Trinamool MP
-
వెంకయ్య నాయుడికి తృణమూల్ ఎంపీ ‘చిక్కు’ ప్రశ్న
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి సోమవారం రాజ్యసభ వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో వెంకయ్యకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ పలు ప్రశ్నలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెనక్కు తీసుకున్న వివాదాస్పద వ్యవసాయ చట్టాలను 2020, సెప్టెంబరు 20న ఎగువ సభ ఆమోదించినప్పుడు రాజ్యసభ చైర్మన్ స్థానంలో వెంకయ్య లేరని డెరెక్ ఓబ్రెయిన్ గుర్తు చేశారు. ‘బహుశా ఏదో ఒక రోజు మీరు మీ ఆత్మకథలో దీనికి సమాధానం ఇస్తార’ని ఆయన చమత్కరించారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 సెప్టెంబర్ 2013న పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వెంకయ్య నాయుడు చేసిన ఉద్వేగభరిత ప్రసంగం గురించి కూడా ప్రస్తావించి.. దీనికి కూడా ఆత్మకథలోనే సమాధానం చెబుతారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వివాదంపై 2013లో ఎగువ సభలో మాట్లాడిన వెంకయ్య నాయుడు.. తాను రాజ్యసభ చైర్మన్ ఉన్న సమయంలో మాత్రం పెగాసస్‌పై చర్చకు అవకాశం ఇవ్వలేదని గుర్తుచేశారు. ‘మార్చి 1, 2013న, మీరు సభలో 5-6 నిమిషాల పాటు ఫోన్ ట్యాపింగ్‌పై జోక్యం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా పెగాసస్ అంశాన్ని సభలో చర్చించడానికి మేము చేసిన ప్రయత్నాలు ఫలించలేద’ని అన్నారు. కాగా, వెంకయ్య నాయుడు పదవీ కాలం ముగియడంతో నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆగస్టు 6న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి మార్గరెట్ అల్వాపై ధన్కర్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. (క్లిక్: ఇది ఉద్వేగభరితమైన క్షణం.. ప్రధాని మోదీ) -
ఆమె పార్లమెంట్లో అలా ఎందుకు చేసిదంటే.....
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ధరల పెరుగుదల పై చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ విషయమై తృణమూల్ ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్ పార్లమెంట్లో లేచి నిలబడి మాట్లాడుతూ... చర్చకు అనుమతిచ్చినందుకు ధన్యావాదాలని చెబుతూ... పెద్ద ఎత్తున ధరల పెరుగుదల గురించి విమర్శలు చేశారు. ఇక తాము పచ్చి కూరగాయాలే తినాలని కోరుకుంటుందా ప్రభుత్వం అంటూ నిలదీశారు. వంటగ్యాస్ ధర గత కొన్ని నెలల్లోనే నాలుగు సార్లు పెరిగిందని ఇక ఏం వండుకుని ప్రజలు తింటారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటగ్యాస్ ధర ఇలాపెరుగుతూ ఉంటే పచ్చి కూరగాయాలే తినాలంటూ... పార్లమెంట్‌లోనే అందరి ముందు పచ్చి వంకాయ తిని చూపిస్తూ... ప్రభుత్వ తీరు పై మండిపడ్డారు. అంతేకాదు ఈ వంటగ్యాస్ ధర రూ. 600 నుంచి రూ. 1100కి ఎలా పెరిగిందో వివరించి చెప్పడమే కాకుండా సిలిండర్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పైగా ఉజ్వల పథకం కింద కనెక్షన్లు పొందిన పేద లబ్దిదారులకే ప్రభుత్వం సబ్సిడీని పరిమితం చేయడంతో సామాన్య కుటుంబాలు వంట గ్యాస్ కొనుగోలుకు సబ్సిడీ లేని రేట్లు చెల్లిస్తున్నారని కూడా ఈ సందర్భంగా కకోలి ఘోష్ చెప్పుకొచ్చారు. ఐతే కాంగ్రెస్ ఎంపీలు సస్పెండ్ అవ్వడంతో ఈ చర్చలు రెండుసార్లు వాయిదాపడ్డా తదనంతరం లోక్‌సభలో ఈ ధరల పెరుగుదల గురించి చర్చలు ఘాటుగా జరిగాయి. (చదవండి: పాత్రా చావల్ స్కామ్: వీడిన సస్పెన్స్.. ఈడీ కస్టడీకి సంజయ్ రౌత్.. ముంబై PMLA కోర్టు ఆదేశం) -
సొంత పార్టీ ఎంపీకి పబ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చిన మమత
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సొంత పార్టీ మహిళా ఎంపీ మహువా మోయిత్రాకు పబ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చారు. గ్రూపులు కడితే సహించేది లేదని స్పష్టం చేశారు. నదియా జిల్లాలో తృణమూల్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో పార్టీ నేతలకు మమత గట్టి హెచ్చరిక జారీ చేశారు. నదియా జిల్లాలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ నాయకులు విభేదాలు పక్కనపెట్టి కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. ఆధిపత్యం కోసం రచ్చకెక్కితే వేటు తప్పదని హెచ్చరించారు. ‘మహువా.. నేను ఇక్కడ ఒకటే స్పష్టం చేస్తున్నాను. ఎవరికి ఎవరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనేది నాకు అవసరం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరిని పోటీకి దింపాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి శాశ్వతంగా ఒక స్థానంలో ఉంటాడని నమ్మడానికి ఎటువంటి కారణం లేదు. కాబట్టి ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసి పనిచేయాల’ని అన్నారు. ఆ సమయంలో వేదికపైనే మొయిత్రా.. మమతా బెనర్జీ వెనుక కూర్చున్నారు. కాగా, పార్టీ నదియా జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి ఇటీవలే ఆమెను తొలగించారు. (చదవండి: తొలిసారి ఆ రాష్ట్ర పర్యటనకు.. భారీగా భద్రతా ఏర్పాట్లు ) టీఎంసీ నాయకత్వంలోని ఓ వర్గం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఇటీవల పోస్టర్లు వెలిసినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పోలీసు విచారణలో తేలినట్టు మమత తెలిపారు. పథకం ప్రకారం మీడియాను తప్పుదారి పట్టించారని, దీని వెనుక ఎవరున్నారో తనకు తెలుసని అన్నారు. త్వరలో స్థానిక సంస్థలు జరగనున్న నేపథ్యంలో ‘దీదీ’ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. (చదవండి: లోహాఘాట్ అసెంబ్లీ సీటు ఎవరిది? పోటాపోటీగా..) -
సీబీఐ తర్వాతి టార్గెట్ ఆయనే!
