sarada chits scam
-
శారదా గ్రూప్ ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్ తదితర అక్రమ పథకాలను నిర్వహించిన శారదా గ్రూప్ ఆస్తులను వేలం వేయనున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. ఏప్రిల్ 11న నిర్వహించనున్న వేలానికి రూ. 32 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది. ఆస్తులలో కంపెనీకి చెందిన పశ్చిమ బెంగాల్‌లోని భూములు న్నట్లు సెబీ నోటీసులో ప్రకటించింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 మధ్య ఈవేలం నిర్వహించనున్నట్లు తెలియజేసింది. ఆస్తుల అమ్మకంలో సహకరించేందుకు క్వికార్ రియల్టీని, ఈవేలం నిర్వహణకు సీ1 ఇండియాను ఎంపిక చేసుకుంది. శారదా గ్రూప్ ఆస్తుల వేలానికి 2022 జూన్‌లో కోల్‌కతా హైకోర్టు అనుమతించడంతో సెబీ తాజా చర్యలకు దిగింది. మూడు నెలల్లోగా ప్రక్రియను ముగించవలసిందిగా కోర్టు ఆదేశించింది. శారదా గ్రూప్ 239 ప్రయివేట్ కంపెనీల కన్సార్షియంగా ఏర్పాటైంది. పశ్చిమ బెంగాల్, అస్సామ్, ఒడిషాలలో కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్ బిజినెస్‌ను చేపట్టింది. 2013 ఏప్రిల్‌లో మూతపడటానికి ముందు 17 లక్షల మంది కస్టమర్ల ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించింది. ముందుగానే శారదా గ్రూప్ ఆస్తులకు సంబంధించి సొంతంగా వివరాలు తెలుసుకోవలసి ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. తదుపరి వేలంలో బిడ్స్ దాఖలు చేసుకోమని సూచించింది. -
కోల్‌కతా పోలీస్ చీఫ్ బదిలీ
కోల్‌కతా : శారదా చిట్‌ఫండ్ స్కామ్‌లో సీబీఐ విచారణను ఎదుర్కొన్న కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఐజీ, నేర పరిశోధన విభాగంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. కోల్‌కతా పోలీస్ చీఫ్‌గా రాజీవ్ కుమార్ స్దానంలో అనుజ్ శర్మ నియమితులయ్యారు. శారదా చిట్‌ఫండ్, రోజ్ వ్యాలీ స్కామ్‌ల్లో ఆధారాలను రాజీవ్ కుమార్ తారుమారు చేశారని సీబీఐ ఆరోపిస్తున్న క్రమంలో ఆయనను కోల్‌కతా పోలీస్ చీఫ్‌గా తప్పించడం గమనార్హం. కాగా, కాల్ రికార్డుఆధారాలను రాజీవ్ కుమార్ తారుమారు చేశారని సుప్రీం కోర్టులో సమర్పించిన అఫిడవిట్లో సీబీఐ పేర్కొంది. ఈ కేసులో రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించేందుకు కోల్‌కతాలోని ఆయన నివాసానికి సీబీఐ బృందాలు చేరుకోగా సీఎం మమతా బెనర్జీ ఆయనకు బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే. కేంద్రం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపిస్తూ ఆమె ధర్నా చేపట్టగా కొన్ని విపక్ష పార్టీలు దీదీకి మద్దతు ప్రకటించాయి. -
నళినీ చిదంబరానికి ఊరట
కోల్‌కతా : శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం భార్య నళినీ చిదంబరానికి కలకత్తా హైకోర్టు సోమవారం మధ్యంతర ఊరట కల్పించింది. ఈ కేసుకు సంబంధించి ఆమెను అరెస్ట్ చేయరాదని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకూ నళినీ చిదంబరంను అరెస్ట్ చేయకుండా దర్యాప్తు ఏజెన్సీను నిరోధించింది. దర్యాప్తునకు సహకరించాలని నళినీ చిదంబరంను ఆదేశించిన కోర్టు ముందస్తు బెయిల్ దరఖాస్తును పెండింగ్‌లో ఉంచుతూ జస్టిస్ జోమాల్య బాగ్చి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈలోగా తమ వాదనలకు మద్దతుగా నళినీ చిదంబరం, సీబీఐ అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించింది. ఇన్వెస్టర్ల నుంచి శారదా చిట్ ఫండ్ సంస్థ అక్రమంగా సేకరించిన సొమ్ము నుంచి సీనియర్ న్యాయవాది నళినీ చిదంబరానికి రూ 1.3 కోట్లు చెల్లించారని సీబీఐ ఆరోపిస్తోంది. అయితే మనోరంజన సింగ్‌కు న్యాయసలహాదారుగా ఆమెకు ఆ మొత్తం చెల్లించారని నళినీ చిదంబరం న్యాయవాది ఘోష్ న్యాయస్ధానానికి నివేదించారు. -
సీబీఐ తర్వాతి టార్గెట్ ఆయనే!
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో సీబీఐ తర్వాతి టార్గెట్ అభిషేక్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం ఈ మేరకు వ్యవహరించింది. దక్షిణ కోల్‌కతాలోని హరీశ్ ముఖర్జీ రోడ్డులో ఉన్న అభిషేక్ నివాసం ‘శాంతినికేతన్’ వద్ద భద్రతను పెంచింది. క్యూఆర్టీ దళం (క్విక్ రెస్పాన్స్ టీమ్), కానిస్టేబుల్స్ పాటు కనీసం ఆరుగురు అధికారులు ఎల్లప్పుడూ అభిషేక్ ఇంటి వద్ద గస్తీ కాస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు వెల్లడించారు. 30 అడుగుల ఎత్తులో రెండు పోలీసు పోస్ట్‌లను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సాయుధులతో కూడిన క్యూఆర్టీ బృందం నిరంతరం కాపలాగా ఉంటుందన్నారు. (శారదా మోసంలో ఎవరి వాటా ఎంత?) లోక్‌సభ ఎంపీ, తృణమూల్ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న అభిషేక్ నివాసం వద్ద ఇంత మంది పోలీసులను తాము ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. బారికేడ్లు, పోలీసుల వాహనాల కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై స్పందించేందుకు అభిషేక్ అందుబాటులో లేరు. తృణమూల్ నేతలు మీడియా ముఖంగా మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. ‘మా పార్టీపై ఒత్తిడి పెంచేందుకు అభిషేక్‌ను సీబీఐ టార్గెట్ చేసిందని అందరికీ తెలుసు. శారదా కుంభకోణంతో ఆయన పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. నారద స్టింగ్ ఆపరేషన్ దర్యాప్తులో సీబీఐ ఉద్దేశపూర్వకంగా తన ఎఫ్ఐఆర్ అభిషేక్ పేరు చేర్చింది. బీజేపీ ఆదేశానుసారమే ఇదంతా చేసింద’ని తృణమూల్ నాయకుడొకరు ఆరోపించారు. (కోల్‌కతాలో ‘దీదీ’గిరి!) నారద స్టింగ్ ఆపరేషన్ ఎఫ్ఐఆర్లో ఆరు చోట్ల అభిషేక్ పేరు ఉంది. ఇందులో 12 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు ఉండటంతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు వణుకుతున్నారు. శారదా స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీబీఐ అధికారులు శనివారం షిల్లాంగ్‌లో ప్రశ్నించారు. దాదాపు నాలుగు గంటల పాటు విచారణ కొనసాగింది. తమకు రాజీవ్ కుమార్ సహకరించలేదని సీబీఐ అధికారులు ఆరోపించారు. -
సీబీఐ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు
-
సీబీఐ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు
కోల్‌కతా : శారదా చిట్‌ఫండ్, రోజ్‌వ్యాలీ స్కామ్ కేసులకు సంబంధించి ప్రశ్నించేందుకు కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసానికి ఆదివారం సీబీఐ అధికారుల బృందం చేరుకుంది. సీబీఐ బృందాన్ని లోపలికి అనుమతించకుండా వెలుపలే కోల్‌కతా పోలీసులు అడ్డుకున్నారు. రోజ్‌వ్యాలీ, శారదా చిట్‌ఫండ్ కేసుల్లో కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా చివరి ప్రయత్నంగా రాజీవ్ కుమార్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో సీబీఐ అధికారులను కోల్‌కతా పోలీసులు నిలువరించడం ఉత్కంఠ రేపుతోంది. ఈ స్కామ్‌లపై పశ్చిమ బెంగాల్ పోలీసుల విచారణకు నేతృత్వం వహిస్తున్న కుమార్‌ను కేసులకు సంబంధించిన పత్రాల గల్లంతుపై ప్రశ్నించేందుకు సీబీఐ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదని దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులు వెల్లడించారు. సీబీఐ అధికారుల బృందం కుమార్ ఇంటికి చేరుకోగానే నివాసం వెలుపలే కోల్‌కతా పోలీసులు, సెంట్రీలు వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కుమార్ ఇంటికి మమతా బెనర్జీ కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేరుకోవడంతో కుమార్ ఇంటివద్ద హైడ్రామా నెలకొంది. సీబీఐ బృందం, బెంగాల్ పోలీసుల వాగ్వాదంతో ఉద్రిక్తత ఏర్పడింది. సీబీఐ సిబ్బందిని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ సంసిద్ధమైన క్రమంలో కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించిన సంగతి తెలిసిందే. కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు ఆమె బాసటగా నిలిచారు. -
మంత్రుల రహస్య పర్యటనలు.. ఎందుకో!
'ఎబార్ బంగ్లా'... అంటూ అమిత్ షా కంఠం ఖంగుమంటూ మోగింది. దేశవ్యాప్త పర్యటనకు గత నెలలో కోల్‌కతాలో శ్రీకారం చుట్టినప్పుడు అక్కడున్న కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దాంతో ఒక్కసారిగా టీఎంసీ కలవరపడింది. గురువారం నాడు టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ దానిమీద స్పందించారు. ఆయన స్పందన ఎలా ఉన్నా.. పశ్చిమ బెంగాల్ మంత్రివర్గంలోని కొంతమంది సభ్యులు సహా ఇటీవలి కాలంలో పలువురు టీఎంసీ సీనియర్ నాయకులు రహస్యంగా లక్నోకు వెళ్లి వస్తున్నారు. ఎందుకా అన్న విషయం చాలాకాలం పాటు ఎవరికీ అర్థం కాలేదు. చివరకు తేలింది ఏంటయ్యా అంటే.. గతంలో పశ్చిమబెంగాల్లో చురుగ్గా వ్యవహరించిన బీజేపీ నాయకుడు ఒకరు ఇటీవలే లక్నోకు వెళ్లిపోయారట. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన అక్కడకు వెళ్లారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నారద స్టింగ్ ఆపరేషన్ కేసును, శారదా చిట్‌ఫండ్ స్కాం కేసును తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ రెండు కేసులను వదిలేది లేదని స్పష్టం చేస్తోంది. దాంతో ఎలాగోలా ఆ బీజేపీ పెద్దాయనను ప్రసన్నం చేసుకుని ఆ కేసుల నుంచి బయటపడాలన్నది టీఎంసీ నాయకుల ఉద్దేశంలా కనిపిస్తోంది. అవసరమైతే.. టీఎంసీ నుంచి బయటపడి, బీజేపీలో చేరిపోతామని కూడా వాళ్లు రాయబారాలు నడుపుతున్నారట. కానీ.. బీజేపీ మాత్రం మచ్చపడ్డ నాయకులను తీసుకునేది లేదని తెగేసి చెబుతోంది. 'నో నారదా - శారదా ఇన్ బీజేపీ' అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ రెండు కేసులను సీబీఐ కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో సుప్రీంకోర్టులో చార్జిషీటు కూడా దాఖలు చేసేశారు. ఈ స్కాంను బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ నేతృత్వంలో ఉన్న పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. స్కాంలో పాత్ర ఉందని తెలిస్తే ఎంపీల మీద కూడా గట్టి చర్యలు తీసుకోడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ అస్త్రం బీజేపీకి 2019 ఎన్నికల్లో బాగా ఉపయోగపడేలా కనిపిస్తోంది. బెంగాల్లో అధికారం చేపట్టేంత పరిస్థితి లేకపోయినా, కనీసం ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగితే చాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇటీవల అక్కడ జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ రెండో స్థానంలో నిలవగా.. వామపక్షాలు, కాంగ్రెస్ వరుసగా మూడు, నాలుగు స్థానాలకు పరిమితం అయ్యాయి.