రాజెక్టులో భాగంగా ప్రారంభించారు. -
నటి అపర్ణాసేన్ను ప్రశ్నించిన ఈడీ
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన పది వేల కోట్ల శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో ప్రముఖ బెంగాలీ నటి, దర్శకురాలు అపర్ణాసేన్, పశ్చిమ బెంగాల్ టెక్స్టైల్ మంత్రి శ్యామపాద ముఖర్జీని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ప్రశ్నించారు. శారదా గ్రూపు ఆధ్వర్యంలో నడిచిన పత్రికకు అపర్ణాసేన్ ఎడిటర్‌గా వ్యవహరించిన నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అపర్ణాసేన్ వెంట ఆమె భర్త కళ్యాణ్ రాయ్ కూడా ఉన్నారు. తమ ప్రశ్నలన్నిటికీ అపర్ణాసేన్ సమాధానం ఇచ్చారని, కేసు విచారణలో అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారని అధికారులు వెల్లడించారు. అలాగే 2009లో ఓ స్థిరాస్తి అమ్మకానికి సంబంధించి మంత్రి ముఖర్జీని ఈడీ అధికారులు ప్రశ్నించారు.