Saradha chit fund scam
-
విచారణకు కోల్‌కతా మాజీ చీఫ్ డుమ్మా
కోల్‌కతా: శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సోమవారం సీబీఐ ఎదుట విచారణకు గైర్హాజరయ్యారు. తాను మూడు రోజులపాటు సెలవులో ఉన్నానని, వ్యక్తిగత కారణాల వల్ల వారం రోజుల వరకు హాజరు కాలేనని రాజీవ్ కుమార్ సీబీఐకి రాసిన లేఖను.. ఓ సీఐడీ అధికారి ఇక్కడి సాల్ట్ లేక్‌లోని సీబీఐ కార్యాలయంలో అందజేశారు. పలుమార్లు రాజీ వ్‌కు కాల్ చేసినా ఆయన వైపు నుంచి స్పందన లేదని సీబీఐ అధికారి ఒకరు చెప్పారు. అయినా వెనక్కి తగ్గకుండా కోల్‌కతాలోని రాజీవ్ అధికారిక నివాసానికి సీబీఐ అధికారుల బృందం వెళ్లగా ఆయన నివాసంలో లేరు. శనివారం రాజీవ్ దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
శారదా చిట్‌ఫండ్ కేసులో కొత్త మలుపు
కోల్‌కతా : శారదా చిట్‌ఫండ్ కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక పత్రాలు మాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా మాజీ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ రాజీవ్‌కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. రాజీవ్ కుమార్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఆయన కస్టడీపై ఉన్న స్టేను ఎత్తివేస్తూ.. రాజీవ్‌కుమార్‌ను విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవేళ ఆయన విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి సూచించింది. దీంతో రాజీవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు సీబీఐ సన్నాహాలు చేపట్టింది. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం రాజీవ్ కుమార్ వారంలోపు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా గతంలో విచారణకు వచ్చిన సీబీఐని మమతా సర్కార్ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారన్న కారణంతో ఈ నెల 15న రాజీవ్ కుమార్‌ను ఆ రాష్ట్ర సీఐడీ డీజీ బాధ్యతల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తప్పించింది. దీంతో ఆయన నిన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో రిపోర్టు చేశారు. శారదా గ్రూప్ పేరుతో 200 ప్రయివేటు కంపెనీలు నడిపిన పొంజీ స్కీం దివాళా తీయడంతో కోటి 70 లక్షలమంది డిపాజిటర్ల బతుకులు రోడ్లమీద పడ్డ విషయం విదితమే. -
సీబీఐ తర్వాతి టార్గెట్ ఆయనే!
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో సీబీఐ తర్వాతి టార్గెట్ అభిషేక్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం ఈ మేరకు వ్యవహరించింది. దక్షిణ కోల్‌కతాలోని హరీశ్ ముఖర్జీ రోడ్డులో ఉన్న అభిషేక్ నివాసం ‘శాంతినికేతన్’ వద్ద భద్రతను పెంచింది. క్యూఆర్టీ దళం (క్విక్ రెస్పాన్స్ టీమ్), కానిస్టేబుల్స్ పాటు కనీసం ఆరుగురు అధికారులు ఎల్లప్పుడూ అభిషేక్ ఇంటి వద్ద గస్తీ కాస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు వెల్లడించారు. 