పశ్చిమ బెంగాల్‌లో వేగంగా మారుతున్న రాజ కీయ పరిణామాలు వివిధ రంగుల్ని సంతరించుకుంటున్నాయి. మమత రానున్న ఎన్నికల్లో మోదీ వ్యతిరేక కూటమి నాయకురాలిగా నిలిచే భావనలో ఉన్నారు కాబట్టి ప్రతీ విషయాన్నీ కేంద్ర రాష్ట్ర సంబంధాల అంశంగా మలిచే పనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం సీబీఐ నేపథ్యంగా సాగుతున్న పోరాటం సమంజసమైనది కాదు. ఎందుకంటే సీబీఐ తనిఖీ చెయ్యాలనుకొన్నది ఒక పెద్ద కుంభకోణంకి సంబంధించిన వ్యవహా రంలో. వేల కోట్ల రూపాయల మేరకు ప్రజలకు టోపీ పెట్టి తప్పించుకు తిరుగుతున్న పెద్ద తలకాయలపై 2013 నుంచీ ఉన్న కేసు ఇది.
శారదా కుంభకోణం కానీ, రోజ్ వ్యాలీ కుంభకోణం కానీ లక్షలాది పేదల సొమ్ము పోంజీ స్కీమ్ ద్వారా సేకరించి, మనీ లాండరింగు లాంటి తీవ్ర నేరాలతో ముడిపడిన స్కాం వ్యవహారం. ఈ కేసును రాష్ట్ర పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని గ్రహించి సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చెయ్యడానికి సిద్ధపడిన అధికారి గతంలో ఈ కుంభకోణంపై దర్యాప్తు చేసి ఉన్న రాష్ట్ర అధికారి. సీబీఐ గొప్పదేమీ కాకపోవచ్చు. కానీ ఈ వేలకోట్ల అవినీతి కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తుని జరగనివ్వాలి. కేంద్రాన్ని బోనులో నిలబెట్టడానికి మంచి అవకాశంగా భావించి దర్యాప్తుని అడ్డుకొంటే అది ప్రజల పట్ల బాధ్యతారాహిత్యమే. పోరాడటానికి సవాలక్ష రాజకీయ ఆయుధాలున్నాయి. ఇది మాత్రం కాదు.
-డా డీవీజీ శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం
Published Wed, Feb 6 2019 1:22 AM | Last Updated on Wed, Feb 6 2019 1:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment