చెన్నై : ఓ ఆవు దూడ వింత ప్రవర్తన హాట్ టాపిక్‌గా మారింది. ఇంట్లో మనిషిలాగే తిరుగుతూ, మనుషులతో కలిసి నిద్రపోతోంది. పైగా.. దిండు మీద తలపెట్టుకొని దర్జాగా నిద్రిస్తోంది. చిన్న పిల్లల కోసం తెచ్చిన తినుబండారాలను కూడా తినేస్తోంది. తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఈ విడ్డూరం చోటుచేసుకుంది. వేలూరు జిల్లా ఆంబూరు సమీపంలోని వీరంగుప్పం గ్రామానికి చెందిన ఆనందన్, అమృత దంపతులు డెయిరీ ఫాం నిర్వహిస్తున్నారు. వారి ఫాంలోని ఓ ఆవు 3 నెలల కిందట ఓ లేగ దూడకు జన్మనిచ్చింది. పుట్టిన నాటి నుంచి అది యజమాని కుటుంబ సభ్యులతోనే తిరుగుతూ మనుషుల మాదిరిగానే ప్రవర్తిస్తోంది. ఆనందన్ కుటుంబ సభ్యులు ఆ లేగ దూడను తమ కుటుంబంలో ఓ సభ్యుడిగా పరిగణిస్తూ.. ముద్దుగా ‘వేలన్’ అని పిలుచుకుంటున్నారు.
వేలన్ మనుషులతో కలిసి ఇంట్లోనే తిరుగుతోంది. ఆకలేసినప్పుడు మాత్రమే పాల కోసం తల్లి ఆవు వద్దకు వెళ్తోంది. మిగతా సమయాల్లో ఆనందన్ కుటుంబంతోనే ఉంటోంది. ఇంట్లో వారితో కలిసి చాపపై తలకింద దిండు పెట్టుకొని పడుకుంటోందని యజమాని తెలిపారు. అంతేకాగా.. పాటలు వింటూ సంగీతానికి తగ్గట్లు కాళ్లు కదుపుతోందట. వింత చేష్టలతో ఈ ఆవు దూడ అందరినీ ఆకట్టుకుంటోంది. దీన్ని చూడటానికి స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రేజీ దూడ వేలన్‌తో సెల్ఫీలు కూడా దిగుతున్నారు. దీంతో ఈ ఆవు దూడకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment