అభిషేక్ బెనర్జీ
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో సీబీఐ తర్వాతి టార్గెట్ అభిషేక్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం ఈ మేరకు వ్యవహరించింది. దక్షిణ కోల్‌కతాలోని హరీశ్ ముఖర్జీ రోడ్డులో ఉన్న అభిషేక్ నివాసం ‘శాంతినికేతన్’ వద్ద భద్రతను పెంచింది. క్యూఆర్‌టీ దళం (క్విక్ రెస్పాన్స్ టీమ్), కానిస్టేబుల్స్ పాటు కనీసం ఆరుగురు అధికారులు ఎల్లప్పుడూ అభిషేక్ ఇంటి వద్ద గస్తీ కాస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు వెల్లడించారు. 30 అడుగుల ఎత్తులో రెండు పోలీసు పోస్ట్‌లను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సాయుధులతో కూడిన క్యూఆర్‌టీ బృందం నిరంతరం కాపలాగా ఉంటుందన్నారు. (శారదా మోసంలో ఎవరి వాటా ఎంత?)
లోక్‌సభ ఎంపీ, తృణమూల్ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న అభిషేక్ నివాసం వద్ద ఇంత మంది పోలీసులను తాము ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. బారికేడ్లు, పోలీసుల వాహనాల కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై స్పందించేందుకు అభిషేక్ అందుబాటులో లేరు. తృణమూల్ నేతలు మీడియా ముఖంగా మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. ‘మా పార్టీపై ఒత్తిడి పెంచేందుకు అభిషేక్‌ను సీబీఐ టార్గెట్ చేసిందని అందరికీ తెలుసు. శారదా కుంభకోణంతో ఆయన పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. నారద స్టింగ్ ఆపరేషన్ దర్యాప్తులో సీబీఐ ఉద్దేశపూర్వకంగా తన ఎఫ్‌ఐఆర్ అభిషేక్ పేరు చేర్చింది. బీజేపీ ఆదేశానుసారమే ఇదంతా చేసింద’ని తృణమూల్ నాయకుడొకరు ఆరోపించారు. (కోల్‌కతాలో ‘దీదీ’గిరి!)
నారద స్టింగ్ ఆపరేషన్ ఎఫ్‌ఐఆర్‌లో ఆరు చోట్ల అభిషేక్ పేరు ఉంది. ఇందులో 12 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు ఉండటంతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు వణుకుతున్నారు. శారదా స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీబీఐ అధికారులు శనివారం షిల్లాంగ్‌లో ప్రశ్నించారు. దాదాపు నాలుగు గంటల పాటు విచారణ కొనసాగింది. తమకు రాజీవ్ కుమార్ సహకరించలేదని సీబీఐ అధికారులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment