సాధించాలనే తపన ఉంటే ఎన్ని అడ్డంకులెదురైనా విజయం సాధించవచ్చు అని నిరూపించింది ముంబైకి చెందిన రితు రథీ తనేజా. వృతిరీత్యా ఆమె పైలట్. అభిరుచికి తగ్గట్లు యూట్యూబర్‌గా మారి ఎంతో మంది ఫాలోవర్లని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓ బిడ్డకు తల్లి కూడా. కానీ ఈ విజయాలేవీ అంత సులభంగా ఆమెకు దక్కలేదు. ఓ ఆడపిల్లకు చదువెందుకు దండగా అని నిందించే సమాజాన్ని ఎదుర్కొని, ఆటుపోట్లని అధిగమించింది. విదేశాల్లో ట్రైనింగ్ పూర్తిచేస్తానంటే.. అక్కడ ఏం అగోరించడానికి? అబ్బాయిలతో చెడు తిరుగుళ్లకు అలవాటుపడుతుంది.. పెళ్లి చేశాకే పంపించండి అంటూ బంధువుల సూటిపోటి మాటలన్నా తను సాధించలనుకున్నా లక్ష్యం వైపే పయనించింది. ఎన్ని అవరోధాలు ఎదురైనా అనుకున్నది సాధించి తీరాలి అనే తన సంకల్పమే రితుని నేడు స్థాయిలో నిలబెట్టింది. 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకొని ఎంతో మందికి స్పూర్తినింపుతోంది.
(ఫెయిర్ అండ్ లవ్లీ: హెచ్‌యూఎల్ సంచలనం )
ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రితూకి పాఠశాల స్థాయిలోనే పైలట్‌గా రాణించాలనే ఆసక్తి కలిగింది. ఈ ఆలోచనే రితు జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత తన లక్ష్యం కోసం నిరంతరం కష్టపడేది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత అమెరికాలోని ఓ ప్రముఖ సంస్థలో ట్రైనింగ్ కోసం దరఖాస్తు చేసుకుంది. తన పెళ్లి కోసం దాచిన డబ్బును చదువుకు కోసం ఖర్చుచేయమని తండ్రిని వేడుకుంది. ''విదేశాలకు ఒంటరిగా పంపిస్తే అబ్బాయిలతో చెడుతిరుగుళ్లు తిరుగుతుంది. చదివింది చాలు ఇక పెళ్లి చేయండి అని బంధువులు సూటిపోటి మాటలతో వేధించేవారు. కానీ అమ్మనాన్న మాత్రం నన్ను నమ్మి అమెరికా పంపించారు. ఏడాదిన్నర ట్రైనింగ్ అనంతరం ఇండియా తిరిగొచ్చా. కానీ ఖాళీలు లేక ఉద్యోగం దొరకలేదు. ఇలాంటి అవకాశం కోసమే అన్నట్లు ఎదురుచూసిన బంధువులు మళ్లీ నిందించడం మొదలుపెట్టారు. మేం అప్పుడే చెప్పాం కదా ఇలాంటిదేదో జరుగుతుందన్న దెప్పిపొడిచే మాటలతో మానసికంగా వేధించేవారు. మరోపక్క బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో అమ్మ ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. నాన్న పరిస్థితి చూసి చాలా భాదపడ్డా. ఇంకో వైపు కుటుంబ భారం. దీంతో పార్ట్ టైం జాబ్ చేస్తూ రోజుకి 7 గంటలు చదివేదాన్ని. కొన్నినెలలకే ఓ ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా ఉద్యోగం సంపాదించాను. ఇక నా ఆనందానికి అవధుల్లేవు . ఇన్నాళ్లు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అంటూ తెగ సంబరపడ్డాను'' అని రితూ పేర్కొంది.
పైలట్‌గా నెల రోజుల్లోనే 60 విమానాల్లో ప్రయాణం చేసింది. నాలుగు సంవత్సరాల్లోనే కెప్టెన్‌గా పదోన్నతి పొందింది. నా కూతురు కెప్టెన్ అని నాన్న చెబుతుంటే ఆ ఆనుభూతి మాటల్లో చెప్పలేనిదంటూ రితూ భావోద్వేగానికి గురైంది. ఆమె యూట్యూబ్ ఛానల్‌కి 3 లక్షలకు పైగానే సబ్‌స్కైబర్లు ఉన్నారు. ‘ఏ బంధువులైతే తనని నిందించారో ఇప్పుడు వాళ్లే నన్ను చూసి గర్వపడుతున్నారు. ఇదే కదా అసలైన విజయం’ అంటూ ఇంటర్వ్యూని ముగించింది. (అంతరిక్షంలోకి ‘ప్రైవేటు’ మంచిదే: శివన్ )
Comments
Please login to add a commentAdd a comment