ఆ ముఖ్యమంత్రికి బీజేపీ ఫోబియా పట్టుకుంది!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ ఫోబియా (భయం) పట్టుకుందని, అందుకే ప్రతిదాని వెనుక బీజేపీ హస్తమున్నట్టు ఆమెకు కనిపిస్తున్నదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. బెంగాల్‌లో బీజేపీ బాగా పుంజుకున్నదని, అందుకే తమ పార్టీపై నిత్యం మమత విమర్శలు చేస్తున్నారని చెప్పారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెంగాల్‌ను అభివృద్ధి చేయడంలో మమత సర్కారు పూర్తిగా విఫలమైందని, ఆమె హయాంలో అభివృద్ధికి బదులు హింసాత్మక రాజకీయాలు, అవినీతి పెరిగిపోయాయని ధ్వజమెత్తారు.
తృణమూల్ కాంగ్రెస్ సర్కారు అవినీతికి శారద కుంభకోణం, నారద స్టింగ్ ఆపరేషన్‌లే నిదర్శమని మండిపడ్డారు. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన విమర్శలు సంధించారు. 'నా తర్వాత బీజేపీ అధ్యక్ష పదవిని ఎవరైనా చేపట్టవచ్చు. కానీ సోనియాగాంధీ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో అందరికీ తెలిసిందే' అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీలో గాంధీ-నెహ్రూ కుటుంబానిదే ఆధిపత్యమని విమర్శించారు.