నా పాత్ర రుజువైతే రాజీనామా చేస్తా: మమత
శారదా చిట్ఫండ్స్ స్కాంలో తన పాత్ర రుజువైతే తక్షనం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని పశ్చిమబెంగాల్ సీఎం, ఫైర్బ్రాండ్ నాయకురాలు మమతా బెనర్జీ అన్నారు. ఈ విషయంలో దాచాల్సినది ఏమీ లేదని చెప్పారు. శారదా గ్రూపుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయా అని ప్రశ్నించగా.. ''ఎవరన్నారు? ముందు మీరు ఆరోపణలు నిరూపించాలి. అందుకు సాక్ష్యాలు చూపించాలి. మీరు రుజువు చేస్తే నేను వెంటనే రాజీనామా చేస్తా'' అని ఆమె అన్నారు. శారదా స్కాం మూలాలు లెఫ్ట్ఫ్రంట్ ప్రభుత్వంలో ఉన్నాయని మమత ఆరోపించారు. తాము ఆ స్కాంకు బాధ్యుడైన వ్యక్తిని అరెస్టు చేశామని, జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయించామని అన్నారు. ఐదు లక్షల మందికి డబ్బులు కూడా వెనక్కి ఇచ్చినట్లు తెలిపారు. అసలు తమమీద ఆరోపణలు చేయడం పూర్తిగా తప్పని చెప్పారు.
అయితే.. జాతీయస్థాయిలో లౌకిక వాదాన్ని కాపాడేందుకు అవసరమైతే తమ పార్టీ వామపక్షాలతో చేతులు కలిపే అవకాశం ఉందని కూడా మమతా బెనర్జీ అన్నారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు అవసరమైతే కలిసి వెళ్తామని చెప్పారు. అయితే ఇది కేవలం జాతీయస్థాయిలో ఉంటుందే తప్ప బెంగాల్లో మాత్రం కాదని స్పష్టం చేశారు. బెంగాల్లో వామపక్షాల కథ ముగిసిపోయిందని, వాళ్ల భావజాలం.. తమ భావజాలం పూర్తిగా వేరని అన్నారు. లౌకిక వాద కూటమిని ఏర్పాటుచేసేందుకు ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి బీజేపీని ఓడించాల్సినది కాంగ్రెస్ పార్టీయేనని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పేరు ప్రస్తావించకుండానే ఆయన స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. మోదీ చెబుతున్న స్వచ్ఛభారత్ పాత కార్యక్రమమేనని అన్నారు.