30 అడుగుల ఎత్తులో రెండు పోలీసు పోస్ట్‌లను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సాయుధులతో కూడిన క్యూఆర్టీ బృందం నిరంతరం కాపలాగా ఉంటుందన్నారు. (శారదా మోసంలో ఎవరి వాటా ఎంత?) లోక్‌సభ ఎంపీ, తృణమూల్ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న అభిషేక్ నివాసం వద్ద ఇంత మంది పోలీసులను తాము ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. బారికేడ్లు, పోలీసుల వాహనాల కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై స్పందించేందుకు అభిషేక్ అందుబాటులో లేరు. తృణమూల్ నేతలు మీడియా ముఖంగా మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. ‘మా పార్టీపై ఒత్తిడి పెంచేందుకు అభిషేక్‌ను సీబీఐ టార్గెట్ చేసిందని అందరికీ తెలుసు. శారదా కుంభకోణంతో ఆయన పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. నారద స్టింగ్ ఆపరేషన్ దర్యాప్తులో సీబీఐ ఉద్దేశపూర్వకంగా తన ఎఫ్ఐఆర్ అభిషేక్ పేరు చేర్చింది. బీజేపీ ఆదేశానుసారమే ఇదంతా చేసింద’ని తృణమూల్ నాయకుడొకరు ఆరోపించారు. (కోల్‌కతాలో ‘దీదీ’గిరి!) నారద స్టింగ్ ఆపరేషన్ ఎఫ్ఐఆర్లో ఆరు చోట్ల అభిషేక్ పేరు ఉంది. ఇందులో 12 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు ఉండటంతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు వణుకుతున్నారు. శారదా స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీబీఐ అధికారులు శనివారం షిల్లాంగ్‌లో ప్రశ్నించారు. దాదాపు నాలుగు గంటల పాటు విచారణ కొనసాగింది. తమకు రాజీవ్ కుమార్ సహకరించలేదని సీబీఐ అధికారులు ఆరోపించారు. -
సీబీఐ ఎదుట కోల్‌కతా పోలీస్ బాస్
షిల్లాంగ్ : కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శారదా చిట్‌ఫండ్, రోజ్ వ్యాలీ కుంభకోణం కేసులో రాజీవ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్న సాయంత్రమే షిల్లాంగ్ చేరుకున్నారు. షిల్లాంగ్‌లోని సీబీఐ కార్యాలయంలో రాజీవ్ కుమార్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ శారదా చిట్‌ఫండ్ కేసులో రాజీవ్ కుమార్ నివాసంలో సోదాలకు వెళ్లిన సీబీఐ అధికారులను నిర్బంధించడం, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళనకు దిగిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు తమ దర్యాప్తుకు రాజీవ్ కుమార్ సహకరించడం లేదని సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో 1989 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ కుమార్ సీబీఐ విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కూడా. మరోవైపు శారదా కుంభకోణంతో సంబంధం ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కునాల్ ఘోష్‌ను కూడా ఆదివారం షిల్లాంగ్‌లో జరిగే విచారణకు హాజరు కానున్నారు. -
రేపు రాజీవ్‌కుమార్‌ను విచారించనున్న సీబీఐ
న్యూఢిల్లీ/కోల్‌కతా: శారదా చిట్‌ఫండ్ కేసులో కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను ఈ నెల 9వ తేదీన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో విచారించనున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆయనకు నోటీసులు పంపినట్లు తెలిపింది. ఇటీవల కోల్‌కతాలోని రాజీవ్‌కుమార్ నివాసంలో సోదాలకు వెళ్లిన సీబీఐ అధికారులను పోలీసులు నిర్బంధించడం, సీఎం మమతాబెనర్జీ ఆందోళనకు దిగడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. శారదా కుంభకోణంతో సంబంధమున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కునాల్ ఘోష్‌ను కూడా ఈ నెల 10వ తేదీన షిల్లాంగ్‌లో జరిగే విచారణకు హాజరు కావాలని సీబీఐ కోరింది. (శారదా మోసంలో ఎవరి వాటా ఎంత?) -
