sasikala husband
-
నటరాజన్ లేకపోతే జయలలిత లేదు
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత జయలలితకు రాజకీయ సహాయకుడిగా శశికళ భర్త నటరాజన్ వ్యవహరించేవారు. ఒకానోక దశలో రాజకీయాలను వదిలేద్దామని నిర్ణయించుకున్న జయలలితను అడ్డుకున్న ఆయన.. తర్వాత ఆమె వెన్నంటి ముందుకు నడిపించారు. ‘జయ రాజకీయ నీడ’గా నటరాజన్‌ను అభివర్ణించే విశ్లేషకులు ఆయన మృతి నేపథ్యంలో ప్రస్థానాన్ని గుర్తు చేస్తున్నారు. మార్చి 1989 జయలలిత ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సభలో జరిగిన ఘోర అవమానానికి మనస్థాపం చెంది తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ లేఖను తన కార్యదర్శి ద్వారా ఆమె స్పీకర్‌కు పంపారు. అయితే పోయెస్ గార్డెన్‌లోని తన అనుచరుల ద్వారా విషయం తెలుసుకున్న నటరాజన్ ఆ లేఖను తన దగ్గరికి తెప్పించుకుని దానిని జాగ్రత్తగా తన ఇంట్లో భద్రపరిచారు. తర్వాత జయను ఒప్పించి ఆమె నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేశారు. అదే ఏడాది తేనీ ఈశ్వరన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎంకే ప్రభుత్వం నటరాజన్ ఇంటిపై తనిఖీలకు ఆదేశించింది. ఆ సమయంలో ఈ లేఖ బయటపడగా.. అధికారులు దానిని మీడియాకు కూడా విడుదల చేశారు. ఆ రకంగా జయను రాజకీయ సన్యాసం తీసుకోనీయకుండా అడ్డుకున్న నటరాజన్ తర్వాత.. ఆమె రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించారు. జయను నేనే సీఎం చేశా... ఈ మాట తరచూ నటరాజన్ నోటి నుంచి మీడియా పూర్వకంగానే వెలువడుతూ ఉండేది. తమిళ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఉండాలని ఆయన ఎప్పటికప్పుడు పరితపిస్తూ ఉండేవారు. ఏదో ఒక రోజు జయలలిత ప్రధాని అవుతారని.. తాను తమిళనాడు ముఖ్యమంత్రిని అయి తీరుతానని నటరాజన్ తరచూ అనుచరులతో ప్రస్తావిస్తూ ఉండేవారంట. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నటరాజన్ మురుతప్ప.. ప్రభుత్వ ఉద్యోగిగా.. వ్యాపారస్థుడిగా.. అంతకు మించి జయలలితకు నమ్మిన బంటుగా ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన ఆయన.. ఆ సమయంలో కలెక్టర్‌గా ఉన్న చంద్రకళకు సహయకుడిగా పని చేశారు. ఆ సమయంలోనే ఆయన భార్య శశికళ వీడియో పార్లర్ ద్వారా జయలలితతో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం క్రమంగా బలపడి.. ఎంజీఆర్ మరణం తర్వాత నటరాజన్-శశికళ దంపతులు జయ పంచన చేరారు. అప్పటి నుంచి ఆమె తీసుకునే రాజకీయ నిర్ణయం ప్రతీదాంట్లో నటరాజన్ తన ప్రభావం చూపుతూ వచ్చారు. నటరాజన్‌కి ఉన్న రాజకీయ పరిజ్ఞానాన్ని నమ్మి చీఫ్, హోం సెక్రెటరీల నియామకం దగ్గరి నుంచి.. నిధుల కేటాయింపులో సైతం ఆయన సలహాలు తీసుకుని జయలలిత నిర్ణయాలు ప్రకటించేవారు. అదిగో ఆ వ్యవహారమే తర్వాత వివాదాస్పదంగా మారింది. జయను చాలా విషయాల్లో ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నాడీఎంకే శ్రేణుల నుంచి కూడా విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ ఆమె మాత్రం నటరాజన్‌కు ప్రాధాన్యం ఇవ్వటం మానలేదు. జాతీయ స్థాయి నేతలు సైతం తన ఇంట ఆతిథ్యం తీసుకునేంత స్థాయికి నటరాజన్ పేరును అప్పటికే ఆయన సంపాదించుకున్నారు. అయితే ఒకానోక దశలో తన హోదాకే ఎసరు పెట్టే స్థాయికి నటరాజన్ చేరుకోవటం, పైగా మన్నార్గుడి మాఫియా పేరిట అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో ఆయన్ని జయలలిత వేద నిలయానికి దూరం పెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఆయన్ని రాజకీయ ముఖచిత్రం నుంచి పక్కకు తప్పుకునేలా చేశాయి. జయలలిత మరణానంతరం తిరిగి తెరపైకి వచ్చిన నటరాజన్.. రాజకీయాలకు మాత్రం దూరంగానే ఉన్నారు. చివరకు అక్రమాస్తుల కేసులో భార్య శశికళ అరెస్ట్ తర్వాత ఆరోగ్యం బాగా క్షీణించటంతో తుదిశ్వాస విడిచారు. -
శశికళ భర్తకు జైలు శిక్ష : వెంటనే ఆస్పత్రి పాలు
సాక్షి, చెన్నై : శశికళ భర్త నటరాజన్ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. పన్ను ఎగవేత కేసులో ట్రయల్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆయన మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. దీంతో నటరాజన్‌ను వెనువెంటనే ఆస్పత్రికి తరలించారు. నటరాజన్ ఇటీవలే చెన్నై హాస్పిటల్లో కిడ్నీ ఆపరేషన్‌తో పాటు, కాలేయ మార్పిడి చేయించుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఏ వ్యాధితో ఆసుపత్రి పాలయ్యారో ఇంకా తెలియరాలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత పదవిలో ఉన్న కాలంలో నటరాజన్ తమిళనాడు ప్రభుత్వంలో బ్యూరోక్రాట్‌గా పనిచేసేవారు. అనంతరం నటరాజన్, శశికళ ఇద్దరూ పోయెస్ గార్డెన్‌లోకి మారిపోయారు. నటరాజన్‌తో పాటు మరో ముగ్గురు కూడా కుట్ర, మోసం, ఫోర్జరీ, పన్ను ఎగవేతలకు పాల్పడ్డారని తెలిసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొత్త కారు సెకండ్‌హ్యాండ్ అని చెప్పి కస్టమ్ శాఖను మోసగించడంతో నటరాజన్‌తో పాటు, శశికళ అక్క కుమారుడు భాస్కరన్, మరో ఇద్దరికీ సీబీఐ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షలను మద్రాస్ హైకోర్టు సమర్థించింది. 1994 సెప్టెంబర్ 6వ తేదీన నటరాజన్ లండన్ నుంచి లెక్సెస్ అనే లగ్జరీకారును తమిళరసి పబ్లికేషన్ పేరిట దిగుమతి చేసుకున్నారు. కాగ, తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో శుక్రవారం రాత్రి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జయ, శశికళ వ్యక్తిగత గదుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. -
శశికళ భర్తకు షాక్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళ కుటుంబానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అక్రమ ఆస్తుల కేసులో ‘చిన్నమ్మ’ కారాగారవాసం అనుభవిస్తుండగా తాజాగా ఆమె భర్తకు కూడా జైలు శిక్ష ఖరారైంది. పన్ను ఎగవేత కేసులో ఆయనను ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించి, శిక్ష విధించగా మద్రాస్ హైకోర్టు సమర్థించింది. టయోటా లెక్సస్ కారు కొనుగోలు చేసినప్పుడు ఆయన పన్ను ఎగ్గొట్టినట్టు రుజువుకావడంతో ట్రయల్ కోర్టు నటరాజన్‌తో పాటు మరో ముగ్గురికి ప్రత్యేక కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 1994లో కొనుగోలు చేసిన లెక్సస్ కారును 1993 మోడల్‌గా చూపించి పన్ను ఎగవేసినందుకు సీబీఐ, ఈడీ వేర్వేరుగా నిందితులు నలుగురిపై కేసు నమోదు చేశాయి. అసలైన ఇన్వాయిస్ను మార్చి రూ. 1.06 కోట్లు ఎగ్గొట్టినట్టు నిర్ధారణయింది. 2010లో ట్రయల్ కోర్టు విధించిన శిక్షపై హైకోర్టులో అప్పీలు చేయగా అక్కడ కూడా వారికి ఎదురుదెబ్బ తగిలింది. -
జైలులో శశికళ.. భర్త నటరాజన్‌కు చిక్కులు
చెన్నై: ఓ పక్క అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమాస్తుల కేసులో జైలులో ఉండగా ఇప్పుడు ఆమె భర్త వికే నటరాజన్‌కు కూడా కేసుల గండం మొదలైంది. సీబీఐ అధికారులు ఆయనపై గతంలో నమోదు చేసిన కేసులు తిరగబడ్డాయి. మద్రాస్ కోర్టులో ఈ కేసు ఇప్పుడు వేగం పుంజుకుంది.1994లో లెక్సస్ కార్ల దిగుమతికి సంబంధించి సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు నటరాజన్ మరో ముగ్గురుపై వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. ఈ కేసు విషయంలో గత ఐదేళ్లుగా అప్పీళ్లతో నటరాజన్ ముందుకెళుతూ ఉన్నారు. అయితే, ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని ఇటీవల మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సీబీఐకి మెమోలు పంపించారు. దీంతో ఈ కేసు చివరి విచారణ ఈ నెల 27న జస్టిస్ ఎస్ భాస్కరన్ ధర్మాసనం ముందు జరగనుంది. 1994లో తీసుకొచ్చిన లెక్సస్ కార్లను 1993 మోడల్‌గా ఫేక్ డాక్యుమెంట్లు చూపించి, అప్పటికే వాడిన కార్లుగా చూపించారు. అవి నకిలీ పత్రాలని, వీరే కావాలని అలా సృష్టించారని, దాని వల్ల దాదాపు కోటి రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చిందని ఈడీ అంచనా వేసింది. -
శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం!
తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ భర్త నటరాజన్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. నటరాజన్‌కు శ్వాసకోశ సమస్యలు రావడంతో ఆయన ఇబ్బంది పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనకు ఊపిరి అందడం లేదని చెప్పడంతో ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చామని అన్నారు తప్ప.. తదుపరి సమాచారం ఏమీ వెల్లడించలేదు. దాంతో నటరాజన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న అనుమానాలు తలెత్తాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు శశికళ సిద్ధం అవుతున్న నేపథ్యంలోనే ఉన్నట్టుండి నటరాజన్ ఆస్పత్రి పాలు కావడం పలువురిని ఆందోళనకు గురిచేసింది. ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేయడంతో, ఎమ్మెల్యేలంతా కలిసి తమ శాసనసభా పక్ష నేతగా 62 ఏళ్ల శశికళను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసిన శశికళ, తాను ప్రభుత్వం ఏర్పాటుచేస్తానని చెప్పారు. ఆమె ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది.