తమిళనాడు గవర్నర్‌కు ఈసీ సిఫారసు
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం లేదంటూ..తమిళనాడులోని అరవకురిచి, తంజావూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలను రద్దు చేయాలంటూ ఎన్నికల సంఘం శనివారం గవర్నర్ కే రోశయ్యకు సిఫారసు చేసింది. ఆ నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు డబ్బును, ఇతర మార్గాలను ఉపయోగిస్తున్నారనడానికి రుజువులు లభించిన నేపథ్యంలో ఈసీ ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు స్థానాల్లో ఇప్పటివరకు రూ. 8 కోట్ల నగదు, 2,500 లీటర్ల మద్యంతో పాటు చీరలు, ధోవతీలు, వెండి ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రిగ్గింగ్, బూత్‌లను స్వాధీనం చేసుకోవడం, గొడవలు తదితర కారణాలతో ఎన్నికలను రద్దు చేసిన ఘటనలు గతంలోనూ జరిగాయని, అయితే, డబ్బుతో ఓటర్లను ప్రలోభపెడ్తున్నారనే కారణంతో ఎన్నికల రద్దుకు సిఫారసు చేయడం ఇదే ప్రథమమని ఈసీ పేర్కొంది. ఆ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తాజాగా మరోసారి తేదీలను నిర్ణయిస్తామని వెల్లడించింది. రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు అసెంబ్లీలోని అన్ని స్థానాల్లోనూ ఎన్నికలు పూర్తయి ఉండాలన్న నిబంధనేదీ లేదని గవర్నర్‌కు సమర్పించిన నివేదికలో ఈసీ స్పష్టం చేసింది. మొదట ఈ రెండు స్థానాలకు ఎన్నికలను మే 16 నుంచి మే 23కు వాయిదా వేయగా.. మే 21 నాడు భారీగా డబ్బు, మద్యం, పట్టుబడటంతో ఎన్నికను జూన్ 13వ తేదీకి ఈసీ వాయిదా వేసింది.
అక్కడ ఎన్నికలు రద్దు చేయండి!
Published Sun, May 29 2016 2:43 AM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM
Advertisement
Advertisement