కొట్టేసిన సొమ్ముతో బ్యాంక్ లైసెన్స్ కు యత్నం!
న్యూఢిల్లీ: ‘శారద కుంభకోణం’లో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే శారదా గ్రూప్ అధినేత సుదీప్తసేన్ ను విచారిస్తున్నఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ)కి మరిన్ని ఆధారాలు లభించాయి. వివిధ రకాల పథకాల పేరుతో ఇన్వెస్టర్లను వేలాది కోట్ల రూపాయల మేర మోసగించిన సుదీప్తసేన్... బ్యాంక్ లైసెన్స్ కూడా సంపాదించడానికి ప్రయత్నించాడట. ఇందుకు తగిన ప్రణాళిక కూడా రచించుకుని అందుకు అనుగుణంగానే పావులు కదిపినట్లు తాజా సోదాల్లో బయటపడింది. ఇందుకు మూలధనంగా ఇన్వెస్టర్ల నుంచి కొల్లగొట్టిన నిధుల్లోంచి రూ.1,000 వెయ్యి కోట్లకు పైగా వినియోగించాలని సుధీప్తసేన్ నిర్ణయించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది.
అయితే, గతేడాది ప్రారంభంలో స్కామ్ వెలుగు చూడడంతో బ్యాంక్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవడం ఆగిపోయిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు.2013 ఫిబ్రవరిలో కొత్త బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించిన విధివిధినాలను ఆర్బీఐ సూచించడంతో అతని లైసెన్స్ కు గండిపడింది. ఇదిలా ఉండగా శారదా స్కాంకు సంబంధించి పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ఆపార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ పాత్ర ఉందని ఆయన విమర్శించారు.