అందుకే చంద్రబాబు, బీజేపీకి అనుకూలంగా పీకే పలుకులు
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో వికటించిన ప్రశాంత్ కిశోర్ జోస్యం
సాక్షి, అమరావతి: తాను ఏ రాజకీయ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదంటూ ప్రశాంత్ కిశోర్ (పీకే) వల్లె వేస్తున్న మాటల్లో వీసమెత్తు నిజం లేదని స్పష్టమైంది. ఏపీలో టీడీపీ–బీజేపీ కూటమికి పీకే ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్నట్లు పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. ఈమేరకు బుధవారం టీవీ 9 బంగ్లా చానెల్‌కు మమతా బెనర్జీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘పీకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–బీజేపీ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.
అందుకే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి అనుకూలంగా పీకే జోస్యం చెబుతున్నారు’ అని వెల్లడించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలను బట్టి పీకే చంద్రబాబు విసిరిన ప్యాకేజీ తీసుకుని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకనే టీడీపీ గెలిచే అవకాశం ఉందంటూ చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా జోస్యం చెబుతున్నట్లు తేలిపోయింది.
బాబు అరెస్టు తరువాత..
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అనంతరం భయపడి ఢిల్లీలో తలదాచుకున్న సమయంలో నారా లోకేష్ పీకేను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని వేడుకున్నారు. ఈక్రమంలో చంద్రబాబు బెయిల్‌పై విడుదలయ్యాక పీకేను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు అక్కడి నుంచి విజయవాడకు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్‌లో లోకేష్ తీసుకొచ్చారు. ఉండవల్లిలోని తమ అక్రమ నివాసంలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు తాను ఏ పార్టీకీ వ్యూహకర్తగా పని చేయడం లేదని పీకే చెప్పారు.
బిహార్‌లో కలసి రాకపోవడంతో..
బెంగాల్ ఎన్నికల తర్వాత 2021లో ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయనంటూ పీకే ప్రతినబూని ఐప్యాక్ నుంచి తప్పుకున్నారు. బిహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బిహార్ సీఎం నితీ‹Ùకుమార్ పంచన చేరి జేడీ(యూ) కీలక నేతగా చలామణి అయ్యారు. ఆపై నితీశ్‌తో విభేదించి సొంత పార్టీ స్థాపించి పాదయాత్ర చేసినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. దీంతో రాజకీయంగా బిహార్‌లో తన పప్పులు ఉడకవని గ్రహించిన పీకే డబ్బుల కోసం ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పేందుకు అలవాటుపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసుకుంటూ టీడీపీకి అవసరమైనప్పుడల్లా ఆ పార్టీకి అనుకూలంగా జోస్యం చెబుతూ వస్తున్నారు.
ఆ జోస్యాలన్నీ తప్పే..
అటు బిహార్‌లో రాజకీయంగా చెల్లక.. ఇటు ఇం‘ధనం’ లేక కొట్టుమిట్టాడిన పీకే తనకు ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యాలు చెప్పేందుకు అలవాటు పడ్డారు. గతేడాది చివరిలో తెలంగాణ, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభల ఎన్నికల్లోనూ పీకే జోస్యాలు చెప్పారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ గెలుస్తుందని పీకే చెబితే చివరకు అక్కడ కాంగ్రెస్ గెలిచింది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుస్తుందని పీకే ఢంకా భజాయిస్తే ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని, గత ఎన్నికల్లో టీడీపీ తరపున వకాల్తా తీసుకున్న లగడపాటి మాదిరిగానే ప్రశాంత్ కిశోర్ కూడా ఫలితాలు వెలువడ్డాక మాయం కావడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
బాబు సేవలో ‘పీకే’
ఏపీ రాజకీయాల్లో తలమునకలు
బెంగాల్ సీఎం మమత వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం లేదన్నారు. ఐప్యాక్ సంస్థకు చెందిన ప్రతీక్ జైన్, ఆయన బృందం తమకు వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.
ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తలమునకలై ఉన్నట్లు చెప్పారు. ఆయన టీడీపీ, బీజేపీల కోసం పనిచేస్తున్నారన్నారు. తాజాగా బెంగాల్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో మమతా ఈ విషయాలను వెల్లడించారు. పీకే బీజేపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టే ఎన్డీఏ కూటమి మళ్లీ విజయం సాధిస్తుందంటూ పదే పదే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ వెలుపల ఆయన ప్రభావం, ప్రమేయం పెద్దగా లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment