హిందువుల ఐక్యతే దేశానికి రక్ష
- ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్
అహ్మదాబాద్: హిందువుల ఐక్యతే దేశానికి రక్ష అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందూ సమాజం ప్రమాదంలో పడితే.. దేశమే ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. హిందూ దేశంగా భారత్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే హిందువులంతా ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆదివారమిక్కడ ముగిసిన మూడు రోజుల ఆరెస్సెస్ కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘హిందువులంతా ఏకతాటిపై నిలిచినట్లయితే దేశాభివృద్ధిని ఆపడం ఏ శక్తి తరమూ కాదు. గతంలో ప్రపంచానికి మార్గదర్శనం చేస్తూ భారత్ విశ్వగురువుగా నిలిచింది.
అప్పుడు ప్రపంచం శాంతియుతంగా ఉండేది. ఆ వైభవం మళ్లీ తీసుకురావాలంటే హిందువులంతా ఒక్కటి కావాలి’ అని పేర్కొన్నారు. ప్రజల్లో దేశభక్తి భావాలను పెంపొందించేందుకు, జాతి నిర్మాణంలో సంఘ్ పరివార్ తన పాత్ర పోషిస్తోందని చెప్పారు. సంఘ్‌ను బయట్నుంచి చూడొద్దని, అది చేసే మంచి కార్యక్రమాలను గమనించి సంఘ్‌లో చేరాలని ప్రజలకు సూచించారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనియాడుతూ సమాజంలోని అన్ని వర్గాల పట్ల సమదర్శనం కలిగి ఉండాలన్నారు.
‘ఘర్ వాపసీ’పై మౌనం.. ఇతర మతాల్లోకి మారిన వారిని తిరిగి హిందూమతంలోకి తీసుకువచ్చేందుకు తలపెట్టిన వివాదాస్పద ‘ఘర్ వాపసీ’ కార్యక్రమంపై భాగవత్ మౌనం పాటించారు. పరమత సహనం కలిగి ఉండాలన్న విషయాన్ని హిందూ ధర్మం ఎన్నో ఏళ్లుగా చెబుతూనే ఉందన్నారు. ఇతర మతాల్లోని మంచిని కూడా చూసే గొప్పదనం హిందూ మతానికి ఉందని చెప్పారు. ఇతర మతాలను కూడా సమ్మతించాలన్న విషయాన్ని హిందూ మతం చెబుతోందన్నారు.
‘ఇతర మతాలను అనుసరించేవారు మంచివారు కాదని కొన్ని మతాల వారు చెబుతుంటారు. కానీ వారిపట్ల కూడా సహనం కలిగి ఉండాలని హిందూ మతం చెబుతోంది. ప్రతి ఒక్కరిలో దేవుడిని చూడాలని పేర్కొంటోంది. గోమాత, తులసి, గంగా నదిని మనం దేవుళ్లుగా చూస్తాం’ అని చెప్పారు. కిందటి నెల కోల్‌కతాలో మాట్లాడుతూ భాగవత్ ఘర్ వాపసీని గట్టిగా సమర్థించారు. తర్వాత ఘర్ వాపసీ జోరందుకోవడంతో రాజకీయ దుమారం రేగింది. కిందటి వారమే భగవత్.. ప్రధాని మోదీని కలిశారు. ఈ నేపథ్యంలో ఘర్ వాపసీపై భగవత్ కాస్త మెత్తబడడం గమనార్హం.
‘రేప్‌లకు ప్రభుత్వం బాధ్యత వహించదు’
కాన్పూర్: మహిళలపై అత్యాచారాలు జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించదని, సమాజమే ఇలాంటి ఘటనలకు బాధ్యత వహించాలని ఓ మహిళా మంత్రి అనడం విమర్శలకు దారితీసింది. ఉత్తరప్రదేశ్‌లోని బదాయూ జిల్లాలో ఇటీవల ఓ బాలికపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రి అరుణ కోరి ఆదివారం మాట్లాడుతూ.. ‘ఈ అత్యాచారానికి ప్రభుత్వం బాధ్యత వహించదు.. చిన్నారులను వేధింపులకు గురి చేసే వారిపై వెంటనే కేసులు నమోదు చేస్తున్నాం. నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తున్నాం’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలు పార్టీల నేతలు, మహిళాసంఘాల నేతలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళలపై జరిగే అకృత్యాలకు అడ్డుకట్ట వేయకుండా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.