న్యూఢిల్లీ: ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి అధికార బీజేపీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ విమర్శించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీల నేతలకు, బీజేపీయేతర సీఎంలకు మంగళవారం మమత లేఖ రాశారు. ఈ లేఖలో విపక్ష పార్టీలన్నీ కలిసొచ్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ ప్రత్యక్ష దాడులు చేస్తోందని మమత ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు వెళ్లే మార్గం గురించి చర్చించడానికి కలిసొచ్చేవారంతా సమావేశమవ్వాలని మమత పిలుపునిచ్చారు. బీజేపీ అణచివేత పాలనపై ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
దేశంలో ఎక్కడైనా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ఏజెన్సీలు చర్యలకు దిగుతాయి అంటూ మమత విమర్శలు గుప్పించారు. ఈ దేశ సమాఖ్య నిర్మాణంపై దాడి చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులను అణచివేయాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఈ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయాలనే అధికార బీజేపీ దురుద్దేశాన్ని మనమందరం ప్రతిఘటించాలని మమత లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ సమావేశానికి ఎవరెవరు వెళ్తారనే దానిపై మాత్రం పొలిటికల్ సర్కిల్‌లో తీవ్ర చర్చ నడుస్తోంది.
చదవండి: (రాహుల్ గాంధీ తెలుగు ట్వీట్.. కల్వకుంట్ల కవిత కౌంటర్)
Comments
Please login to add a commentAdd a comment