శారదా మోసంలో ఎవరి వాటా ఎంత?
అవినీతికి వ్యతిరేకమని చెప్పుకునే అధికార పార్టీ బీజేపీ శారదా మోసాల్లో తన పాత్రకు జవాబు చెప్పుకోవలసిన స్థితి ఏర్పడింది. శారదా గ్రూప్ పేరుతో 200 ప్రయివేటు కంపెనీలు నడిపిన పొంజీ స్కీం దివాళా తీయడంతో కోటి 70 లక్షలమంది డిపాజిటర్ల బతుకులు రోడ్లమీద పడ్డాయి. రెండు, మూడు వేల కోట్లకు పైగా పెట్టుబడులు సేకరించి ఈ గ్రూప్ జనాన్ని ముంచింది. 1920 కాలంలో చార్లెస్ పొంజీ అనే అతి తెలివైన మోసగాడు పెట్టుబడులు ఆకర్షించడానికి పెద్ద వడ్డీ ఆశ చూపడం, వచ్చిన డబ్బుతో పాత డిపాజిటర్లకు లాభాలు చూపి, కొత్త డిపాజిటర్లలో ఆశలు రేపడం, లాభాలు వస్తాయని నమ్మించడం, ఇంకా డిపాజిట్లు వసూలుచేసి చేతులు ఎత్తేసే మోసాలకు పాల్పడ టంతో వీటిని పొంజీ స్కీం అని పిలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఈ మోసం బయటపడగానే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ వేసింది. ఇదొక భీకర ఆర్థిక లావాదేవీల గందర గోళం. ఇందులో దర్యాప్తు చేయవలసింది కేవలం పోలీసు మాత్రమే కాదు, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సెబీ, ఆర్బీఐ వంటి కేంద్ర సంస్థలు కూడా. ఆర్థిక సేవలను, మౌలిక వనరుల యాజమాన్యం, ఆటోమొబైల్ రంగం, ఉత్పత్తి రంగాలలో సేవలందిస్తామని చెప్పుకుంటూ శారదా గ్రూప్ డిపాజిట్ల వసూలు కార్యక్రమం మొదలుపెట్టింది. సుదీప్తోసేన్ ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టరూ చైర్మన్ కూడా. సేన్‌తోపాటు మరో నిందితుడు దేబ్జానీ ముఖర్జీ పారిపోయారు. రాజీవ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటయిన ప్రత్యేక పరిశోధక బృందం వీరిద్దరినీ పట్టివేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్‌ను కూడా సిట్ అరెస్టు చేసింది. 2014లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, మమతా బెనర్జీ సన్నిహితులైన మదన్ మిత్రా, రజత్ మజుందార్లను సిట్ అరెస్టు చేసింది. అధికార పార్టీఎమ్మెల్యేను అరెస్టు చేసి సిట్ నిష్పాక్షికతను చాటింది. ఈ మోసం అస్సాం, త్రిపుర ఒడిశా రాష్ట్రాల ప్రజలను కూడా ముంచేసిన విషయం 2014లో సుప్రీంకోర్టు పరిశీలించి శారదా ఆర్థిక కుంభకోణాన్ని సీబీఐ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగిస్తున్న సిట్‌ను మొత్తం పత్రాలు సీబీఐకి అప్పగించాలని ఆదేశించారు. వారు అప్పగించారు కూడా. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని, ఆరోపిస్తూ శారదా గ్రూప్ సొంతదారులు టీ ఎంసీ ఎంపీ కునాల్ ఘోష్ తమను మోసం చేశారని ఫిర్యాదు చేస్తే 2013లో ఆయన్ను అరెస్టు చేశారు. కొన్ని గంటల్లోనే కునాల్ ఘోష్ ఈ కుంభకోణంలో ముకుల్ రాయ్తోసహా 12మంది ఉన్నారంటూ తీవ్ర ప్రత్యారోపణలు చేశారు. ముకుల్ రాయ్ ఇంటిపైన, ఆయన భార్య నడిపే న్యూస్ చానెల్‌పైన అప్పుడు సీబీఐ దాడులు జరిపింది. నవంబర్ 26, 2014న ఆయన్ను ప్రశ్నించింది. అరెస్టు కూడా చేసింది. అస్సాంలో తన వ్యాపారం సాగడానికి నెలకు 20 లక్షల రూపాయలను శారదా చైర్మన్ సుదీప్తోసేన్‌కు ఇచ్చినట్టు ముకుల్సేన్ మీద ఉన్న ఆరోపణ. అస్సాంలో రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, మీడియా బారన్లు తమ నుంచి డబ్బు వసూళ్లు చేసేవారని ముకుల్ రాయ్ ప్రత్యారోపణ చేశారు. వసూళ్లు చేసిన వారి పేర్లు కూడా ఆయన ఉత్తరంలో సీబీఐకి వెల్లడించారు. ముకుల్ రాయ్ తృణమూల్ వదిలి తమ పార్టీలో చేరాలని 2015 నుంచి బీజేపీ ముకుల్‌రాయ్‌తో సంప్రదింపులు మొదలు పెట్టింది. మమతా బెనర్జీకి ఆయన చాలా సన్నిహితుడు. ఆమె తరువాత స్థాయి నాయకుడని పేరు. నవంబర్ 3, 2017న చివరకు ఆయన బీజేపీలో చేరవలసి వచ్చిందో చేర్పించుకున్నారో మనం ఊహించవచ్చు. సుదీప్తో సేన్ డ్రైవర్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ముకుల్ రాయ్ చేసిన మహత్కార్యాలు ఎన్నో వెల్లడయ్యాయి. సుదీప్తోసేన్ కోల్‌కతా నుంచి పారిపోవడానికి ముకుల్ ఎంతో సాయం చేశారట. అస్సాం కాంగ్రెస్‌కు చెందిన మరో నాయకుడు హిమంత బిస్వాశర్మ కూడా ఫిరాయించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిద్దరు బీజేపీలో చేరిన తరువాత కేంద్ర ప్రభుత్వానికి ఈ కేసును విచారించడంలో అంత ఆసక్తి ఉన్నట్టు కనిపించలేదు. కేసు మూలన పడింది. హిమంత బిస్వాశర్మ బీజేపీలో చేరి శుద్ధి పొందినందునే చార్జిషీటులో నిందితుడు కాలేదని విమర్శిస్తే తప్పా? ప్రధాన నిందితుడైన సుదీప్తో సేన్ పారిపోవడానికి సహకరించిన ముకుల్ రాయ్‌ను సీబీఐ దర్యాప్తు జరుపుతున్న దశలో ఎందుకు చేర్చు కున్నట్టు? శారదా కుంభకోణానికి సహకరించినట్టు ఆరోపితులైన వారు బీజేపీలోచేరిన తరువాత సీబీఐ దర్యాప్తు ఎందుకు ఆలస్యమయింది? శారదా దర్యాప్తును ఆటంకపరిచింది తృణమూల్ ప్రభువులా, బీజేపీ చక్రవర్తులా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ -
నళినీ చిదంబరంపై చార్జ్‌షీట్
కోల్‌కతా : శారదా చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించి మనీల్యాండరింగ్ విచారణలో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం భార్య నళినీ చిదంబరంపై సీబీఐ శుక్రవారం చార్జ్‌షీట్ నమోదు చేసింది. కోల్‌కతాలోని బరాసత్ కోర్టులో దర్యాప్తు సంస్థ ఈ చార్జిషీట్‌ను సమర్పించింది. ఈ కుంభకోణంలో నళీనీ చిదంబరం రూ 1.4 కోట్లు ముడుపులు స్వీకరించారని సీబీఐ ఆరోపించింది. శారదా గ్రూప్ యజమాని, ప్రమోటర్ సుదీప్త సేన్‌తో కుమ్మక్కైన నళినీ చిదంబరం మోసపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ 2010 నుంచి 2014 మధ్య రూ 1.4 కోట్లు చేజిక్కించుకున్నారని చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది. సెబీ, ఆర్ఓసీ విచారణలను మేనేజ్ చేసేందుకు గాను 2010-12 మధ్య సేన్ కంపెనీల నుంచి ఆమె రూ 1.4 కోట్లు రాబట్టారని వెల్లడించింది. శారదా చిట్ ఫండ్ స్కామ్‌లో నళినీ చిదంబరంను తొలుత 2016 సెప్టెంబర్‌లో సాక్షిగా దర్యాప్తుసంస్ధలు పిలిచాయి. ఓ టీవీ చానల్ డీల్‌కు సంబంధించి కోర్టుకు హాజరైనందుకు శారదా గ్రూప్ తరపున వాదనలు వినిపించినందుకు నళినీ చిదంబరం రూ 1.26 కోట్లు ఫీజుగా వసూలు చేశారు. కాగా శారదా చిట్‌ఫండ్ స్కామ్‌లో దాఖలైన ఆరవ అనుబంధ చార్జిషీట్లో నళినీ చిదంబరంతో పాటు అనుభూతి ప్రింటర్స్ అండ్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుదీప్త సేన్లను సహ నిందితులుగా సీబీఐ పేర్కొంది. -
అనిల్ గోస్వామిని పంపిస్తారా?
