
సాక్షి, చెన్నై : శశికళ భర్త నటరాజన్ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. పన్ను ఎగవేత కేసులో ట్రయల్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆయన మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. దీంతో నటరాజన్‌ను వెనువెంటనే ఆస్పత్రికి తరలించారు. నటరాజన్ ఇటీవలే చెన్నై హాస్పిటల్‌లో కిడ్నీ ఆపరేషన్‌తో పాటు, కాలేయ మార్పిడి చేయించుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఏ వ్యాధితో ఆసుపత్రి పాలయ్యారో ఇంకా తెలియరాలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత పదవిలో ఉన్న కాలంలో నటరాజన్ తమిళనాడు ప్రభుత్వంలో బ్యూరోక్రాట్‌గా పనిచేసేవారు. అనంతరం నటరాజన్, శశికళ ఇద్దరూ పోయెస్ గార్డెన్‌లోకి మారిపోయారు.
నటరాజన్‌తో పాటు మరో ముగ్గురు కూడా కుట్ర, మోసం, ఫోర్జరీ, పన్ను ఎగవేతలకు పాల్పడ్డారని తెలిసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొత్త కారు సెకండ్‌హ్యాండ్ అని చెప్పి కస్టమ్ శాఖను మోసగించడంతో నటరాజన్‌తో పాటు, శశికళ అక్క కుమారుడు భాస్కరన్, మరో ఇద్దరికీ సీబీఐ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షలను మద్రాస్ హైకోర్టు సమర్థించింది. 1994 సెప్టెంబర్ 6వ తేదీన నటరాజన్ లండన్ నుంచి లెక్సెస్ అనే లగ్జరీకారును తమిళరసి పబ్లికేషన్ పేరిట దిగుమతి చేసుకున్నారు. కాగ, తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో శుక్రవారం రాత్రి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జయ, శశికళ వ్యక్తిగత గదుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.