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో సీబీఐ తర్వాతి టార్గెట్ అభిషేక్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం ఈ మేరకు వ్యవహరించింది. దక్షిణ కోల్‌కతాలోని హరీశ్ ముఖర్జీ రోడ్డులో ఉన్న అభిషేక్ నివాసం ‘శాంతినికేతన్’ వద్ద భద్రతను పెంచింది. క్యూఆర్టీ దళం (క్విక్ రెస్పాన్స్ టీమ్), కానిస్టేబుల్స్ పాటు కనీసం ఆరుగురు అధికారులు ఎల్లప్పుడూ అభిషేక్ ఇంటి వద్ద గస్తీ కాస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు వెల్లడించారు. 30 అడుగుల ఎత్తులో రెండు పోలీసు పోస్ట్‌లను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సాయుధులతో కూడిన క్యూఆర్టీ బృందం నిరంతరం కాపలాగా ఉంటుందన్నారు. (శారదా మోసంలో ఎవరి వాటా ఎంత?) లోక్‌సభ ఎంపీ, తృణమూల్ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న అభిషేక్ నివాసం వద్ద ఇంత మంది పోలీసులను తాము ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. బారికేడ్లు, పోలీసుల వాహనాల కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై స్పందించేందుకు అభిషేక్ అందుబాటులో లేరు. తృణమూల్ నేతలు మీడియా ముఖంగా మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. ‘మా పార్టీపై ఒత్తిడి పెంచేందుకు అభిషేక్‌ను సీబీఐ టార్గెట్ చేసిందని అందరికీ తెలుసు. శారదా కుంభకోణంతో ఆయన పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. నారద స్టింగ్ ఆపరేషన్ దర్యాప్తులో సీబీఐ ఉద్దేశపూర్వకంగా తన ఎఫ్ఐఆర్ అభిషేక్ పేరు చేర్చింది. బీజేపీ ఆదేశానుసారమే ఇదంతా చేసింద’ని తృణమూల్ నాయకుడొకరు ఆరోపించారు. (కోల్‌కతాలో ‘దీదీ’గిరి!) నారద స్టింగ్ ఆపరేషన్ ఎఫ్ఐఆర్లో ఆరు చోట్ల అభిషేక్ పేరు ఉంది. ఇందులో 12 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు ఉండటంతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు వణుకుతున్నారు. శారదా స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీబీఐ అధికారులు శనివారం షిల్లాంగ్‌లో ప్రశ్నించారు. దాదాపు నాలుగు గంటల పాటు విచారణ కొనసాగింది. తమకు రాజీవ్ కుమార్ సహకరించలేదని సీబీఐ అధికారులు ఆరోపించారు. -
చిట్‌ఫండ్ స్కాంలో ఎంపీ అరెస్టు
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన శారదా చిట్‌ఫండ్స్ స్కాంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు శృంజయ్ బోస్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కోట్లాది రూపాయల మొత్తంతో కూడిన ఈ స్కాంలో ఆయనతో పాటు మరికొందరు నాయకులను కూడా సీబీఐ వర్గాలు గత కొన్నాళ్లుగా ప్రశ్నిస్తున్నాయి. అయితే.. స్కాంలో వాళ్ల పాత్ర కూడా ఉన్నట్లు నిర్ధారించుకోవడంతోనే బోస్‌ను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. -
శారద స్కాం: ఎంపీని ప్రశ్నించిన సీబీఐ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో కోట్లాది రూపాయల శారద చిట్‌ఫండ్ స్కాంలో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. బుధవారం తృణమాల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సువేందు అధాకారిని ప్రశ్నించారు. సీబీఐ అధికారులు దాదాపు గంటసేపు ఆయనను ప్రశ్నించారు. అనంతరం అధికారి మాట్లాడుతూ.. 'సాక్షిగా నన్ను విచారించారు. నాకు తెలిసిన విషయాలను వారికి చెప్పా' అని అన్నారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని తమ్లుక్ నియోజకవర్గం నుంచి ఆయన పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీబీఐ ఈ కేసులో పలువురు ఎంపీలతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఇటీవల ప్రశ్నించారు.