కొల్కత్తా: శారద చిట్ స్కాం కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మాజీ నాయకుడు అసీఫ్ ఖాన్ను సీబీఐ అరెస్ట్ చేసింది. శుక్రవారం ఉదయం ఖాన్ను కొల్కత్తాలో బిదాన్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని పోలీసు స్టేషన్కు తరలించారు. శారద చిట్ స్కాం కేసులో టీఎంసీకి చెందిన బడా నాయకుల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకు సంబంధించిన సమగ్ర సమాచారం అసీఫ్ ఖాన్కు తెలిసి ఉండవచ్చని సీబీఐ భావిస్తుంది. ఆ క్రమంలో అసీఫ్ ఖాన్ను సీబీఐ అరెస్ట్ చేసింది. గతంలో కూడా ఈ కేసులో అసీఫ్ ఖాన్ను సీబీఐ పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే.
అయితే శారద స్కాంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్ర ఉందంటూ మీడియా కథనాలపై ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం ఓ సభలో ఘాటుగా స్పందించారు. ఓ మీడియా వర్గం తమ పార్టీ వారిని దొంగలుగా చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. చిట్ ఫండ్ కంపెనీల నుంచి తమ పార్టీ నాయకులు ఎవరు ఒక్కపైసా కూడా తీసుకోలేదని మమతా స్పష్టం చేశారు.