కేంద్ర మాజీ మంత్రి అరెస్ట్
శారద కేసులో మాతంగ్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ
కోల్‌కతా: శారదా చిట్ ఫండ్ స్కామ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ ఎంపీ మాతంగ్ సిన్హ్‌ను సీబీఐ శనివారం అరెస్ట్ చేసింది. సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆయనను ఇక్కడి తమ కార్యాలయానికి విచారణ కోసం పిలిచించి అదుపులోకి తీసుకుంది. అరెస్టుకు ముందు ఏడు గంటలపాటు విచారించారు. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి ఒకరు అరెస్ట్ కావడం ఇదే తొలిసారి. దర్యాప్తు బృందానికి ఆయన సహకరించకపోవడడంతో అరెస్టు చేసినట్లు సీబీఐ వర్గాలు చెప్పాయి. సిన్హ్‌పై నేరపూరిత కుట్ర, మోసం, శారదా రియాల్టీకి సంబంధించి నిధుల దుర్వినియోగం తదితర అభియోగాలు మోపారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి సాయపడినట్లుగా భావిస్తున్న హోం శాఖలోని సీనియర్ అధికారితో సిన్హ్‌కు సంబంధంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
పీవీ నరసింహారావు ప్రభుత్వంలో హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన సిన్హ్‌కు ఉన్నతాధికారులతో సంబంధాలుండేవని, వారి పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని సీబీఐ వర్గాలు తెలిపాయి. హోం శాఖలోని ఓ సీనియర్ అధికారి పేరు వాడుకుని పనులు పూర్తి చేయించుకుంటున్నారన్నాయి. సిన్హ్ అరెస్ట్‌తో స్కాంలో ఆ అధికారి పాత్ర ఉందో లేదో నిగ్గు తేలుతుందని పేర్కొన్నాయి. కాగా, ఎం-త్రీ చానల్ ఏర్పాటు కోసం కెనరా బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 67 కోట్ల రుణాన్ని చెల్లించనందుకు సిన్హ్‌పై 2013లో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఆయనపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం.