కోల్‌కతాలో అరెస్ట్ తర్వాత మంత్రి మదన్‌మిత్రాను సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు. మీడియాతో మమతాబెనర్జీ
ప్రధాని మోదీకి ‘దీదీ’ సవాల్
శారదా స్కాంలో మంత్రి మిత్రాను సీబీఐ అరెస్టు చేయడంపై ఫైర్
కేంద్రానిది రాజకీయ కక్ష సాధింపేనని మమత ధ్వజం
కోల్‌కతా: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారు మధ్య చిచ్చురేపిన శారదా చిట్‌ఫండ్ కుంభకోణం వ్యవహారం రెండు ప్రభుత్వాల మధ్య మరింత అగాధాన్ని సృష్టించింది. ఈ స్కామ్‌లో ప్రమేయం ఆరోపణలపై ఇప్పటికే ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను అరెస్టు చేసిన సీబీఐ శుక్రవారం మమత నమ్మినబంటు, బెంగాల్ రవాణా మంత్రి మదన్ మిత్రాను శుక్రవారం కోల్‌కతాలో అరెస్టు చేసింది. శారదా రియాల్టీకి సంబంధించిన కేసులో నేరపూరిత కుట్ర, మోసం, నిధుల అవకతవకలు, శారదా గ్రూప్ నుంచి అయాచిత ఆర్థిక లబ్ధి పొందడం వంటి అభియోగాలపై ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలిపింది. అయితే సీబీఐ చర్యపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మిత్రా అరెస్టు కేంద్రం రాజకీయ కక్ష సాధింపు, నీతిమాలిన కుట్రలో భాగమని దుయ్యబట్టారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
మిత్రాను వైద్య పరీక్షల నిమిత్తం తరలించిన ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను కలుస్తానని...ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలకు దమ్ముంటే వారి వద్ద ఉన్న పోలీసు మార్బలాన్నంతా ఉపయోగించి తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. సీబీఐని పావుగా వాడుకుంటూ బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. దేశ లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర వ్యవస్థను కేంద్రం నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. ‘‘ఈ కేసులో మిత్రాను సాక్షిగా పిలిచిన సీబీఐ కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన్ను అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపు కాదా?’’ అని మమత కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అసెంబ్లీ స్పీకర్‌కు సమాచారం ఇవ్వకుండానే ఒక మంత్రిని (మిత్రా) సీబీఐ అరెస్టు చేయడం చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీజేపీ నిజస్వరూపాన్ని బయటపెడతామని...అఖిల భారత స్థాయిలో ఆ పార్టీతో పోరాడతామన్నారు. సీబీఐ అరెస్టు చేసి, అభియోగాలు మోపిన ఒక వ్యక్తి (అమిత్ షాను ఉద్దేశించి) తమ పార్టీపై వేలెత్తి చూపుతున్నారని చురకలంటించారు.
కేంద్రం తీరుకు నిరసనగా తమ పార్టీ శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనుందని చెప్పారు. ‘‘దేశంలో ఇందిరాగాంధీ హయాం నాటి ఎమర్జెన్సీ రోజులకన్నా ప్రస్తుత బీజేపీ పాలన అధ్వానంగా సాగుతోంది. మోదీ ప్రభుత్వం పిరికిపందలా, నియంతలా ప్రవర్తిస్తూ ప్రమాదకర ఆట ఆడుతోంది. కేంద్రంతో కొత్త యుద్ధం మొదలైంది. మీ (కేంద్రం) సవాల్‌ను స్వీకరిస్తున్నాం.’’ అని మమత పేర్కొన్నారు. మంత్రి పదవికి మిత్రా చేసిన రాజీనామాను తిరస్కరించినట్లు ‘దీదీ’ తెలిపారు. ఎన్నో మీడియా సంస్థలు చిట్‌ఫండ్‌ల కంపెనీల నుంచి ప్రకటనలు తీసుకున్నాయి. మరి వాటిపై చర్యలు తీసుకున్నారా? సహారా స్పాన్సర్‌షిప్‌తో క్రికెట్ ఆడిన సచిన్, సౌరవ్‌లు క్రిమినెల్స్ అవుతారా? ఎందరో సీపీఎం నేతలు చిట్‌ఫండ్ కంపెనీల యజమానులతో కనిపించారు. మరి వారిని మేం అరెస్టు చేయాలంటారా? అని మమత మీడియాను ఎదురు ప్రశ్నించారు. కేంద్ర ఆర్థికశాఖ ఆఫీసు సమీపంలో ఉన్న ఓ కంపెనీ వేల కోట్ల రూపాయల నిధులను గోల్‌మాల్ చేసిందన్నారు కాగా, అరెస్టుకు ముందు మిత్రాను సీబీఐ అధికారులు ఐదు గంటలపాటు ప్రశ్నించారు. శారదా గ్రూప్ చైర్మన్ సుదీప్తోసేన్‌కు న్యాయ సలహాదారుగా వ్యవహరించిన నరేష్ బలోదియాను సైతం నేరపూరిత కుట్ర అభియోగాల కింద అరెస్టు చేశారు. మిత్రాను శనివారం అలీపూర్ కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా శారదా స్కాంలో తృణమూల్ పాత్ర రోజురోజుకూ బలపడుతున్న నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ మమత సీఎం పదవికి రాజీనామా చేయాలని బెంగాల్ విపక్షాలు డిమాండ్ చేశాయి.