న్యూఢిల్లీ: దేశంలో మత ఘర్షణల ఉదంతాలు పెరుగుతుండటం పట్ల జాతీయ సమగ్రతా మండలి తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మత ఘర్షణలను పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవటం మానాలని హితవు పలికింది. మతతత్వాన్ని నిరోధించేందుకు రాజకీయ నాయకులతో సహా దేశ ప్రజలంతా ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చింది. అన్ని మతాల మధ్య సామరస్య సంబంధాలను కాపాడేందుకు, బలోపేతం చేసేందుకు.. పౌరులంతా సమానత్వంతో, గౌరవప్రదంగా, స్వేచ్ఛాయుతంగా జీవించేందుకు అన్ని చర్యలూ చేపట్టాలని తీర్మానం చేసింది. వివిధ వర్గాల ప్రజల మధ్య మతపరంగా చీలిక తేవటానికి ప్రయత్నిస్తున్న విచ్ఛిన్నకర శక్తులు దేశ సమగ్రతకు పెను ముప్పని.. ఇలాంటి శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పిలుపునిచ్చారు. ఇటీవల ముజఫర్‌నగర్‌లో మతఘర్షణల నేపథ్యంలో జాతీయ సమగ్రతా మండలి సోమవారం ఢిల్లీలో సమావేశమైంది.
ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన రోజంతా కొనసాగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు, పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు, ముఖ్యమంత్రులు, జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులు, మీడియా, వ్యాపార, ప్రజా జీవన రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు, అభ్యంతరకర అంశాలను ప్రచారం చేసేందుకు సామాజిక వెబ్‌సైట్లను దుర్వినియోగం చేయటంపై ప్రధాని సహా పలువురు ముఖ్యమంత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. సామాజిక వెబ్‌సైట్ల అనియంత్రిత దుర్వినియోగాన్ని నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని పలు సూచనలు చేశారు. బీజేపీకి చెందిన గుజరాత్, ఛత్తీస్‌గఢ్, గోవా సీఎంలు నరేంద్ర మోడీ, రమణ్‌సింగ్, మనోహర్ పారికర్‌లతోపాటు తమిళనాడు, ఒడిశా సీఎంలు జయలలిత, నవీన్‌పట్నాయక్‌లు ఈ సమావేశానికి హాజరుకాలేదు. అయితే తమ అభిప్రాయాలను తమ ప్రతినిధుల ద్వారా సమావేశంలో వినిపించారు. సమగ్రతా మండలిలో ఆయా నేతల ప్రసంగాల్లో ముఖ్యాంశాలు వారి వారి మాటల్లోనే...
సోషల్ మీడియాను సౌభ్రాతృత్వానికి వాడాలి: ప్రధాని
‘‘ఇటీవల చోటుచేసుకున్న కొన్ని మత ఘర్షణల ఉదంతాల్లో.. ఒక మతంపై మరొక మతం వారిలో విద్వేషాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో నకిలీ వీడియోలను సామాజిక వెబ్‌సైట్లలో ప్రసారం చేసినట్లు గుర్తించాం. దీనికి ముందు 2012లో కూడా ఈశాన్య ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా విద్వేషాలను రెచ్చగొట్టారు. ఇది ఇతర ప్రాంతాల నుంచి ఈశాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో తిరిగి వెళ్లిపోయే పరిస్థితులకు దారితీసింది. సామాజిక మీడియాను సౌభ్రాతృత్వం, మత సామరస్యం పెంపొందించటానికి ఉపయోగించుకోవాలి. ప్రజలు సామాజిక మీడియాలో తమ అభిప్రాయాలు, దృక్పథాలను వెల్లడించే స్వేచ్ఛ ఉండటం అవసరం. కానీ అదే సమయంలో దుండగులు, ఇబ్బందులు సృష్టించేవారు సామాజిక మీడియాను దుర్వినియోగం చేయకుండా నిరోధించటమూ ముఖ్యమే. ముజఫర్‌నగర్‌లో ఇటీవల జరిగిన మత ఘర్షణల్లో దాదాపు 50 మంది చనిపోయారు. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. జమ్మూకాశ్మీర్‌లోని కీస్త్వర్ ప్రాంతంలోనూ, బీహార్‌లోని నవద ప్రాతంలోనూ, హైదరాబాద్‌లోనూ గత కొద్ది మాసాల్లో ఇలాంటి ఘటనలు పెరిగాయి. వివిధ వర్గాల ప్రజల మధ్య మతపరంగా చీలిక తేవడానికి ప్రయత్నించే శక్తులు దేశ ప్రజాస్వామ్యానికి పెను సవాల్.
ఇలాంటి శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలి. మత అల్లర్లను నివారించే బృహత్తర బాధ్యత రాష్ట్రాలపైనే ఉంది. ఇలాంటి ఘటనలకు ఎలాంటి రాజకీయ కోణం ఇవ్వటం కానీ, ఎలాంటి రాజకీయ లబ్ధి పొందటం కానీ చేయకుండా పార్టీలు, మీడియా సంయమనం పాటించాలి.’’
మత హింసను గర్హించిన మండలి: మత సామరస్యాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో జరిగే అన్ని రూపాల్లోని హింసనూ ఖండించింది. ఇందులో సంబంధమున్న వారిపై చట్ట ప్రకారం తక్షణ కఠిన చర్యలు చేపట్టాలని జాతీయ సమగ్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. అన్ని మతాల మధ్య సామరస్య సంబంధాలను కాపాడేందుకు, పౌరులంతా సమానత్వంతో స్వేచ్ఛాయుతంగా జీవించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, హింసాత్మక దాడులను కూడా జాతీయ సమగ్రతా మండలి ఖండించింది. నేరస్తులపై చట్ట సంస్థలు కఠిన చర్యలు చేపట్టాలని తీర్మానం చేసింది. ఎస్సీ, ఎస్టీలపై తరచుగా అత్యాచారాలకు పాల్పడటాన్ని కూడా మండలి గర్హించింది. ఈ నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
జాతీయ సమగ్రతా మండలి పిలుపు
Published Tue, Sep 24 2013 4:35 AM | Last Updated on Mon, Sep 17 2018 5:17 PM
Advertisement
Advertisement