సీబీఐ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు | CBI Team Reaches Kolkata Police Chiefs Residence Denied Entry | Sakshi
Sakshi News home page

సీబీఐ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు

Published Sun, Feb 3 2019 7:17 PM | Last Updated on Sun, Feb 3 2019 9:11 PM

CBI Team Reaches Kolkata Police Chiefs Residence Denied Entry - Sakshi

కోల్‌కతా : శారదా చిట్‌ఫండ్‌, రోజ్‌వ్యాలీ స్కామ్‌ కేసులకు సంబంధించి ప్రశ్నించేందుకు కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నివాసానికి ఆదివారం సీబీఐ అధికారుల బృందం చేరుకుంది. సీబీఐ బృందాన్ని లోపలికి అనుమతించకుండా వెలుపలే కోల్‌కతా పోలీసులు అడ్డుకున్నారు. రోజ్‌వ్యాలీ, శారదా చిట్‌ఫండ్‌ కేసుల్లో కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఈ కేసు విచారణలో భాగంగా చివరి ప్రయత్నంగా రాజీవ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో సీబీఐ అధికారులను కోల్‌కతా పోలీసులు నిలువరించడం ఉత్కంఠ రేపుతోంది. ఈ స్కామ్‌లపై పశ్చిమ బెంగాల్‌ పోలీసుల విచారణకు నేతృత్వం వహిస్తున్న కుమార్‌ను కేసులకు సంబంధించిన పత్రాల గల్లంతుపై ప్రశ్నించేందుకు సీబీఐ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదని దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులు వెల్లడించారు. సీబీఐ అధికారుల బృందం కుమార్‌ ఇంటికి చేరుకోగానే నివాసం వెలుపలే కోల్‌కతా పోలీసులు, సెంట్రీలు వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

కుమార్‌ ఇంటికి మమతా బెనర్జీ

కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నివాసానికి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేరుకోవడంతో కుమార్‌ ఇంటివద్ద హైడ్రామా నెలకొంది. సీబీఐ బృందం, బెంగాల్‌ పోలీసుల వాగ్వాదంతో ఉద్రిక్తత ఏర్పడింది. సీబీఐ సిబ్బందిని సమీప పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ సంసిద్ధమైన క్రమంలో కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించిన సంగతి తెలిసిందే. కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు ఆమె బాసటగా నిలిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement