జైలులో శశికళ.. భర్త నటరాజన్‌కు చిక్కులు
చెన్నై: ఓ పక్క అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమాస్తుల కేసులో జైలులో ఉండగా ఇప్పుడు ఆమె భర్త వికే నటరాజన్‌కు కూడా కేసుల గండం మొదలైంది. సీబీఐ అధికారులు ఆయనపై గతంలో నమోదు చేసిన కేసులు తిరగబడ్డాయి. మద్రాస్ కోర్టులో ఈ కేసు ఇప్పుడు వేగం పుంజుకుంది.1994లో లెక్సస్ కార్ల దిగుమతికి సంబంధించి సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు నటరాజన్ మరో ముగ్గురుపై వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి.
ఈ కేసు విషయంలో గత ఐదేళ్లుగా అప్పీళ్లతో నటరాజన్ ముందుకెళుతూ ఉన్నారు. అయితే, ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని ఇటీవల మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సీబీఐకి మెమోలు పంపించారు. దీంతో ఈ కేసు చివరి విచారణ ఈ నెల 27న జస్టిస్ ఎస్ భాస్కరన్ ధర్మాసనం ముందు జరగనుంది. 1994లో తీసుకొచ్చిన లెక్సస్ కార్లను 1993 మోడల్‌గా ఫేక్ డాక్యుమెంట్లు చూపించి, అప్పటికే వాడిన కార్లుగా చూపించారు. అవి నకిలీ పత్రాలని, వీరే కావాలని అలా సృష్టించారని, దాని వల్ల దాదాపు కోటి రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చిందని ఈడీ అంచనా వేసింది.