‘కాస్కోండి.. ఢిల్లీ మాదే.. చాలెంజ్’
కోల్‌కతా: బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతి సవాల్ విసిరారు. బీజేపీ విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, ఢిల్లీని త్వరలోనే తమ పార్టీ ఖాతాలో వేసుకుంటామంటూ ప్రతినభూనారు. తమ పార్టీని భయపెట్టాలని అనుకుంటుందని, అలాంటిది ఎప్పటికి జరగదని అన్నారు. బీజేపీని చూస్తే తనకేం భయం కావడం లేదని, మా పార్టీని జైలులో పెడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బెదిరించినంత మాత్రానా బెదిరిపోమని చెప్పారు. ఢిల్లీ పీఠాన్ని స్వాధీనం చేసుకోవడం ఖాయం అని అన్నారు.
2019నాటి ఎన్నికల సమయానికి టీఎంసీని కూకటి వేళ్లతో పెకలించాలని బెంగాల్ బీజేపీకి ఆదేశించారు. ఆ క్రమంలోనే టీఎంసీ మొత్తాన్ని జైలులో పెట్టే రోజుంటుందని వ్యాఖ్యానించారు. ఇందుకు ధీటుగా మమత శుక్రవారం అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ‘తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే మీకు తెలుసు.. రానున్న రోజుల్లో టీఎంసీ ఢిల్లీని సొంతం చేసుకుంటుందని.. నన్ను ఎవరు చాలెంజ్ చేశారో వారి సవాల్‌ను స్వీకరిస్తున్నాను’ అని మమత చెప్పారు. ఢిల్లీ నుంచి వస్తున్నారు. అబద్ధాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బెంగాల్‌ను స్వాధీనం చేసుకోవాలన్న తొందరలో ఉన్నారు. గుజరాత్‌ను ఏలలేని వాళ్లు ఇప్పుడు బెంగాల్ కోసం వస్తున్నారు’ అంటూ ఆమె తీవ్రంగా మండిపడ్డారు.