'నా సోదరీమణులు చేసిన నేరమేమిటి?'
మహోబా: ట్రిపుల్ తలాక్ అంశాన్ని మతంతో ముడిపెట్టవద్దని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ విషయాన్ని మతంతో ముడిపెట్టవద్దని అన్నారు. ట్రిపుల్ తలాక్ విధానం ద్వారా ముస్లిం మహిళల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో హిందువుల కుటుంబాల్లో ఆడపిల్లల భ్రూణ హత్యలగురించి కూడా ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీలో మోదీ ఈ విషయాల గురించి మాట్లాడారు.
'బాలికల భ్రూణ హత్యలు మహాపాపం. ఇలాంటివాటిని నిలువరించేందుకు మా ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టింది. కూతుళ్లు, తల్లులు, సోదరీమణులను తప్పక రక్షించుకోవాలి. వీళ్లలో ఏ ఒక్కరినీ మతంతో ముడిపెట్టి చూడొద్దు. తల్లులు, సోదరీమణులను తప్పక గౌరవించాలి. ఈ విషయాన్ని మనమంతా కలిసి లేవనెత్తాలి. ఇప్పుడు తలాక్ విషయం చర్చకొచ్చింది. ఏ హిందువైనా బాలికల భ్రూణ హత్యలకు పాల్పడితే అతడిని జైలులో పెడతారు. కానీ, కేవలం ఫోన్ ద్వారా తలాక్ అని చెప్పి నా ముస్లిం సోదరీమణుల జీవితాలు ధ్వంసం చేస్తున్నారు. వారు చేసిన నేరం ఏమిటి? టీవీ చానెళ్లు దయచేసి తలాక్ విషయాన్ని హిందూ వర్సెస్ ముస్లింల అంశంగా మార్చొద్దు. అలాగే, బీజేపీ వర్సెస్ ఇతర రాజకీయ పార్టీల అంశంగా చూపొద్దు' అని మోదీ అన్నారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చాలా స్పష్టమైన వివరణ ఇచ్చింది. మహిళపై ఎలాంటి అఘాయిత్యాలు జరగొద్దని, మతం ఆధారంగా వివక్ష చూపొద్దని అందులో పేర్కొన్నాం. ప్రజస్వామ్యంలో చర్చ అనేది తప్పనిసరిగా ఉండాలి. కొన్ని పార్టీలు ఓట్ల కోసం ఈ 21వ శతాబ్దంలో కూడా మహిళలను వివక్షకు గురిచేస్తున్నారు. అసలు ఇది ఎలాంటి న్యాయం ? అని మోదీ ప్రశ్నించారు. రాజకీయాలకు, ఎన్నికలకు వాటి స్థానాలు వాటికున్నాయి. కానీ, రాజ్యాంగం ప్రకారం ముస్లిం మహిళలకు వారి హక్కులు అందించడమనేది ఈ దేశ ప్రజలతోపాటు ప్రభుత్వానికి ఉన్న బాధ్యత' అని మోదీ అన్నారు.