కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సొంత పార్టీ మహిళా ఎంపీ మహువా మోయిత్రాకు పబ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చారు. గ్రూపులు కడితే సహించేది లేదని స్పష్టం చేశారు. నదియా జిల్లాలో తృణమూల్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో పార్టీ నేతలకు మమత గట్టి హెచ్చరిక జారీ చేశారు. నదియా జిల్లాలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ నాయకులు విభేదాలు పక్కనపెట్టి కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. ఆధిపత్యం కోసం రచ్చకెక్కితే వేటు తప్పదని హెచ్చరించారు.
‘మహువా.. నేను ఇక్కడ ఒకటే స్పష్టం చేస్తున్నాను. ఎవరికి ఎవరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనేది నాకు అవసరం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరిని పోటీకి దింపాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి శాశ్వతంగా ఒక స్థానంలో ఉంటాడని నమ్మడానికి ఎటువంటి కారణం లేదు. కాబట్టి ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసి పనిచేయాల’ని అన్నారు. ఆ సమయంలో వేదికపైనే మొయిత్రా.. మమతా బెనర్జీ వెనుక కూర్చున్నారు. కాగా, పార్టీ నదియా జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి ఇటీవలే ఆమెను తొలగించారు. (చదవండి: తొలిసారి ఆ రాష్ట్ర పర్యటనకు.. భారీగా భద్రతా ఏర్పాట్లు )
టీఎంసీ నాయకత్వంలోని ఓ వర్గం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఇటీవల పోస్టర్లు వెలిసినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పోలీసు విచారణలో తేలినట్టు మమత తెలిపారు. పథకం ప్రకారం మీడియాను తప్పుదారి పట్టించారని, దీని వెనుక ఎవరున్నారో తనకు తెలుసని అన్నారు. త్వరలో స్థానిక సంస్థలు జరగనున్న నేపథ్యంలో ‘దీదీ’ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. (చదవండి: లోహాఘాట్ అసెంబ్లీ సీటు ఎవరిది? పోటాపోటీగా..)
Comments
Please login to add a commentAdd a comment