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి బుధవారం హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. శారదా కుంభకోణంలో కాంగ్రెస్ నాయకుడు మాతాంగ్ సింగ్ ను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆయన అడ్డుకున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఈ ఉదయం కార్యాలయానికి రాగానే తనను కలవాలని గోస్వామికి రాజ్ నాథ్ కబురు పంపారు. దీంతో ఆయనను గోస్వామి కలిశారు. దాదాపు గంటసేపు వారు చర్చలు జరిపారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడేందుకు అనిల్ గోస్వామి ఇష్టపడలేదు. అయితే ఆయనపై వేటు పడే అవకాశముందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన విషయంలో కేంద్రం ఏవిధంగా స్పందిస్తుందనేది త్వరలోనే తేలనుంది. -
దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి
ప్రధాని మోదీకి ‘దీదీ’ సవాల్ శారదా స్కాంలో మంత్రి మిత్రాను సీబీఐ అరెస్టు చేయడంపై ఫైర్ కేంద్రానిది రాజకీయ కక్ష సాధింపేనని మమత ధ్వజం కోల్‌కతా: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారు మధ్య చిచ్చురేపిన శారదా చిట్‌ఫండ్ కుంభకోణం వ్యవహారం రెండు ప్రభుత్వాల మధ్య మరింత అగాధాన్ని సృష్టించింది. ఈ స్కామ్‌లో ప్రమేయం ఆరోపణలపై ఇప్పటికే ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను అరెస్టు చేసిన సీబీఐ శుక్రవారం మమత నమ్మినబంటు, బెంగాల్ రవాణా మంత్రి మదన్ మిత్రాను శుక్రవారం కోల్‌కతాలో అరెస్టు చేసింది. శారదా రియాల్టీకి సంబంధించిన కేసులో నేరపూరిత కుట్ర, మోసం, నిధుల అవకతవకలు, శారదా గ్రూప్ నుంచి అయాచిత ఆర్థిక లబ్ధి పొందడం వంటి అభియోగాలపై ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలిపింది. అయితే సీబీఐ చర్యపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మిత్రా అరెస్టు కేంద్రం రాజకీయ కక్ష సాధింపు, నీతిమాలిన కుట్రలో భాగమని దుయ్యబట్టారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మిత్రాను వైద్య పరీక్షల నిమిత్తం తరలించిన ఎస్ఎస్కేఎం ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను కలుస్తానని...ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలకు దమ్ముంటే వారి వద్ద ఉన్న పోలీసు మార్బలాన్నంతా ఉపయోగించి తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. సీబీఐని పావుగా వాడుకుంటూ బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. దేశ లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర వ్యవస్థను కేంద్రం నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. ‘‘ఈ కేసులో మిత్రాను సాక్షిగా పిలిచిన సీబీఐ కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన్ను అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపు కాదా?’’ అని మమత కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అసెంబ్లీ స్పీకర్‌కు సమాచారం ఇవ్వకుండానే ఒక మంత్రిని (మిత్రా) సీబీఐ అరెస్టు చేయడం చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీజేపీ నిజస్వరూపాన్ని బయటపెడతామని...అఖిల భారత స్థాయిలో ఆ పార్టీతో పోరాడతామన్నారు. సీబీఐ అరెస్టు చేసి, అభియోగాలు మోపిన ఒక వ్యక్తి (అమిత్ షాను ఉద్దేశించి) తమ పార్టీపై వేలెత్తి చూపుతున్నారని చురకలంటించారు. కేంద్రం తీరుకు నిరసనగా తమ పార్టీ శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనుందని చెప్పారు. ‘‘దేశంలో ఇందిరాగాంధీ హయాం నాటి ఎమర్జెన్సీ రోజులకన్నా ప్రస్తుత బీజేపీ పాలన అధ్వానంగా సాగుతోంది. మోదీ ప్రభుత్వం పిరికిపందలా, నియంతలా ప్రవర్తిస్తూ ప్రమాదకర ఆట ఆడుతోంది. కేంద్రంతో కొత్త యుద్ధం మొదలైంది. మీ (కేంద్రం) సవాల్‌ను స్వీకరిస్తున్నాం.’’ అని మమత పేర్కొన్నారు. మంత్రి పదవికి మిత్రా చేసిన రాజీనామాను తిరస్కరించినట్లు ‘దీదీ’ తెలిపారు. ఎన్నో మీడియా సంస్థలు చిట్ఫండ్ల కంపెనీల నుంచి ప్రకటనలు తీసుకున్నాయి. మరి వాటిపై చర్యలు తీసుకున్నారా? సహారా స్పాన్సర్‌షిప్‌తో క్రికెట్ ఆడిన సచిన్, సౌరవ్లు క్రిమినెల్స్ అవుతారా? ఎందరో సీపీఎం నేతలు చిట్‌ఫండ్ కంపెనీల యజమానులతో కనిపించారు. మరి వారిని మేం అరెస్టు చేయాలంటారా? అని మమత మీడియాను ఎదురు ప్రశ్నించారు. కేంద్ర ఆర్థికశాఖ ఆఫీసు సమీపంలో ఉన్న ఓ కంపెనీ వేల కోట్ల రూపాయల నిధులను గోల్మాల్ చేసిందన్నారు కాగా, అరెస్టుకు ముందు మిత్రాను సీబీఐ అధికారులు ఐదు గంటలపాటు ప్రశ్నించారు. శారదా గ్రూప్ చైర్మన్ సుదీప్తోసేన్‌కు న్యాయ సలహాదారుగా వ్యవహరించిన నరేష్ బలోదియాను సైతం నేరపూరిత కుట్ర అభియోగాల కింద అరెస్టు చేశారు. మిత్రాను శనివారం అలీపూర్ కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా శారదా స్కాంలో తృణమూల్ పాత్ర రోజురోజుకూ బలపడుతున్న నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ మమత సీఎం పదవికి రాజీనామా చేయాలని బెంగాల్ విపక్షాలు డిమాండ్ చేశాయి. -
