‘శారదా’స్కాంలో బీజేడీ ఎంపీ హన్స్‌దా అరెస్ట్
భువనేశ్వర్: ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ స్కాంలో బీజేడీ ఎంపీ రామచంద్ర హన్స్‌దా, అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుబర్న నాయక్‌తో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే హితేష్ కుమార్ బగర్తిలను మంగళవారం సీబీఐ ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది. వీరిపై మోసం, నిధుల మళ్లింపు, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలు మోపింది. ఈ ముగ్గురు ‘నాబాదీగంట క్యాపిటల్ సర్వీసెస్’ అనే పొంజి (మోసపూరిత) కంపెనీకి గతంలో డెరైక్టర్లుగా పని చేసినట్లు సీబీఐ వెల్లడించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ అధికార బీజేడీపై విమర్శలు దిగాయి. నేరస్థులను రక్షించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించాయి.
అయితే, ఈ స్కాంలో తమ ప్రభుత్వానికి ప్రమేయం లేదని సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. తాజా అరెస్ట్‌ల నేపథ్యంలో ఎంపీ హన్స్‌దా, ఎమ్మెల్యే సుబర్ననాయక్‌లను బీజేడీ నుంచి సస్పెండ్ చేస్తూ నవీన్ నిర్ణయం తీసుకున్నారు.