'బెయిల్ రాగానే.. ఆస్పత్రి వదిలేసిన మంత్రి'
కోల్కతా: దేశంలో సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ శారద కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మంత్రి మదన్ మిత్రకు బెయిల్ వచ్చిన మరసటి రోజే ఆస్పత్రి వదిలేశారు. ఆయన ప్రత్యేక అంబులెన్స్లో తన నివాసం చేరారు. శారదా కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు గత ఏడాది డిసెంబర్ 12న అరెస్టు చేసింది. అయితే సీబీఐ కస్టడీలో ఉండగానే ఆరోగ్యపరంగా అసంతృప్తిగా ఉందంటూ ఫిర్యాదు చేసి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నారు.
వీవీఐపీలకు ప్రత్యేక చికిత్సనందించే విభాగంలో గడుపుతూ వచ్చారు. డిసెంబర్ 19న ఆయనను సీబీఐ కస్టడీకి తీసుకోగా ఇప్పటి వరకు కేవలం 50 రోజులు మాత్రమే జైలులో గడిపిన ఆయన మిగితా రోజులన్నీ ఆస్పత్రిలోనే ఉంటూ బెయిల్ పిటిషన్లు పెట్టుకుంటూ వచ్చారు. కోర్టు ఆ పిటిషన్లు తిరస్కరించడం ఆయన అదే ఆస్పత్రిలోనే ఉండిపోవడం కొన్ని నెలలుగా జరుగుతూ వస్తుంది. ఆస్పత్రి వైద్యులు కూడా ఆయన చాలా బలహీనంగా ఉన్నారని ఈ సమయంలో జైలులో ఉంచడం మంచిదికాదని చెప్తూ వచ్చారు.
కానీ, ఆయనకు బెయిల్ వచ్చి 24 గంటలు గడిచిందో లేదో ఒక్క క్షణం కూడా ఆస్పత్రిలో ఉండకుండా వెంటనే ఇంటి బాట పట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది. వైద్యులు ప్రభుత్వం కుమ్మక్కై ఇన్ని రోజులు ఈ తతంగం నడిపారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆయనకు ఆస్పత్రిలో సకల భోగాలు ఏర్పాటుచేశారని కూడా ఇటీవల విమర్శలు భారీ స్ధాయిలో వచ్చాయి. ఇదిలా ఉండగా, చివరికి సత్యమే గెలిచిందని, అందుకే తమ నేత విడుదలై తమ ముందుకు వచ్చారంటూ మిత్రా మద్దతు దారులు ఆయన నివాసం వద్ద గట్టి నినాదాలు చేశారు. పటాలసులతో నానా హంగామా చేశారు. ఈ సందర్భంగా మీడియాను మిత్రాను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఇప్పుడు ఏది మాట్లాడటానికి సమయం కాదంటూ ఆయన ఇంట్లోకి వెళ్లిపోయారు.