ఏకంగా మూడు రాష్ట్రాల్లో లక్షలాదిమంది పేద, మధ్యతరగతి ప్రజలను ఘోరంగా మోసం చేసిన శారదా స్కాంలో దర్యాప్తును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీక్షకు దిగడం విడ్డూరం. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వచ్చారు. అయినా వారికి అడ్డుపడి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. ఆదాయపన్ను అధికారులకు రక్షణ కల్పించవలసిన పోలీసుల సహాయాన్ని ఉపసంహరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులు ఎగవేసే బడా వ్యాపారులకు కొమ్ము కాసింది. మమత, చంద్రబాబులు తమనూ, తమ వారినీ రక్షించుకునేందుకు వ్యవస్థల రక్షకులం అనే ముసుగులు ధరిస్తారు.
గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అజోయ్ ముఖర్జీ తన రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పోవడం పట్ల నిరసనగా ఒక రోజు సత్యాగ్రహం చేశాడట. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆయన రెండుసార్లు ముఖ్య మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ వీడి బాంగ్ల కాంగ్రెస్ స్థాపించాక ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో బాంగ్ల కాంగ్రెస్‌తో బాటు మార్క్సిస్ట్ పార్టీ కూడా భాగ స్వామి. ఆ ప్రభుత్వంలో సీపీఎం నాయకుడు జ్యోతిబసు హోంమంత్రి. తన ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపడానికి ఆనాడు అజోయ్ ముఖర్జీ సత్యా గ్రహం చేస్తే, ఇన్నేళ్ళకు తన ప్రభుత్వాన్ని రక్షించుకోవడం కోసం ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన దీక్ష చేపట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవరయినా పడ గొట్టే ప్రయత్నం చేస్తుంటే , దాన్ని అడ్డుకునే పరిస్థితి లేక నిస్సహాయతకు గురయితే నిరసనకు దిగాలి. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం ఏదీ జరుగుతున్న దాఖలాలు లేవు. ఏకంగా మూడు రాష్ట్రాల్లో లక్షలాదిమంది పేద, మధ్యతరగతి ప్రజలను ఘోరంగా మోసం చేసిన ఒక సంస్థ వ్యవహారంలో దర్యాప్తు ముందుకు సాగ కుండా అడ్డుకునేందుకు మమతా బెనర్జీ ఈ దీక్ష చేశారు.
శారదా స్కాంలో పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నాయకుల హస్తం ఉన్నదన్న ఆరోపణల మీద అరెస్ట్‌లు కూడా జరిగాయి గతంలో. ఈ కుంభకోణాలపైన దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సీబీఐ అధికారులు కోల్‌కతా నగర పోలీసు కమిషనర్‌ను విచా రించడానికి వెళితే, స్థానిక పోలీసులు ఎదురు తిరిగి వారిని అడ్డుకోవడమే కాదు ఏకంగా ముఖ్యమంత్రి బయలుదేరి ఆ పోలీసు కమిషనర్ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి సీబీఐ చర్యకు నిరసనగా తాను ధర్నాకు పూనుకున్నారు. ఇంతకంటే విడ్డూరం బహుశా ఇంకోటి ఉండదేమో. ఒక అధికారి మీద ఆరోపణలు వస్తే దాని మీద విచారణకు అంతకంటే పైస్థాయి సంస్థ దర్యాప్తు చేస్తుంటే చట్టాన్ని తన పని తాను చేసుకుపోనివ్వవలసిన ముఖ్యమంత్రే అడ్డుపడటం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగడం అజోయ్ ముఖర్జీ కాలానికీ, మమతా బెనర్జీ కాలానికీ మారిపోయిన రాజకీయ విలువలకు–మారిపోయిన అనడం కంటే దిగజారిపోయిన అంటే బాగుంటుంది–అద్దం పడుతున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రాల్లో కేసులు దర్యాప్తు చెయ్యాలంటే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సిందే, అందులో ఎటువంటి వివాదమూ లేదు. అయితే కోర్టులు ఆదేశించినప్పుడు ఆ నిబంధన వర్తించదు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక అనుమతి అప్పుడు అవసరం ఉండదు. ఇక్కడ మొన్న కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు సుప్రీం కోర్టు ఆదేశాలమేరకే వచ్చారు. అయినా మమతా బెనర్జీ ప్రభుత్వం వారికి అడ్డుపడి కోర్టు ధిక్కారానికి పాల్పడటమేకాక దీక్షలకు దిగడం విచిత్రం.
మళ్ళీ సుప్రీంకోర్టే కోల్‌కతా పోలీసు కమిషనర్ సీబీఐ అధికారుల ముందు హాజరై కేసు దర్యాప్తునకు సహకరించవలసిందేనని చెప్పాల్సి వచ్చింది. ఒక కేసు దర్యాప్తులో ఒక అధికారిని రక్షించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రే నడుం బిగించడం, అదీ కొన్ని లక్షల కుటుంబాలను నాశనం చేసిన ఒక దుర్మార్గమైన కేసులో కావడం వెనక ఉన్న ప్రయోజనం ఏమిటో సామాన్యులకు కూడా అర్థం అవు తుంది. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను విచారించడానికి సీబీఐ ఎంచుకున్న సమయం కేంద్ర ప్రభుత్వం మీద లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ మీద అనుమానాలకు తావు ఇస్తున్నది. రెండు మాసాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం, ఎన్‌డీఏకు ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రతిపక్ష ఫ్రంట్ ఒకటి ఏర్పడటం, ఆ ఫ్రంట్ గత వారమే కోల్‌కతాలో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించడం కూడా ఈ అనుమానాలకు ఊతం ఇస్తున్నది.
ఒకప్పుడు మమతా బెనర్జీ బీజేపీకి మిత్రురాలే. గతంలో ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామి కూడా. ఆమెలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న మొన్నటి దాకా ఎన్‌డీఏలో భాగస్వామే. బీజేపీకి మంచి మిత్రుడే. రాజకీయంగా తెగతెంపులు చేసుకున్నాక ఇటీవలే చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ ప్రవేశానికి అనుమతిని రద్దు చేసింది, చంద్రబాబు అడుగుజాడల్లో నడిచి మమతా బెనర్జీ బెంగాల్‌లో కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా సీబీఐ ప్రవేశించనే లేదు, ఆదాయ పన్ను అధికారులు కొన్ని వ్యాపార సంస్థల మీదా సంపన్నుల మీద దాడులు చేస్తేనే సహించలేని చంద్రబాబు ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరించిందో చూశాం. ఆదాయ పన్ను అధికారులకు రక్షణ కల్పించ వలసిన పోలీసుల సహాయాన్ని ఉపసంహరించుకుని ఏపీ ప్రభుత్వం పన్నులు ఎగవేసే బడా వ్యాపారులకు కొమ్ము కాసింది.
శారదా స్కాంలో నిందితులను రక్షించడానికి కంకణ బద్ధురాలైన మమతా బెనర్జీకి మద్దతు తెలపడానికి బాబు, కుమారుడు లోకేష్ హుటాహుటిన కలకత్తా వెళ్ళారు. పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించడానికి వీలులేదని మమతా బెనర్జీ సీబీఐని అడ్డుకుంటే, సుప్రీంకోర్టు అలా కుదరదని విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్తే–అందులో మమత విజయం చంద్రబాబుకు ఏం కనిపించిందో? అధికారంలో ఉన్నవారు చట్టబద్ధ వ్యవస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం మామూలైపోయిన మాట నిజం. ఇవ్వాళ బాబు, మమత ఏ కూటమిలో అయితే చేరారో అదే యూపీఏ అధికారంలో ఉండగా సుప్రీంకోర్టే సీబీఐ పంజరంలోని రామ చిలకగా మారిందని వ్యాఖ్యానించింది.
ఎవరు అధికారంలో ఉన్నా చట్టబద్ధ వ్యవస్థలను, రాజ్యాంగ సంస్థలను తమకు అనుకూలంగా, తమ వ్యతిరేకులను రాజకీయంగా వేధించడానికి ఉపయోగించుకోవడం సర్వ సాధారణం అయిపోయింది. దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు రావలసిందే తప్ప రాజకీయ పార్టీలు చేస్తామంటున్న, చేస్తున్న పోరాటాల్లో చిత్తశుద్ధి కనిపించదు. జాతిని రక్షిస్తాం, వ్యవస్థలను రక్షిస్తాం, అందుకే కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నానని చెపుతున్న చంద్రబాబు గతంలో ఇవే వ్యవస్థలను రాజకీయ వేధింపుల కోసం కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏను అడ్డగోలుగా వాడుకున్నప్పుడు తానూ భాగస్వామి అయిన విషయం ఇంకా ఎవరూ మరిచిపోలేదు.
ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకున్న శారదా స్కాం వంటిదే ఆంధ్రప్రదేశ్‌లో అగ్రి గోల్డ్ కుంభకోణం. ఇంకా అనేక ఆర్థిక అవకతవకలకు సంబంధించి తెలుగు దేశం ప్రభుత్వం, దాని అధినేత, ఆయన కుమారుడూ, మంత్రులూ, నాయకులూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బహుశా కేంద్ర సంస్థల కన్ను ఈ అక్రమాల మీద పడుతుందన్న అనుమానం కలిగిందేమో కొంత కాలంగా–ముఖ్యంగా బీజేపీతో తెగతెంపులు అయిన దగ్గరి నుండీ– బాబు ప్రజలను తనకు రక్షణగా ఉండాలని పదేపదే కోరుతున్నారు. నిన్నగాక మొన్న శాసన సభలో కూడా నన్ను జైలులో పెడతారా అని గొంతు చించుకుని మాట్లాడారు. ఏ తప్పూ జరగకపోతే జైలులో పెడతారేమో అన్న అనుమానం ఎందుకు కలుగుతున్నది ఏపీ ముఖ్యమంత్రికి? నిజానికి దీక్షలు చెయ్యడంలో మమతకి బాబే ఆదర్శం. నాలుగేళ్ళు ప్రత్యేక ప్యాకేజీ పాటపాడి, తప్పనిసరి పరిస్థితుల్లో మాట మార్చి ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నాక ఆయన రోజుకో దీక్ష చేస్తున్నారు. చిత్రం ఏమిటంటే ఆ దీక్షలన్నీ ప్రభుత్వ ఖర్చుతోనే.
అన్ని విషయాల్లో ప్రతిపక్ష పార్టీని కాపీ కొట్టినట్టుగానే మొన్న అసెంబ్లీలో కూడా నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపే కార్యక్రమం చేశారు. ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ శాసన సభలో నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపితే, శాసన సభను అపవిత్రం చేస్తారా అన్న చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అదే ప్రతిపక్షం నిరసనను కాపీ కొట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేసుకోనిచ్చే పరిస్థితులు ఇవాళ కనపడటం లేదు. దాన్ని ఆసరాగా తీసుకుని మమత, చంద్రబాబులు తమనూ, తమ వారినీ రక్షించుకునేం దుకు వ్యవస్థల రక్షకులం అనే ముసుగులు ధరిస్తారు. ఈ ముసుగులను తొలగించి వారివారి నిజ స్వరూపాలు బయటపెట్టే పని ప్రజలే చెయ్యాలి.
దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com
Comments
Please login to add a commentAdd a comment