జైల్లో బహిష్కృత ఎంపీ ఆత్మహత్యాయత్నం
-
జైల్లో బహిష్కృత ఎంపీ ఆత్మహత్యాయత్నం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన శారదా గ్రూపు చిట్‌ఫండ్ కుంభకోణంలో నిందితుడుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కునాల్ ఘోష్ శుక్రవారం జైల్లో ఆత్మహత్యాయత్నం చేశారు. కోల్‌కతా ప్రెసిడెన్సీ జైల్లో ఉన్న ఆయన 58 నిద్రమాత్రలు మింగి ఈ ఘటనకు పాల్పడ్డారు. కునాల్ ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన జైలు అధికారులు హుటాహుటీన ఎన్ఎన్కెఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా కునాల్ ఘోష్‌పై ఆరోపణలు రావటంతో తృణమూల్ కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. కునాల్ గత నవంబర్ లో అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. శారదా గ్రూపు మీడియా విభాగం సీఈవోగా వ్యవహరించిన ఆయనపై చీటింగ్ సహా పలు అభియోగాలు ఉన్నాయి. మరోవైపు కునాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించటంతో జైల్లోనే ఉన్నారు. శారద స్కాంలో ప్రమేయం ఉన్న చాలామంది స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని, మూడు రోజుల క్రితం కునాల్ కోర్టుకు వెల్లడించారు. వారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన కోరారు. -
చిదంబరం సతీమణిని ప్రశ్నించిన సీబీఐ
న్యూఢిల్లీ: శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం సతీమణి నళినిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. చెన్నైలో శనివారం సాయంత్రం ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నించారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జైలులో ఉన్న శారదా చిట్‌ఫండ్ చైర్మన్ సుదీప్త సేన్.. నళినికి లాయర్ ఫీజు కింద నళినికి కోటి రూపాయలు చెల్లించినట్టు వెల్లడించారు. దీనిపై ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. నళినిని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు వచ్చిన వార్తలను ఆమె సన్నిహితులు కొట్టిపారేశారు. శారదా చిట్‌ఫండ్ నుంచి న్యాయబద్దంగానే నళిని కోటి రూపాయలు తీసుకున్నారని చెప్పారు. -
'ముఖ్యమంత్రి పదవికి మచ్చ తెచ్చిన మమత'
కోల్‌కతా: శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సీపీఎం విమర్శులు గుప్పించింది. ముఖ్యమంత్రి స్థానానికి మచ్చ తెచ్చారని దీదీపై మండిపడింది. పేదల సొమ్ముతో ముడిపడిన అంశంలో ఇంతకుముందెప్పుడూ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలు రాలేదని సీపీఎం పేర్కొంది. మమత కారణంగా ముఖ్యమంత్రి పదవి ప్రతిష్ట మంటగలిసిందని సీసీఎం రాష్ట్ర కార్యదర్శి సుజన్ చక్రవర్తి వ్యాఖ్యానించారు. శారదా కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కునాల్ ఘోష్ అరెస్టైన కావడంతో మమత పాత్రపై అనుమానాలు తలెత్తున్నాయని చెప్పారు. -
'శారద'పై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం
తీవ్ర సంచలనం సృష్టించిన శారద చిట్‌ఫండ్ స్కామ్‌పై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. నగదు మదుపుదారులలో విశ్వాసం కలిగించేందుకే సీబీఐ విచారణకు ఆదేశించినట్లు ఆ ఆదేశాలలో పేర్కొంది. జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఒడిశాలో సంచలనం కలిగించిన పొంజి స్కాంపై కూడా విచారణ జరపాలని ఆదేశించింది. ఆ రెండు స్కాంలకు సంబంధం ఉండవచ్చని సుప్రీం ఈ సందర్బంగా అభిప్రాయపడింది. శారద చిట్‌ఫండ్ స్కాం మూలలు పశ్చిమబెంగాల్, ఒడిశాతోపాటు అసోం రాష్ట్రాలకు విస్తరించి ఉందని సుప్రీం వ్యాఖ్యానించింది. అయితే శారద స్కాంపై సుప్రీం కోర్టు ఆదేశాలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకించారు.