తమిళసినిమా (చెన్నై): ప్రముఖ నటుడు సంతానంపై హత్యా బెదిరింపుల కేసు నమోదైంది. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. తమిళ చిత్ర పరిశ్రమలో సంతానం హాస్యనటుడిగా ఎదిగి, అనంతరం కథానాయకుడిగా రాణిస్తున్నారు. ఈయన చెన్నై, వలసరవాక్కం, చౌదరినగరానికి చెందిన కాంట్రాక్టర్ షణ్ముగసుందరంతో కలసి కుండ్రత్తూర్ సమీపంలోని కోవూర్ ప్రాంతంలో కల్యాణ మండపాన్ని కట్టడానికి సన్నాహాలు చేశారు. అందుకు తన భాగంగా భారీ మొత్తాన్ని షణ్ముగసుందరానికి ఇచ్చారు.
తరువాత కల్యాణ మండపం నిర్మాణాన్ని విరమించుకున్నారు. దీంతో తను చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వవలసిందిగా షణ్ముగసుందరంను సంతానం అడగ్గా కొంత డబ్బు మాత్రం ఇచ్చి మిగిలిన డబ్బును ఇవ్వకండా కాలం గడపడంతో సోమవారం సంతానం తన మేనేజర్ రమేష్‌తో కలసి వలసరవాకంలోని షణ్ముగసుందరం కార్యాలయానికి వెళ్లి డబ్బు తిరిగి ఇవ్వవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగి కొట్టుకునే స్థాయికి వెళ్లింది.
ఆ సమయంలో షణ్ముగసుందరంతో పాటు, ఆయన మిత్రుడు, స్థానిక బీజేపీ నాయకుడు, న్యాయవాది ప్రేమానంద్ ఉన్నారు. కొట్లాటలో ఈ ముగ్గురికీ దెబ్బలు తగిలాయి. నటుడు సంతానం వెంటనే స్థానిక వడపళనిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అదే ఆస్పత్రిలో షణ్ముగసుందరం చేరారు. కాగా, బీజేపీ నాయకుడు ప్రేమానంద్‌కు గాయాలయ్యాయన్న విషయం తెలిసిన పార్టీ కార్యకర్తలు ఆస్పత్రికి వచ్చి ఆందోళనకు దిగారు.
అనంతరం సోమవారం రాత్రి వలసరవాక్కం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సంతానంపై కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు సంతానంపై మూడు సెక్షన్లలో కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను విచారించడానికి ప్రయత్నించగా సంతానం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. దీంతో సంతానంను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సంఘటన కోలీవుడ్‌లో కలకలానికి దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment